ప్రభుత్వ భవనాలకూ పన్ను కట్టాల్సిందే
యాచారం, న్యూస్‌లైన్ : గవర్నమెంట్ ఆఫీసు కదా అన్నీ ఫ్రీయే అని అధికారులు అనుకుంటే ఇక కుదరదు. అలాగే అందరికీ కనిపించేదే... అందరూ వచ్చిపోయేదే కదా... ఆఫీస్ అడ్రస్ చెప్పే పనేముంటుందని ఊరుకుంటే కుదరదు. మండలమైనా, గ్రామమైనా... ఎక్కడ ప్రభుత్వ కార్యాలయం ఉన్నా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక పన్నులు చెల్లించాల్సిందే. ప్రైవేటు సంస్థలు, భవనాల మాదిరిగా కార్యాలయాల వివరాలు స్థానికంగా నమోదు చేయాల్సిందే. ఈ నెల 22న జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో డీపీఓ పద్మజారాణి ప్రభుత్వ కార్యాలయాల వివరాలు స్థానిక రికార్డుల్లో నమోదు చేయాలని సూచించా రు. ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ పా ఠశాలలు, వసతిగృహాలను మినహా యించి మిగతా కార్యాలయాల నుంచి ఇంటిపన్ను, నీటిపన్ను కచ్చితంగా వసూలుచేయాలని ఆదేశించారు.
రికార్డులు లేవు...
యాచారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ కార్యాలయాల వివరాలు రికార్డులు లే వు. గతంలో పనిచేసిన పంచాయతీ అధికారులు ప్రభుత్వ భవనాలే కదా అని వాటివైపు చూడలేదు. మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, వ్యవసాయశాఖ, ఐకేపీ, హౌసింగ్, విద్యుత్ శాఖ తదితర కార్యాలయాలకు సం బంధించి యాచారం గ్రామ పంచాయతీలో రికార్డులు లేకపోగా, నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించడం లేదు.
నోటీసుల జారీకి రంగం సిద్ధం
ఈ నేపథ్యంలో డీపీఓ ఆదేశాల మేరకు యాచారం ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ చర్యలకు ఉపక్రమించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, పన్నుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లు, టెలిఫోన్ కేంద్రాలతో పాటు వ్యాపార సంస్థలు, నివాసగృహాలు తదితర రికార్డుల్లో లేని భవనాల వివరాలు సేకరించి కంప్యూటర్లలో పొందుపరుస్తున్నారు. పన్నులు చెల్లిస్తుంటే వాటి రసీదులు అందజేయాలని... లేకుంటే పన్నులు చెల్లించాలంటూ ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఏటా రూ.80లక్షలకు పైగా ఆదాయం
మండలంలోని 20 గ్రామాల్లో ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేస్తే ఏటా ఆయా పంచాయతీలకు రూ.80లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అనుమతుల్లేకుండా వ్యాపార సంస్థలు నిర్మాణాలు చేపట్టి పన్ను ఎగవేస్తుండగా, మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్నులు వసూలు చేసే వారు లేకుండాపోయారు. అన్ని గ్రామాల్లో ప్రైవేట్ భవనాలు, వ్యాపార సంస్థల నుంచి ప్రతి ఏటా ఆయా పన్నులు వసూలు చేస్తే రూ.60లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి మరో రూ.20లక్షలకు పైగా వసూలవుతుంది.