Obulapuram
-
గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ..
ఏదో ఒకరకంగా బురద జల్లటమే తప్ప వాస్తవాలతో పనిలేని ‘ఈనాడు’... బుధవారం కూడా ఇలానే బోడిగుండూ... మోకాలూ ఒకటేనని చెప్పే ప్రయత్నం చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి ఓబుళాపురం గనులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందని, తమకేమాత్రం అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టుకే చెప్పిందని అబద్ధాలను పోగేసి వండివార్చింది. ఓబుళాపురం గనులకు సంబంధించి జరగనివన్నిటినీ జరిగినట్లుగా ఊహించుకుంటూ రామోజీ తన మార్కు పాత్రికేయానికి మరోసారి పదునుపెట్టారు.‘గాలి అడిగితే కాదంటామా?’ అనే శీర్షికతో గాలి వార్తను అచ్చేశారు. అక్షరం కూడా వాస్తవం లేని ఈ కథనంలో అసలు నిజాలేంటో ఒకసారి చూద్దాం... ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. కాకపోతే ఇప్పటికే ఈ గనులకు సంబంధించిన అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. గతంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి నిర్దేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను ఏర్పాటు చేసింది. సరిహద్దుల నిర్ధారణ కూడా పూర్తయిన నేపథ్యంలో... కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌ను కోరింది. ఎందుకంటే ఈ వివాదం పరిష్కారమైతే సదరు మూడు గనులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మళ్లీ ఈ–ఆక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే వాటి ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి అక్కడ తవ్వకాలకు అనుమతివ్వాలా? వద్దా? అనేది సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే దుష్ప్రచారమే ఎజెండాగా చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు ఈ వాస్తవాలేవీ కనిపించ లేదు. గాలి జనార్థన్‌రెడ్డి వ్యవహారానికి దీంతో లింకు పెట్టి యథేచ్చగా తప్పుడు కథనాలు రాసిపారేసింది. ఇది ‘గాలి’ వార్త కాదా రామోజీ? వాస్తవానికి ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు జరిగితే అది ఆ ప్రాంతానికి ఉపయోగకరమే. అక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం లభ్యమవుతుంది కూడా. అందుకే కోర్టులో ఉన్న గనుల కేసు కొలిక్కి వస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. మరి ఇది గాలి జనార్థన్‌రెడ్డికి ప్రయోజనం చేకూర్చడం ఎలా అవుతుంది రామోజీరావు గారూ?. సరిహద్దు వివాదం ముగిసిందని, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్దేశించినట్లు సరిహద్దులు నిర్ధారించామని మాత్రమే కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది!!. దానర్థం గాలి జనార్ధనరెడ్డికి అనుమతి ఇచ్చేయమనా? కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లకు సైతం ఇలా వక్రభాష్యాలు చెప్పటం ఏ స్థాయి జర్నలిజం? ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గనుల వేలానికి అవకాశం ఏర్పడితే... ఎవరైనా దాన్లో పాల్గొనవచ్చు. దక్కించుకున్న వారు ఎవరైనా వాటిని తవ్వుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదంతా మీకు తెలియదా... లేక తెలిసినా మీ ఉద్దేశం వేరు కాబట్టి తెలియనట్లు నటిస్తున్నారా? రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్నదే మీ ఎజెండా కాబట్టి ఈ రాతలకు దిగుతున్నారా? ‘బాబు’ స్కాములపై అసలు పెన్నెత్తలేదేం? చంద్రబాబు హయాంలో ఎన్ని కుంభకోణాలు వెలుగుచూసినా రామోజీరావు వాటి గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు దోచేసినా... చంద్రబాబు తన కరకట్ట ఇంటి వెనక రాత్రింబవళ్లూ ఇసుకను లారీలతో అక్రమంగా తరలించేసుకున్నా రామోజీకి కనపడలేదు. ‘సాక్షి’లో ఫోటోలతో సహా ప్రచురించినా ‘ఈనాడు’ పెన్నెత్తలేదు. ఇప్పుడు అదే ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక రాజధాని ఎక్కడో చెప్పకుండా ముందే అమరావతి ప్రాంతంలో భూములు కొని, లక్షల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినా అది రామోజీకి అభివృద్ధిగానే కనపడింది. రాజధానిలో దళితుల భూములను పైసాకు, పరకకు కొనుగోలు చేసి తర్వాత తీరిగ్గా చంద్రబాబు మనుషులకు అనుకూలంగా క్రమబద్ధీకరించుకున్నా అదో నేరంగా కనిపించలేదు. అమరావతి రింగ్‌రోడ్డును తన అనుయాయులకు అనుకూలంగా ఎన్ని వంపులు తిప్పినా ‘ఈనాడు’కు అది చూడచక్కని గొలుసు డిజైన్‌గానే కనిపించింది. దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) స్కీములో ఎవరి వాటా వారికి అందింది కాబట్టే అప్పట్లో స్కాములన్నీ రామోజీకి అభివృద్ధి వీచికలుగా కనిపించాయి. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏది తలపెట్టినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోకాలడ్డుతూనే ఉన్నారు. అందులో భాగమే ఈ... గాలి రాతలు. -
‘ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే’
