నేను వెరీ'గుడ్డు'...
అక్టోబర్ 14 వరల్డ్ ఎగ్ డే
గుడ్డు చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే, పోషకాల్లో ఇది మిన్నగా ఉంటుంది. ధరలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పిల్లలు రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పెద్దలు తింటే పనుల వల్ల నీరసించకుండా ఉంటారు. వారానికి కనీసం నాలుగు గుడ్లు తింటున్నట్లయితే డయాబెటిస్ దరి చేరదని తాజా ఫలితాలు కూడా తేల్చాయి. గుడ్డులో కండరాల ఎదుగుదలకు దోహదపడే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి.
కంటిచూపును కాపాడే విటమిన్-ఎ, రోగ నిరోధకతను పెంచే విటమిన్-బి, ఎముకలను పటిష్టంగా ఉంచే విటమిన్-డి, మేనివర్ఛస్సును కాపాడే విటమిన్-ఇ, రక్తం గడ్డకట్టేందుకు దోహదపడే విటమిన్-కె వంటి విటమిన్లతో పాటు సక్రమమైన శరీర పోషణకు అవసరమైన కీలక ఖనిజ లవణాలు, శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మరే పదార్థంలోనూ ఇన్ని పోషకాలు ఉండవు. అందుకే గుడ్డు... పోషకాల విలువలో వెరీగుడ్డు.
గుడ్డు గురించి విశేషాలు...
గుడ్డులోని పోషక విలువల సంగతి చాలామందికి తెలిసినదే. గుడ్డు బలవర్ధకమైన ఆహారం అనే సంగతి కూడా తెలిసిందే. గుడ్డు గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు...
♦ విటమిన్-డి పుష్కలంగా లభించే పదార్థాల్లో గుడ్డులోని పచ్చసొనదే అగ్రస్థానం.
♦ గుడ్డులో కొవ్వులు 5 గ్రాములకు మించి ఉండవు. గుడ్డు వల్ల శరీరానికి చేరే కేలరీలు కూడా 78 మాత్రమే.
♦ గుడ్డులో మన శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తుల విలువలో తల్లిపాల తర్వాతి స్థానం గుడ్డుదే.
♦ గుడ్డు పెంకు రంగుకు, గుడ్డులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. గుడ్డును పెట్టే పెట్ట జాతిబట్టి పెంకు రంగు మారుతుంది.
♦ అరకానా జాతికి చెందిన కోడిపెట్టలు రంగు రంగుల గుడ్లు పెడతాయి. ఇవి పెట్టే గుడ్ల పెపైంకులు గులాబి, నీలం, ఆకుపచ్చ వంటి రకరకాల రంగుల్లో ఉంటాయి.
♦ గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉంటే, మనది మూడో స్థానం.
గుడ్డు రికార్డు
గుడ్డు బరువు సాధారణంగా 50-70 గ్రాముల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వద్ద మెల్లర ప్రాంతంలో 1896 సంవత్సరంలో స్టాఫోర్డ్ అనే ఆసామి పెరట్లో పెంచుకుంటున్న కోడిపెట్ట అత్యంత భారీ గుడ్డు పెట్టింది. ఏకంగా 12.2 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉన్న ఆ గుడ్డు బరువు 340 గ్రాములు. గిన్నెస్ బుక్‌లోకి ఎక్కిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇంగ్లాండ్‌లోనే 2010లో ఇప్‌స్విచ్ ప్రాంతంలో ఒక కోడిపెట్ట 8.3 అంగుళాల పొడవు, 3.5 అంగుళాల వెడల్పుతో గుడ్డు పెట్టింది.