వాషింగ్టన్: నిఘా చర్యల్లో భాగంగా అమెరికన్ పౌరుల ఫోన్ వివరాలను పెద్ద ఎత్తున రహస్యంగా సేకరిస్తున్న ఒబామా సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కార్యక్రమాన్ని అక్కడి న్యాయస్థానం తప్పుబట్టింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ).. పౌరుల ఫోన్ కాల్స్ వివరాలు, సమాచారం సేకరించడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా, అమెరికన్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే చర్యగా యూఎస్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జి రిచర్డ్ లియాన్ స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌ఏ కాంట్రాక్టరుగా పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆ సంస్థ నిర్వహిస్తున్న నిఘా కార్యకలాపాల గుట్టును ఈ ఏడాది జూన్‌లో బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.
ఎన్‌ఎస్‌ఏ నిఘాను సవాలు చేస్తూ లర్రీక్లేమాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ కోర్టు జడ్జి లియాన్ విచారించారు. అమెరికన్ రాజ్యాంగంలోని నాలుగో సవరణను పేర్కొంటూ.. జడ్జి రిచర్డ్ లియాన్ ఎన్‌ఎస్‌ఏ నిఘా కార్యక్రమంపై ప్రాథమికంగా నిషేధం విధిస్తూ తొలుత ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్ న్యాయ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను నిలిపివేశారు. ఉగ్రవాద దాడుల నిరోధానికి వీలుగా పౌరుల ఫోన్ కాల్స్ వివరాలను సేకరించాల్సి వస్తోందని ఒబామా సర్కారు వాదనను జడ్జి లియాన్ ప్రశ్నించారు. ఇలా నిఘా ద్వారా ఒక్క ఉగ్రవాద దాడి ని అడ్డుకున్న దాఖలాను ప్రభుత్వం చూపలేకపోయిందన్నారు. తాజా తీర్పుపై రష్యాలో ఆశ్రయం పొందుతున్న ఎడ్వర్డ్ స్నోడెన్ హర్షం వ్యక్తం చేశారు.
ఎన్‌ఎస్‌ఏ నిఘా చట్ట విరుద్ధం
Published Wed, Dec 18 2013 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement