లోకల్లో నేరాలు తగ్గాయట..!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య తగ్గాయి. గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలలో 929 నేరాలు నమోదు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 909 నేరాలు (నాలుగు శాతం తక్కువ) నమోదయ్యాయి. అయితే ఈ గణాంకాలను సామాజిక కార్యకర్తలు కొట్టిపారేస్తున్నారు. రైళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మహిళా వేధింపులు నిత్యకృత్యంగా మారిన ప్రస్తుత తరుణంలో నేరాల సంఖ్య తగ్గిందని రైల్వే గణాంకాలు పేర్కొనడం విడ్డూరంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఇటీవల సెంట్రల్ రైల్వే పరిధిలోని రైల్వేస్టేషన్ల ఆవరణలో మహిళా ప్రయాణికుల కోసం ఫిర్యాదు బాక్సులను ఏర్పాటుచేశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి కనిపించకుండా పోయాయని సామాజిక కార్యకర్త ఒకరు ఆరోపించారు. మరికొంతమంది ప్రయాణికులు వేధింపులకు భయపడి తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఆశ్రయించడానికి ఇష్టపడడంలేదని డివిజినల్ రైల్వేకు చెందిన అధికారి అనికేట్ ఘమండి తెలిపారు. ఈ కారణం వల్ల కూడా ఫిర్యాదుల సంఖ్య తగ్గి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వెస్టర్న్ రైల్వే డీసీపీ దీపక్ దేవ్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది కొంతమంది ఘరానా నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు.
మత్తుపదార్థాలను సేవించే వారిని పట్టుకోవడం కోసం తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. లైంగిక వేధింపులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ‘నిర్భయ’ పేరుతో ఈ ఏడాది ఇటీవల ఓ ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్క్వాడ్ సివిల్ డ్రెస్సుల్లో రైళ్లలోని మహిళా బోగీల్లో, ప్లాట్‌ఫాంలపై కూడా సంచరిస్తూ ఉంటారని చెప్పారు. ప్రతి జీఆర్పీ చౌకీలలో నమోదైన మహిళలు, పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరిస్తూ ఉండాలని సెంట్రల్ రైల్వే జీఆర్పీ డీసీపీ రూపాలి అంబురే ఆదేశించారు. మరోపక్క రద్దీ సమయంలో చౌకీలలో తక్కువ మంది సిబ్బందిని ఉంచి, స్టేషన్ ప్లాట్‌ఫాంలపై ఎక్కువ మంది సిబ్బందిని ఉంచేందుకు సెంట్రల్ రైల్వే జీఆర్పీ నిర్ణయించింది.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన నేరాల వివరాలు ఇలా ఉన్నాయి... అత్యాచారం కేసు ఒక్కటి నమోదు కాగా అది పరిష్కరించబడింది. వేధింపుల కేసులు 12 నమోదు కాగా అన్నింటినీ పరిష్కరించారు. హత్య కేసులు ఏడు నమోదు కాగా నాలుగు పరిష్కరించబడ్డాయి. మోసగించిన కేసులు 17 నమోదు కాగా ఆరు కేసులను పరిష్కరించారు. అదేవిధంగా దోపిడీలకు సంబంధించి 175 కేసులు నమోదు కాగా 114 కేసులను పరిష్కరించారు.
మొత్తం దొంగతనాల కేసులు 634 నమోదు కాగా 320 పరిష్కరించబడ్డాయి. ఇలా మొత్తం 909 కేసులు నమోదు కాగా 494 కేసులు పరిష్కరించినట్లు గణాంకాల ద్వారా వెల్లడి అవుతోంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబై నగర ప్రజలకు రైలు ప్రయాణం ఎక్కువగా సౌకర్యంగా ఉండడంతో లక్షలాదిమంది ప్రజలు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. దీంతో ముంబై రైల్వేను ‘లైఫ్‌లైన్’గా పిలుస్తుంటారు. రైళ్లలో నేరాల సంఖ్యను శూన్యం చేయడమే తమ ముఖ్య ఉద్దేశంగా రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.