OCTL
-
ఓసీటీఎల్ లాకౌట్ ఎత్తివేయడం కార్మికుల విజయం
నకిరేకల్ : నార్కట్‌పల్లిలోని ఓసీటీఎల్ కంపెనీ 183 రోజుల తర్వాత లాకౌట్ ఎత్తి వేయడం కార్మికుల విజయమని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మీ అన్నారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు తోచిన విధంగా చట్టాలను తుంగలో తొక్కుతుంటే అది ఎవరికైనా తెలంగాణలో సా«ధ్యం కాదని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికైనా ఓసీటీఎల్‌లో పారిశ్రామికమైన శాంతిని నెలకొల్పి యాజమాన్యం కార్మికులకు సహకరించాలని కోరారు. ఓసీటీఎల్ కంపెనీ లాభాల బాటలో ఉండాలని కోరారు. సమావేశంలో ఆ వేదిక జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి, నాయకులు వనం నరేందర్, నార్కట్‌పల్లి రమేష్, మొరోజు సైదాచారి, పూల సైదులు, ముడుదుడ్ల శ్రీనివాస్, అయిటిపాముల గిరి, సతీష్, సుల్తానా, జాని తదితరులు ఉన్నారు. -
ఓసీటీఎల్ ప్లాంటులో ఉత్పత్తి బంద్
♦ ఏజీఎంపై కార్మికుల దాడే కారణమన్న యాజమాన్యం ♦ అధికారి మృతి వల్లే ఈ నిర్ణయమంటూ ఎక్స్ఛేంజీలకు లేఖ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్)... నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఉన్న తన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18న కార్మికుల దాడిలో కంపెనీ ఆపరేషన్స్ సీనియర్ ఏజీఎం మస్తాన్ రావు గాయపడ్డారు. ఆ తరవాత ఆసుపత్రిలో చికిత్స చెందుతూ మృతి చెందారు. సోమవారం అత్యవసరంగా సమావేశమైన ఓసీటీఎల్ బోర్డు... దాడి తరువాత ప్లాంటులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించింది. ‘‘ఇతర సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్లాంటు కార్యకలాపాలను తక్షణమే నిలిపేయాలని నిర్ణయించాం.’’ అంటూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక లేఖ రాసింది. నార్కట్‌పల్లి ప్లాంటులో చమురు, సహజవాయు రంగాలకు అవసరమైన డ్రిల్లింగ్ పైపులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక రిస్క్ తీసుకోలేం..ఎక్స్ఛేంజీలకు ఓసీటీఎల్ రాసిన లేఖ సారాంశం చూస్తే... ‘‘కార్మికుల దాడిలో కీలక అధికారిని కోల్పోయాం. మేనేజర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు భద్రంగా ఉండటం మాకు ముఖ్యం. దాన్ని పణంగా పెట్టలేం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా అభ్యర్థనేంటంటే సిబ్బందికి, కంపెనీ ఆస్తులకు తగిన భద్రత కల్పించమని. అంతేకాక ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించండి ’’ అని లేఖలో కోరింది. ఓసీటీఎల్ తన లేఖలో కొందరు కార్మికుల తీరుపై విరుచుకుపడింది. ‘‘గతంలో ఎలాంటి నోటీసులు, కారణాలు లేకుండానే కార్మికులు పనులను అడ్డుకునేవారు. బయటి వ్యక్తుల ప్రోద్బలంతో ఉత్పత్తిని అడ్డుకుని పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసేవారు. మేనేజర్లను, ఇంజనీర్లను, ఉద్యోగులను బెదిరించేవారు. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుటే దాడికి పాల్పడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అని వివరించింది. మంత్రులకు సమాచారమిచ్చినా... ప్లాంటులోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రికి, పరిశ్రమల మంత్రికి తెలియజేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘‘మా ఆస్తులు, ఉద్యోగుల ప్రాణ రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రతిసారీ మంత్రులను కోరాం. మంత్రులు సమయం తీసుకోవటంతో పాటు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిని మేం తొలగిస్తే... వారిక్కూడా భారీ పరిహారం చెల్లించమన్నారు. దీంతో ఇష్టం లేకున్నా 2015 సెప్టెంబర్‌లో కొందరు కార్మికులను విధుల్లోకి తీసుకున్నాం. వారు మారలేదు సరికదా... సిబ్బందిని బెదిరించేవారు. చివరకు ఫిబ్రవరి 18న మస్తాన్‌రావుపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. గాయపడిన మస్తాన్‌రావు 20న మరణించారు. అందుకే ప్లాంటును నిలిపేస్తున్నాం’’ అని ఓసీటీఎల్ వివరించింది. -
కార్మికుల దాడి: అసిస్టెంట్ మేనేజర్ మృతి
నార్కట్‌పల్లి(నల్లగొండ): కార్మికుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓసీటీఎల్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ మస్తాన్‌రావు శనివారం మృతిచెందారు. తమకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారంటూ గురువారం కొందరు కార్మికులు మస్తాన్‌రావుపై దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. -
కృష్ణపట్నం తరలనున్న ఓసీటీఎల్!
ప్లాంటు తరలింపునకు రూ.200 కోట్ల వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న కామినేని గ్రూప్ కంపెనీ ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్) నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఉన్న ప్లాంటును తరలిస్తోంది. కొన్ని నెలలుగా కార్మికులతో తలెత్తిన సమస్యల కారణంగా ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. దీంతో ప్లాంటును తరలించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ నిర్ణయించింది. ఎటువంటి నోటీసు, సరైన కారణం లేకుండా కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారని బీఎస్ఈకి నవంబర్ 10న ఓసీటీఎల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చమురు, సహజ వాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే అయిదు రకాల భాగాలను తయారు చేసే కంపెనీ ప్రపంచంలో ఇదొక్కటే. ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.5 లక్షల టన్నులు. ఓఎన్జీసీ, షెల్ తదితర కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీకి ప్రధాన మార్కెట్ అయిన అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం కూడా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఓసీటీఎల్కు రూ.5.87 కోట్ల నష్టం వాటిల్లింది. ప్లాంటులో సుమారు 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 9 నెలల్లో కొత్త ప్లాంటు.. ఓసీటీఎల్కు ఇప్పటి వరకు రూ.500 కోట్లు వెచ్చించామని కామినేని గ్రూప్ డెరైక్టర్ కామినేని శశిధర్ తెలిపారు. ప్లాంటు సామర్థ్యంలో 10-20 శాతంలోపే ఉత్పత్తి నమోదవుతోందని పేర్కొన్నారు. ప్లాంటు తరలింపు అంశంపై ఈ నెలలో బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త ప్లాంటుకై కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలను కంపెనీ పరిశీలిస్తోంది. కృష్ణపట్నం వద్దే ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పైపులను కంపెనీ ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు తరలింపు, కొత్త ప్రదేశంలో ఏర్పాటుకు రూ.200 కోట్ల వ్యయం అవుతుందని శశిధర్ తెలిపారు. 75 శాతం మెషినరీ పనికొస్తుందని చెప్పారు. పరిస్థితుల్లో మార్పు లేకపోతే నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని స్టీల్ అండ్ పవర్, యునెటైడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్ యూనిట్లను కూడా తరలించడం ఖాయమన్నారు. ఈ రెండు కంపెనీల కోసం సంస్థ రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. రూ.3,000 కోట్లతో విస్తరణ చేపట్టాలని గతంలో భావించినప్పటికీ, తాజాగా ప్లాంట్లనే మరోచోటుకు తరలించాలని నిర్ణయించడం కొసమెరుపు.