న్యూయార్క్: అణ్వాయుధాల నిషేధం కోసం తొలి చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. శుక్రవారం సంబంధిత తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటేయగా, నెదర్లాండ్స్ వ్యతిరేకంగా ఓటేసింది. సింగపూర్ గైర్హాజరైంది.
అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలు, తయారీ, సేకరణ, నిల్వ, వాడకం వంటి అన్ని కార్యక్రమాలను ఒప్పందం నిషేధించింది. ఈ ఆయుధాల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది. అయితే అణుశక్తి దేశాలైన భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ తదితరాలు ఈ ఒప్పందం కోసం ఈ ఏడాది మార్చిలో జరిగిన చర్చలను బహిష్కరించాయి.