డి.హీరేహాళ్ : సమాజంలో ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపులేనని ద్వారక శారద పీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హంపి నుంచి డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఆర్డీఓ రామారావు స్వాగతం పలికారు. అనంతరం మహాలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించాలని, అధర్మాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ హిందూసాంప్రదాయాలతోనే భారతీయత ముడిపడివుందన్నారు. కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రహాస్, రాష్ట్ర ధర్మసంరక్షణ సమితి అధ్యక్షులు రఘుస్వామి, స్థానిక నాయకులు నాగళ్ళిరాజు, హనుమంతరెడ్డి, మోహన్‌రెడ్డి, ఆనందరెడ్డి, వెంకటరెడ్డి, అంగడి రాజశేఖర్, మహబళి, చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
81 బస్తాల పప్పుశనగ పట్టివేత
రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసిన వైనం పామిడి: మండలంలోని ఓబుళాపురంలో టీడీపీకి చెందిన వెంకటేశు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 81 బస్తాల విత్తన పప్పుశనగను సోమవారం మండల వ్యవసాయాధికారి మల్లీశ్వరి గుర్తించారు. వీటిని అధికార పార్టీకి చెందిన గుంతకల్లు మండల స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు అక్రమంగా దాచి ఉంచారని తెలుస్తోంది. విత్తనాన్ని సీజ్ చేశారన్న విషయం వెలుగు చూడడంతో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కూడా ఫోన్ చేశారని తెలిసింది. దీంతో అధికారులు పట్టుబడిన విత్తనం రైతులదని ప్రకటించారు. ఏఓ మల్లీశ్వరి మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న బస్తాలు తమవేనని రైతులు తెలిపారన్నారు. స్థలాభావంతో అక్కడ నిల్వ ఉంచినట్లు రాతపూర్వకంగా తెలిపారన్నారు. దీంతో పప్పుశనగ బస్తాలను తిరిగి అప్పగించామన్నారు. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డిని విచారించగా.. ఏఓ సమాచారం మేరకు ఓబుళాపురానికి పోలీసులను పంపినట్లు చెప్పారు. అంతకుమించి తనకేమీ తెలియదన్నారు. ఈ వ్యవహారం ఏఓకు సంబంధించిన విషయమని ఆయన దాటవేశారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
జఫర్‌గఢ్ : ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు వారు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఓబులాపూర్‌కు చెందిన వంగాల నరేష్ కొన్నేళ్ల క్రితం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తీగల కరుణాకర్‌రావు.. స్థానిక రైతు గార్లపాటి నీరజారెడ్డి భూమిని జేసీబీతో చదును చేయించాడు. అయితే జేసీబీ ద్వారా చేసిన పనిని ఉపాధిహామీ ద్వారా కూలీ లతో చేయించినట్లుగా రికార్డు చేయాలని కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలు ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై ఒత్తిyì చేయగా ఆయన నిరాకరిం చాడు. దీంతో ఉపాధిహామీలో అవకతవకలు జరిగాయని, ఇందుకు బాధ్యుడైన ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై చర్యలు తీసుకోవాలని నీరజారెడ్డి, కరుణాకర్‌రావులు ఉపాధి హామీ పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడితో విచారణ చేపట్టిన అధికారులు నరేష్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే కొన్ని రోజుల తర్వాత తిరిగి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇప్పిస్తామంటూ సదరు ఫిర్యాదుదారులు నరేష్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు నరేష్ వారికి కొన్ని నెలల క్రితం రూ. 1.50 లక్షలు ముట్టజెప్పాడు. అయినప్పటికీ వారు ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నరేష్ బుధవారం ఉదయం నీరజారెడ్డి, కరుణాకర్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలిచ్చారు. విష యం తెలుసుకున్న నరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కారకులైన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కరుణాకర్‌రావు, నీరజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితుడి భార్య వంగాల సుమలత ఫిర్యాదు మేరకు కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు హెడ్ కాని స్టేబుల్ శ్యాంసుందర్ తెలిపారు. -
కారు బోల్తా.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా డి.హీరేళాల్ మండలం ఓబులాపురం రైల్వేగేటు వద్ద ఓ కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జరిగిన వివాహానికి హాజరై బెంగళూరుకు కారులో తిరిగి వెళుతుండగా... ఓబులాపురం రైల్వే గేటు వద్ద మలుపులో కారు బోల్తా పడింది. అందులో నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
ముడిఇనుము తరలింపునకు అనుమతించలేం: సీబీఐ కోర్టు
ఓబులాపురంలోని తమ స్టాక్‌యార్డులో బళ్లారి ఐరన్‌ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (బీఐఓపీ)కి చెందిన ముడిఇనుమును సమీపంలోని మరో ప్రాంతానికి తరలించేందుకు అనుమతించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ముడిఇనుమును మరో ప్రాంతానికి తరలించేందుకు అనుమతిస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని, ఈ వ్యవహారంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఉందని తేల్చిచెప్పింది. ఈ ఖనిజ పరిమాణం, నాణ్యతను సీబీఐ ఇప్పటికే నిర్ధారించిందని, ఈ అంశాలు దర్యాప్తులో కీలకమని పేర్కొంది. ఈ మేరకు బీఐఓపీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం తీర్పు వెలువరించారు.