శివారు భూములకూ సాగునీరు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పంటలను కాపాడుకునేందుకు శివారు భూములకు కూడా సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మీ కోసం కార్యక్రమం సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధితాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఏ ఒక్క రైతు సాగునీటి కోసం ఇబ్బందులు పడటానికి వీల్లేదని, అధికారుల దృష్టికి సాగునీటి సమస్య ఏ ఒక్క రైతు తీసుకొచ్చినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పెదవేగి మండలం కొప్పాకకు చెందిన రైతులు చందు నాగేశ్వరరావు, పర్వతనేని నగేష్, గిరిడి అచ్చయ్య మరి కొంతమంది కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ పోలవరం కాలువ నుంచి గో సంరక్షణ వరకు సుమారు కిలోమీటరు వరకూ బోర్లలో నీరురాక వేరుశనగ, మొక్కజొన్న, జామ, ఆయిల్‌పామ్ పంటలు ఎండిపోతున్నాయని పోలవరం కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పరిశీలించి పంటలను కాపాడేందుకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
∙గోపాలపురం మండలం కరగపాడుకు చెందిన పినెళ్లి ధర్మయ్య, తానేటి వెంకటరత్నం, ఐనపర్తి దుర్గారావు మరికొంతమంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రామంలో ఆర్ఎస్ నంబర్ 42లో ఎనిమిది మంది దళితులకు కేటాయించి పట్టాలిచ్చినా ఆ భూమిని నేటికీ అప్పగించలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గోపాలపురం తహసీల్దార్‌ను ఆదేశించారు.
∙కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సిద్ధిగని నాగేశ్వరరావు, వంకా> శ్రీను, ఈలి లక్ష్మయ్య మరికొంతమంది కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ నివాసాల మధ్య కొంతమంది పందులు పెంపకం చేస్తూ చుట్టుపక్కల హోటళ్ల నుంచి తీసుకొచ్చిన వ్యర్థాలు, కోడిమాంసం వంటివి పందులకు మేతగా వేస్తూ అనారోగ్యాలకు గురి చేస్తున్నారని, ప్రజలు రోగాల బారినపడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ స్వయంగా డీపీవో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
∙టి.నరసాపురం మండలం బంధంచర్లకు చెందిన కె.నాగబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వేసిన బోరు నుంచి నీటిని వాడుకోకుండా లింగాల సోమసుందరం అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడని, అందరూ బోరు నీటిని వాడుకోవాల్సి ఉండగా దౌర్జన్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, వినకుంటే బోరును రద్దు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.