Obama government
-
‘100 బిలియన్ల’ హామీపై స్పష్టత!
భారత్ సహా ‘బేసిక్’ దేశాల డిమాండ్ లీ బౌజెట్(ఫ్రాన్స్): వాతావరణ మార్పుపై పోరాటానికి మద్దతుగా వర్ధమాన దేశాలకు 2020 నుంచి ఏటా 100 బిలియన్ డాలర్ల సాయం అందిస్తామన్న హామీకి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కావాలని ధనిక దేశాలను ‘బేసిక్’ దేశాలు డిమాండ్ చేశాయి. వాతావరణ సదస్సులో న్యాయమైన, సమతౌల్య ఒప్పందం కుదిరేందుకు సభ్యదేశాల భాగస్వామ్యం ఉన్న పారదర్శక చర్చల ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని బేసిక్ దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనాల తరఫున బుధవారం చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలు ప్రగతిశీల లక్ష్యాలను పెట్టుకోవాలని భారత్ కోరుతోందని పారిస్ చర్చల్లో భారత్ తరఫున పాల్గొంటున్న అజయ్ మాథుర్ తెలిపారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి ఒబామా ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను తోసిపుచ్చుతూ అమెరికా ప్రతినిధుల సభ రెండు తీర్మానాలను ఆమోదించింది. ఇది ఒబామాకు పెద్ద ఎదురుదెబ్బే. మొదటి 10% వాటా 50%: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లోని తొలి 10% మంది వల్ల విడుదలయ్యే శిలాజ ఇంధన ఉద్గారాలు మొత్తం ఉద్గారాల్లో 50% ఉంటాయని, అత్యంత పేదల్లోని చివరి 50% మంది వల్ల విడుదలయ్యే ఉద్గారాలు మొత్తం ఉద్గారాల్లో 10 శాతమేనని ఆక్స్‌ఫామ్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అత్యంత పేద వ్యక్తి వల్ల విడుదలయ్యే కాలుష్య కారకాల కన్నా అత్యంత ధనికుల్లోని మొదటి 1%లో ఉన్న సంపన్నుడి వల్ల విడుదలయ్యే కాలుష్యం 175 రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించింది. -
ఎన్ఎస్ఏ నిఘా చట్ట విరుద్ధం
వాషింగ్టన్: నిఘా చర్యల్లో భాగంగా అమెరికన్ పౌరుల ఫోన్ వివరాలను పెద్ద ఎత్తున రహస్యంగా సేకరిస్తున్న ఒబామా సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కార్యక్రమాన్ని అక్కడి న్యాయస్థానం తప్పుబట్టింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ).. పౌరుల ఫోన్ కాల్స్ వివరాలు, సమాచారం సేకరించడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా, అమెరికన్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే చర్యగా యూఎస్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జి రిచర్డ్ లియాన్ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఏ కాంట్రాక్టరుగా పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆ సంస్థ నిర్వహిస్తున్న నిఘా కార్యకలాపాల గుట్టును ఈ ఏడాది జూన్‌లో బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఏ నిఘాను సవాలు చేస్తూ లర్రీక్లేమాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ కోర్టు జడ్జి లియాన్ విచారించారు. అమెరికన్ రాజ్యాంగంలోని నాలుగో సవరణను పేర్కొంటూ.. జడ్జి రిచర్డ్ లియాన్ ఎన్ఎస్ఏ నిఘా కార్యక్రమంపై ప్రాథమికంగా నిషేధం విధిస్తూ తొలుత ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్ న్యాయ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను నిలిపివేశారు. ఉగ్రవాద దాడుల నిరోధానికి వీలుగా పౌరుల ఫోన్ కాల్స్ వివరాలను సేకరించాల్సి వస్తోందని ఒబామా సర్కారు వాదనను జడ్జి లియాన్ ప్రశ్నించారు. ఇలా నిఘా ద్వారా ఒక్క ఉగ్రవాద దాడి ని అడ్డుకున్న దాఖలాను ప్రభుత్వం చూపలేకపోయిందన్నారు. తాజా తీర్పుపై రష్యాలో ఆశ్రయం పొందుతున్న ఎడ్వర్డ్ స్నోడెన్ హర్షం వ్యక్తం చేశారు. -
భారత్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు!
వాషింగ్టన్: అత్యాధునిక ఆయుధాలను, సాంకేతికతను భారత్‌కు అందజేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇందుకోసం ఒబామా ప్రభుత్వం తమకు అత్యంత విశ్వసనీయమైన దేశాల జాబితాలోకి భారత్‌ను చేర్చింది. ఈ మేరకు ఇప్పటికే పది సున్నితమైన టెక్నాలజీలను అందజేస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం భారత్ నిర్ణయం తీసుకోనుంది. ఇంతేగాకుండా మరిన్ని ఆయుధ టెక్నాలజీలను భారత్‌కు అందజేయడంపై అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా అమెరికా రక్షణ పరిశ్రమలను ఒబామా యంత్రాంగం కోరింది. అమెరికా రక్షణశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 90 రకాల ఆయుధాలు, టెక్నాలజీలను మిత్రదేశాలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.