మాట్లాడుతున్న కలెక్టర్ టీకే శ్రీదేవి
-
సామాన్య భక్తులే లక్ష్యంగా వసతుల కల్పన
-
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కృష్ణాపుష్కరాలు
-
గంగాహారతి తరహాలో కృష్ణవేణి హారతి
-
ఆధ్యాత్మిక భావన కలిగించేలా కార్యక్రమాలు
-
పుష్కరాలకు విస్తృతంగా సాంకేతిక సేవలు
-
‘సాక్షి’ ఇంటర్వూ్యలో కలెక్టర్ టీకే శ్రీదేవి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా సంస్కతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని, సాధారణ భక్తులే లక్ష్యంగా వసతులు కల్పిస్తామని కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. జిల్లాకే తలమానికంగా ఉన్న జోగుళాంబ ఆలయ ప్రతిష్టను దేశనలుమూలల నాటేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. పుష్కరాలకు 1.50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రఖ్యాత హరిద్వార్‌లో గంగాహారతి తరహాలో కృష్ణవేణి హారతి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యాత్రికులు వచ్చింది మొదలుకుని.. క్షేమంగా తిరుగు ప్రయాణమయ్యే వరకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని చెబుతున్నారు. కృష్ణాపుష్కరాల నిర్వహణపై శనివారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
అంగరంగ వైభవంగా..
రాష్ట్రంలో మొదటిసారిగా పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వం. యాత్రికులకు కావాల్సిన సమాచారం, సహాయం అందించేందుకు ప్రతిఘాట్ వద్ద స్వచ్ఛంద సేవకులను నియమిస్తున్నాం. సాధారణ భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగించేలా కార్యక్రమాలు చేపడ్తాం. 52 పుష్కరఘాట్లలో అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశాం. భక్తుల రద్దీకి తగిన విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన పారిశుద్ధ్యం సిబ్బందిని నియమించాం. ప్రతి ఘాట్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఘాట్‌లో ఎంత మేరకు నీళ్లు ఉన్నాయో.. ఏ మేరకు వెళ్లి స్నానం చేయొచ్చొ తెలియజేసేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం.
అందుబాటులో వైద్యసేవలు
పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నాలుగు ప్రాంతాల్లో పది పడకలతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నాం. పస్పుల, రంగాపూర్, బీచుపల్లి, సోమశిల ప్రాంతాల్లో వైద్యులు నిరంతర వైద్యసేవలు అందిస్తారు. లోతు ఉన్న ప్రాంతాలకు భక్తులకు వెళ్లకుండా పోలీస్, స్వచ్ఛంద సేవకులు ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తారు. ఘాట్ల వద్ద బస్సులు, ఇతర వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ వసతి కల్పించాం. వాటికి సాధారణ రుసుం చెల్లించి సేవలను వినియోగించుకోవచ్చు.
జిల్లా ప్రతిష్టతను పెంచేలా..
జిల్లాలో ప్రఖ్యాత జోగుళాంబ ఆలయ ప్రతిష్టను దేశం నలుదిశలా చాటేలా అలంపూర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జోగుళాంబను దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈనెల 12 నుంచి 24వ తేదీ వరకు రోజుకూ ఐదువేల చొప్పున లడ్డూప్రసాదాన్ని ఉచితంగా భక్తులకు ఉచితంగా పంపిణీచేస్తున్నాం.
గొందిమళ్లకు సీఎం కేసీఆర్
గొందిమళ్ల, సోమశిలలో వీఐపీ ఘాట్లను ఏర్పాటుచేశాం. సీఎం కేసీఆర్ గొందిమళ్లలో ఈనెల 12వ తేదీ ఉదయం కృష్ణా పుష్కరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక్కడ తెలంగాణ, జిల్లా సంçస్కృ తి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన చిత్రపటాలను సీఎం ప్రారంభిస్తారు. ప్రఖ్యాత హరిద్వార్‌లో గంగాహారతి తరహాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా 12రోజుల పాటు జిల్లాలోని ఆరుఘాట్లలో కృష్ణవేణి హారతి నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం శాస్త్రోక్తంగా కొనసాగుతుంది. మిగిలిన ఘాట్ల వద్ద నిత్యం ఉదయం గంగపూజ నిర్వహిస్తాం.
వలంటీర్లలో ప్రత్యేక సేవలు
వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు పుష్కర స్నానాలు చేసేందుకు ఘాట్లవద్ద చర్యలు చేపడుతున్నాం. వీరికి సేవలు అందించేందుకు ప్రత్యేక వలంటీర్లు సేవలందిస్తారు. భక్తులెవరూ స్నానాలు చేసిన తర్వాత ఘాట్ల వద్దనే ఉండకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకుండా క్రమపద్ధతిలో వచ్చిపోయేలా తగిన ఏర్పాట్లు చేశాం. సగటున ఒక్కో భక్తుడు నాలుగు నిమిషాల్లో నదీస్నానం ఆచరించేలా కార్యచరణ రూపొందించాం.
పుష్కరాలకు అధునిక హంగులు
యాత్రికుల సౌకర్యార్థం ఈసారి ఆధునిక సాంకేతికసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సెల్‌ఫోన్ సిగ్నళ్ల సమస్య తలెత్తకుండా వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని ఆరుఘాట్ల వద్ద ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం కొంత చార్జీని కూడా ప్రభుత్వం నుంచి సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించాం. వీటితో పాటు ‘వేర్ ఐ యామ్ ఐ’ గూగుల్ యాప్‌ని కూడా రూపొందించాం. స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకునే భక్తులకు వాళ్లు ఎక్కడున్నారు.. ఎక్కడ రద్దీ ఎలా ఉంది.. ఏ ఘాట్‌కు వారున్న ప్రదేశం నుంచి ఎలా వెళ్లాలి.. టాయిలెట్లు ఎటువైపు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఎటువైపు ఉంది.. అనే అంశాలను తెలుసుకోవచ్చు.