ఏదో ఒకరకంగా బురద జల్లటమే తప్ప వాస్తవాలతో పనిలేని ‘ఈనాడు’... బుధవారం కూడా ఇలానే బోడిగుండూ... మోకాలూ ఒకటేనని చెప్పే ప్రయత్నం చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి ఓబుళాపురం గనులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందని, తమకేమాత్రం అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టుకే చెప్పిందని అబద్ధాలను పోగేసి వండివార్చింది. ఓబుళాపురం గనులకు సంబంధించి జరగనివన్నిటినీ జరిగినట్లుగా ఊహించుకుంటూ రామోజీ తన మార్కు పాత్రికేయానికి మరోసారి పదునుపెట్టారు.‘గాలి అడిగితే కాదంటామా?’ అనే శీర్షికతో గాలి వార్తను అచ్చేశారు. అక్షరం కూడా వాస్తవం లేని ఈ కథనంలో అసలు నిజాలేంటో ఒకసారి చూద్దాం...
ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. కాకపోతే ఇప్పటికే ఈ గనులకు సంబంధించిన అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. గతంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి నిర్దేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను ఏర్పాటు చేసింది.
సరిహద్దుల నిర్ధారణ కూడా పూర్తయిన నేపథ్యంలో... కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌ను కోరింది. ఎందుకంటే ఈ వివాదం పరిష్కారమైతే సదరు మూడు గనులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మళ్లీ ఈ–ఆక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే వాటి ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి అక్కడ తవ్వకాలకు అనుమతివ్వాలా? వద్దా? అనేది సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే దుష్ప్రచారమే ఎజెండాగా చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు ఈ వాస్తవాలేవీ కనిపించ లేదు. గాలి జనార్థన్‌రెడ్డి వ్యవహారానికి దీంతో లింకు పెట్టి యథేచ్చగా తప్పుడు కథనాలు రాసిపారేసింది.
ఇది ‘గాలి’ వార్త కాదా రామోజీ?
వాస్తవానికి ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు జరిగితే అది ఆ ప్రాంతానికి ఉపయోగకరమే. అక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం లభ్యమవుతుంది కూడా. అందుకే కోర్టులో ఉన్న గనుల కేసు కొలిక్కి వస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. మరి ఇది గాలి జనార్థన్‌రెడ్డికి ప్రయోజనం చేకూర్చడం ఎలా అవుతుంది రామోజీరావు గారూ?. సరిహద్దు వివాదం ముగిసిందని, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్దేశించినట్లు సరిహద్దులు నిర్ధారించామని మాత్రమే కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది!!.
దానర్థం గాలి జనార్ధనరెడ్డికి అనుమతి ఇచ్చేయమనా? కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లకు సైతం ఇలా వక్రభాష్యాలు చెప్పటం ఏ స్థాయి జర్నలిజం? ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గనుల వేలానికి అవకాశం ఏర్పడితే... ఎవరైనా దాన్లో పాల్గొనవచ్చు. దక్కించుకున్న వారు ఎవరైనా వాటిని తవ్వుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదంతా మీకు తెలియదా... లేక తెలిసినా మీ ఉద్దేశం వేరు కాబట్టి తెలియనట్లు నటిస్తున్నారా? రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్నదే మీ ఎజెండా కాబట్టి ఈ రాతలకు దిగుతున్నారా?
‘బాబు’ స్కాములపై అసలు పెన్నెత్తలేదేం?
చంద్రబాబు హయాంలో ఎన్ని కుంభకోణాలు వెలుగుచూసినా రామోజీరావు వాటి గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు దోచేసినా... చంద్రబాబు తన కరకట్ట ఇంటి వెనక రాత్రింబవళ్లూ ఇసుకను లారీలతో అక్రమంగా తరలించేసుకున్నా రామోజీకి కనపడలేదు. ‘సాక్షి’లో ఫోటోలతో సహా ప్రచురించినా ‘ఈనాడు’ పెన్నెత్తలేదు. ఇప్పుడు అదే ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక రాజధాని ఎక్కడో చెప్పకుండా ముందే అమరావతి ప్రాంతంలో భూములు కొని, లక్షల కోట్ల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినా అది రామోజీకి అభివృద్ధిగానే కనపడింది.
రాజధానిలో దళితుల భూములను పైసాకు, పరకకు కొనుగోలు చేసి తర్వాత తీరిగ్గా చంద్రబాబు మనుషులకు అనుకూలంగా క్రమబద్ధీకరించుకున్నా అదో నేరంగా కనిపించలేదు. అమరావతి రింగ్‌రోడ్డును తన అనుయాయులకు అనుకూలంగా ఎన్ని వంపులు తిప్పినా ‘ఈనాడు’కు అది చూడచక్కని గొలుసు డిజైన్‌గానే కనిపించింది. దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) స్కీములో ఎవరి వాటా వారికి అందింది కాబట్టే అప్పట్లో స్కాములన్నీ రామోజీకి అభివృద్ధి వీచికలుగా కనిపించాయి. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏది తలపెట్టినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోకాలడ్డుతూనే ఉన్నారు. అందులో భాగమే ఈ... గాలి రాతలు.
గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ ‘ఈనాడు’ కథనం
Published Thu, Aug 11 2022 3:43 AM | Last Updated on Thu, Aug 11 2022 3:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment