నిర్వాసితులకు 70 ఎకరాల్లో కాలనీ
ఏలూరు సిటీ : జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా భారీ కాలనీ ఏర్పాటు చేసి అన్ని వసతులు అక్కడే కల్పించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చిన్న చిన్న 19 కాలనీలు నిర్మించాలన్న ప్రతిపాదనతో నిర్వాసితులకు పెద్దగా మేలు జరగదని 2 లేదా 3 భారీ కాలనీలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తే ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో ఆనందిస్తారని భాస్కర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొయ్యలగూడెం మెయిన్‌రోడ్డుకు చేర్చి 70 ఎకరాల విస్తీర్ణంలో భారీ కాలనీ ఏర్పాటు చేయాలని, ఆ కాలనీలో బస్టాప్, కోటి రూపాయల వ్యయంతో ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్, ఆరోగ్య కేంద్రం, స్కూల్ భవనం, తదితర సౌకర్యాలు కల్పిస్తే నిర్వాసితులు ఎంతో లబ్ధి పొందుతారన్నారు. ఆ దిశగా ప్రణాళిక అమలు చేయాలని ఐటీడీఏ పీవో షాన్ మోహన్‌ను కలెక్టర్ ఆదేశించారు.
తమ్మిలేరు అభివృద్ధి పనులు డిసెంబర్ 1న ప్రారంభించి 31 రాత్రి కల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ, విస్తరణ పనులపై కాంట్రాక్ట్ ఏజెన్సీ, అధికారులతో చర్చించారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల ఎలైన్‌మెంట్ మార్చే ప్రసక్తి లేదని కలెక్టర్ తేల్చి చెప్పారు. కలెక్టర్ వద్దకు వెళితే ఎలైన్‌మెంట్ మారుస్తారంటూ రైతులకు చెబుతున్న ఈఈ చినబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజెసీ ఎంహెచ్.షరీఫ్, భూసేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ భానుప్రకాష్, ఐటీడీఏ పీవో షాన్‌మోహన్, ఆర్డీవోలు నంబూరి తేజŒ భరత్, శ్రీనివాసరావు, పోలవరం ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.