అమెరికా వ‌ర్జీనియా నగరంలో వైభ‌వంగా ద‌స‌రా, బతుకమ్మ వేడుకలు! | Jupalli Krishna Rao Participated Bathukamma Celebrations In Virginia USA | Sakshi
Sakshi News home page

అమెరికా వ‌ర్జీనియా నగరంలో వైభ‌వంగా ద‌స‌రా, బతుకమ్మ వేడుకలు!

Published Mon, Oct 7 2024 12:46 PM | Last Updated on Mon, Oct 7 2024 1:05 PM

Jupalli Krishna Rao Participated Bathukamma Celebrations In Virginia USA

అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్ట‌ర్ ఆధ్వర్యంలో ద‌స‌రా, బతుకమ్మ వేడుకలు వైభ‌వంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వ‌ర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వ‌హించిన ఈ మెగా ఈవెంట్‌కు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. గ్లోబ‌ల్ తెలంగాణ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వాల‌న చేసి మంత్రి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు వేల‌కు పైగా మంది ప్ర‌వాసీయులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఈ ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు తీకొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడ‌ప‌డుచులు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ.. లయబద్దంగా కదులుతుంటే ఆడిటోరియం అంత‌టా సందడి నెలకొంది. వారిని అనుసరిస్తూ కుటుంబ సభ్యులు చప్పట్లు కొట్టారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో పాటు పోతురాజులు, హైద‌రాబాదీ బ్యాండ్ చేసిన‌ సంద‌డి అంతా ఇంతా కాదు. మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలు మరువకూడదని, భావిత‌రాల‌కు వారసత్వంగా అందించాలన్నారు. చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను మంత్రి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు. 

తెలంగాణ ఉద్య‌మంలో ఎన్ఆర్ఐలు అందించిన స‌హాకారం మ‌రువ‌లేనిద‌ని తెలిపారు. అనంత‌రం యూఎస్ గవర్నమెంట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ అందరూ కలిసి గ్లోబ‌ల్ తెలంగాణ అసోసియేష‌న్ (జీటీఏ) వాషింగ్టన్ డీసీ ఛాప్టర్ కు ప్రోక్లమేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వ‌ర్జీనియా డెలిగేట్ శ్రీనివాసన్ కన్నన్, అటార్నీ జనరల్ జేసన్ ఎస్. మియారెస్, లౌడన్ కౌంటీ సూపర్వైజర్ లౌరా సావినో, లౌడన్ కౌంటీ స్కూల్ బోర్డు డాక్టర్ సుమేరా రషీద్, డెమొక్రాట్ పార్టీ నేత శ్రీధర్ నాగిరెడ్డి, జీటీఏ వాషింగ్టన్ డీసీ చాప్ట‌ర్ ప్రెసిడెంట్ మునుకుంట్ల తిరుమల్ రెడ్డి , చైర్మ‌న్ కళావల విశ్వేశ్వర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పడూరు శ్రీవన్ రెడ్డి , నేషనల్ ట్రెజరర్ ముద్దసాని సుధీర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నంది సమరేంద్ర, దేశినేని సంపత్, జీటీఏ వనిత టీమ్ తెలకుంట్ల జయశ్రీ , ప్రత్యూష నారపరాజు, సేరిపల్లి రేఖ త‌దిరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి వారు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement