Nutritional Value
-
జీడిమామిడి పండు.. పోషకాలు మెండు
రాజానగరం(తూర్పుగోదావరి జిల్లా): మెట్ట ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటలలో జీడిమామిడి ప్రధానమైనది. ఈ పంటలో జీడిగింజల ద్వారానే ఆదాయం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే జీడిగింజల ఉత్పత్తికి ప్రధాన కారణంగా ఉన్న జీడి మామిడి పండ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అవి తోటల్లో చెట్ల కింద రాలిపోతూ, కుళ్లిపోతూ ఉంటాయి. ఈ విధంగా దేశంలో సాలీనా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృథా అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మంచి రంగు, రుచి మంచి రంగు, రుచి, ఘాటైన వాసన కలిగివున్న జీడిమామిడి పండు తినగానే గొంతులో ఒక రకమైన జీర వస్తుంది. అందుకే చాలామంది దీనిని తినడానికి ఆసక్తిని చూపించరు. ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని పండు కావడం, త్వరగా కుళ్లిపోయే స్వభాగం కలిగివుండంతో జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలోనే కలిసిపోతున్నాయి. వాస్తవానికి వీటిలో అనేక రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే వీటి వినియోగం పై దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) గ్రామీణ రైతు మహిళలకు శిక్షణ ఇస్తూ, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి. పలు రకాల ఆహార ఉత్పత్తులు జీడిమామిడి పండ్లతో పలురకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటి రసంతో శీతల పానీయాలు, గుజ్జుతో జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, చట్నీ, ఊరగాయ, కాండీ, టూటీ ఫ్రూటీ, టాఫీ, వినిగర్, తయారు చేయవచ్చు. గోవాలో లభించే ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం జీడిమామిడి పండ్ల రసం నుంచి తయారవుతుంది. రసం తీసే విధానం బాగా ముగ్గిన జీడిమామిడి పండ్లను సేకరించి, నీటితో శుభ్రం చేసిన తరువాత చేతులతోగాని, ప్రత్యేక మెషీన్‌తోగాని రసాన్ని తీస్తారు. ఇందుకు జ్యూస్ ఎక్స్‌ట్రాక్టరుని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పండు నుంచి 70 శాతం రసాన్ని తీయడమే కాకుండా గంటకు 150 కిలోల పండ్ల నుంచి రసాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రసంలో ఉన్న టెనిన్స్‌ని (గొంతులో జీరను కలిగించే వగరు) తొలగించడానికి సగ్గు బియ్యంతో తయారు చేసిన గంజిని ఉపయోగిస్తుంటారు. జీడిమామిడి పండ్లతో మామిడి కాయల మాదిరిగా ఆవకాయ పెట్టవచ్చు. తీరిక సమయంలో తినేందుకు పొటాటో చిప్స్ మాదిరిగా చిప్స్ కూడా తయారు చేసుకోచ్చు. పిప్పితో ఉపయోగాలు ► రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. ►వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది. ఈ కంపోస్టులో 1.60 శాతం నత్రజని, 0.44 శాతం భాస్వరం, 0.58 శాతం పొటాషియం ఉంటాయి. ►గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్ తయారీకి వాడతారు. ►ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్’ అనే ముఖ్యమైన ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్, చాస్, జెల్లీ, కెచప్ తయారీలలో చిక్కదనం రావడానికి తోర్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను కూడా వాడతారు. ఔషధకారిగా.. ►ఈ పండులో లభ్యమయ్యే సి–విటమిన్ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ►జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ►మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు ఆరగించడం ద్వారా అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు. ►జీడిమామిడి రసంతో తయారు చేసిన ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం పెద్దలకు, పిల్లలకు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ►వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తుంటారు. యువతకు ఉపాధి ఫుడ్ ప్రాసెంగ్ యూనిట్ల ద్వారా జీడిమామిడి పండ్లను కూడా ఉపయోగంలోకి తీసుకువచ్చే ప్రొసెస్‌ని చేపడితే మెట్ట ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధిని చూపవచ్చు. ఈ పండ్ల నుంచి తీసిన రసాన్ని యాప్సీ, ఫ్రూటీ, మాజాల మాదిరిగా టెట్టా ప్యాకింగ్ చేసి విక్రయించే ప్రక్రియ ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళలో ఇప్పటికే జీడిమామిడి పండ్లతో తయారుచేసిన రసాన్ని శీతల పానీయంగా విక్రయిస్తున్నారు. పచ్చడి పెట్టుకోవచ్చు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జీడిమామిడి పండ్లతో ఏఏ రకాల ఆహార పదార్థాలను, రసాలను, జ్యూస్‌లను, జామ్‌లను తయారు చేయవచ్చునో గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. వీటితో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అదెలాగో శిక్షణలో తెలియజేస్తున్నాం. – డాక్టర్ వీఎస్‌జీఆర్ నాయుడు, ప్రధానాధికారి, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా 600 మందికి శిక్షణ ఇచ్చాం కేరళ, గోవాలో మాదిరిగా జీడిమామిడి పండ్లను వినియోగం లోకి తీసుకువచ్చేందుకు డీసీసీడీ కొచ్చిన్ (కేరళ) సహకారంతో కేవీకేలో బ్యాచ్‌ల వారీగా గత ఆరు సంవత్సరాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం. – జేవీఆర్ సత్యవాణి, గృహ విజ్ఞాన విభాగం అధికారి, కేవీకే, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా -
కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..
కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి. న్యూట్రిషన్ విలువలు ► మొత్త కాలరీలు-16 ►ఆహార ఫైబర్ - 2.6 గ్రా ►కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా ►కొవ్వులు - 158 మి.గ్రా ►నీటి శాతం - 87.4 గ్రా ►ప్రోటీన్ - 930 మి.గ్రా అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది. 1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు. 2. డయాబెటిస్ కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది. రక్తంలో షుగర్ లెవల్స్‌లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. 3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి. 4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కాకరకు గల యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు. 5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్.. ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. 6. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 7. అధిక బరువును తగ్గిస్తుంది. కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. 8. జుట్టుకు మెరుపు అందిస్తుంది. కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్‌ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్‌గా ఉండటంలో సహాయపడుతుంది. 9. చర్మాన్ని అందంగా చేస్తుంది మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది. -
నేను వెరీ'గుడ్డు'...
అక్టోబర్ 14 వరల్డ్ ఎగ్ డే గుడ్డు చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే, పోషకాల్లో ఇది మిన్నగా ఉంటుంది. ధరలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పిల్లలు రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పెద్దలు తింటే పనుల వల్ల నీరసించకుండా ఉంటారు. వారానికి కనీసం నాలుగు గుడ్లు తింటున్నట్లయితే డయాబెటిస్ దరి చేరదని తాజా ఫలితాలు కూడా తేల్చాయి. గుడ్డులో కండరాల ఎదుగుదలకు దోహదపడే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపును కాపాడే విటమిన్-ఎ, రోగ నిరోధకతను పెంచే విటమిన్-బి, ఎముకలను పటిష్టంగా ఉంచే విటమిన్-డి, మేనివర్ఛస్సును కాపాడే విటమిన్-ఇ, రక్తం గడ్డకట్టేందుకు దోహదపడే విటమిన్-కె వంటి విటమిన్లతో పాటు సక్రమమైన శరీర పోషణకు అవసరమైన కీలక ఖనిజ లవణాలు, శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మరే పదార్థంలోనూ ఇన్ని పోషకాలు ఉండవు. అందుకే గుడ్డు... పోషకాల విలువలో వెరీగుడ్డు. గుడ్డు గురించి విశేషాలు... గుడ్డులోని పోషక విలువల సంగతి చాలామందికి తెలిసినదే. గుడ్డు బలవర్ధకమైన ఆహారం అనే సంగతి కూడా తెలిసిందే. గుడ్డు గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... ♦ విటమిన్-డి పుష్కలంగా లభించే పదార్థాల్లో గుడ్డులోని పచ్చసొనదే అగ్రస్థానం. ♦ గుడ్డులో కొవ్వులు 5 గ్రాములకు మించి ఉండవు. గుడ్డు వల్ల శరీరానికి చేరే కేలరీలు కూడా 78 మాత్రమే. ♦ గుడ్డులో మన శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తుల విలువలో తల్లిపాల తర్వాతి స్థానం గుడ్డుదే. ♦ గుడ్డు పెంకు రంగుకు, గుడ్డులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. గుడ్డును పెట్టే పెట్ట జాతిబట్టి పెంకు రంగు మారుతుంది. ♦ అరకానా జాతికి చెందిన కోడిపెట్టలు రంగు రంగుల గుడ్లు పెడతాయి. ఇవి పెట్టే గుడ్ల పెపైంకులు గులాబి, నీలం, ఆకుపచ్చ వంటి రకరకాల రంగుల్లో ఉంటాయి. ♦ గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉంటే, మనది మూడో స్థానం. గుడ్డు రికార్డు గుడ్డు బరువు సాధారణంగా 50-70 గ్రాముల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వద్ద మెల్లర ప్రాంతంలో 1896 సంవత్సరంలో స్టాఫోర్డ్ అనే ఆసామి పెరట్లో పెంచుకుంటున్న కోడిపెట్ట అత్యంత భారీ గుడ్డు పెట్టింది. ఏకంగా 12.2 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉన్న ఆ గుడ్డు బరువు 340 గ్రాములు. గిన్నెస్ బుక్‌లోకి ఎక్కిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇంగ్లాండ్‌లోనే 2010లో ఇప్స్విచ్ ప్రాంతంలో ఒక కోడిపెట్ట 8.3 అంగుళాల పొడవు, 3.5 అంగుళాల వెడల్పుతో గుడ్డు పెట్టింది.