నంబర్ చెప్పమన్నాడు.. 25వేలు డ్రా చేసేశాడు!
యాడికి : బ్యాంకు ఖాతాదారుడికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అతడి నుంచి ఏటీఎం నంబరు తెలుసుకుని రూ.25వేల నగదు కాజేసిన మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బూరుగులకు చెందిన మధుసూదన్‌కు అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) బ్రాంచిలో ఖాతా ఉంది. రెండు రోజుల క్రితం ఇతడికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి ‘మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు నంబర్ చెప్పండి’ అని అడిగాడు.
మధుసూదన్ మారుమాట్లాడకుండా నంబర్ చెప్పగానే కాసేపటికే రూ.25వేల నగదు విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఖంగుతిన్న అతడు వెంటనే అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన నంబరుకు ఫోన్ చేయగా అది పనిచేయలేదు. దీనిపై బ్యాంకు అధికారులను సంప్రదించగా ఢిల్లీలో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసినట్లు చూపిస్తోందని చెప్పారు. ఫిర్యాదు చేయడానికని శుక్రవారం యాడికి పోలీసుస్టేషన్‌కు వెళితే బూరుగుల తమ మండల పరిధిలోకి రాదని పోలీసులు తిప్పి పంపారు. ఫేక్ ఫోన్‌కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీహెచ్ మేనేజర్ సూచించారు.