గోపాల్‌పేట: దేవుడి మొక్కు తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై ముగ్గురు గాయాలపాలైన ఘటన ఏదుల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం ఏదుల సమీపంలోని కథాల్‌సాయన్న దేవుడికి తమకు మొక్కుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులు పెద్దదగడ నుంచి ఏదుల కథాల్‌సాయన్న గుడి వద్దకు డీసీఎంలో సుమారు 15మంది వచ్చారు.
డీసీఎంలో వచ్చిన వారు కొంత దూరంలోనే దిగారు. వృద్ధులు గుడి దగ్గరకు వెళ్లి అక్కడ దిగేందుకు డీసీఎంలోనే కూర్చున్నారు. గుడి సమీపంలోకి వెళ్లిన తర్వాత డ్రైవర్ డీసీఎంను నిలిపేందుకు వెళ్తుండగా, 11 కేవీ వైర్లు కిందకు వేలాడుతూ ఉండటంతో డీసీఎంకు తగిలాయి. అలాగే ముందుకు వెళ్లడంతో కరెంటు పోల్ విరిగిపోయి వైర్లు తెగి నేలకు తగిలాయి.
దీంతో డీసీఎం అంతా షాక్ రావడంతో అందులో ఉన్న వృద్ధులు ఈశ్వరమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తప్పించుకున్నాడు. వెంటనే కరెంట్ బంద్ చేయించి వారిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైర్లు వేలాడటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment