భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
- సకల సౌకర్యాలు కల్పించాలి
- అధికారులు స్థానికంగా ఉండాలి
- జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ
- ముల్లకట్ట, రామన్నగూడెం, గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద పుష్కరఘాట్ల సందర్శన
ఏటూరునాగారం/మంగపేట : పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగొద్దని, సకల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపేట మండల కే్రంద్రంలోని గోదావరిఫెర్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను ఆమె బుధవారం సందర్శించి పనులను పరిశీలించారు. పుష్కరాల పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలన్నారు.
ముల్లకట్ట వద్ద పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్ల నిర్మాణం ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ముల్లకట్ట ప్రధాన రోడ్డు నుంచి ఘాట్ వరకు ఉన్న బురద రోడ్డును మెటల్, డస్ట్ వేసి భక్తులు నడిచేలా చూడాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి పనులను పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌కు సూచించారు. రొయ్యూర్ నుంచి ముల్లకట్ట, రాంపూర్ రోడ్డును ఎందుకు పూర్తి చేయించలేదని పీఆర్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపేటలో గతంలో గోదావరి ఒడ్డు కోతకు గురికాకుండా ఉండేందుకు ఒడ్డు వెంట రివిట్‌మెంట్, కరకట్ట నిర్మాణం చేయకుండానే రికార్డులు చూపించి కాంట్రాక్టర్ నిధులు దండుకున్నాడని మంగపేట వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన కలెక్టర్ కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట జిల్లా పౌర సంబంధాల శాఖ ఏడీ జగన్, డీపీఓ సోమ్లానాయక్, మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లికార్జున్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, డీఎస్పీ రాజమహేంద్రనాయక్, ఎన్‌హెచ్ ఈఈ సత్యనారాయణ, డీఈఈ వెంకటేష్, మనోహర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాంచంద్‌నాయక్, ఈఈ రాజేంద్రకుమార్, డీఈఈ తిరుపతిరావు, ఏఈఈలు జీవన్‌ప్రకాష్, పీఆర్ ఈఈ మదనయ్య, డీఈఈ శంకరయ్య, ఏఈఈ సత్యనారాయణ, ప్రాజెక్టు ఇన్‌చార్జ్ ప్రకాష్, మైనర్ ఇరిగేషన్ ఈఈ సుధీర్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, డీఎంహెచ్ ఓ సాంబశివరావు, జెడ్పీటీసీ వైకుంఠం, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, సీఐ కిషోర్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, ముల్లగట్ట సర్పంచ్ మడె చిలుకమ్మ, ఏటూరునాగారం సర్పంచ్ ఇర్సవట్ల ఝన్సీరాణి పాల్గొన్నారు.
పోడుభూములకు పట్టాలివ్వాలని ఆందోళన
ఏటూరునాగారం : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రొ య్యూర్ గ్రామస్తులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణను అడ్డుకున్నారు. దీంతో ప్రజలను చూసి వాహనాన్ని నిలిపి మాట్లాడా రు. ఇప్పలగడ్డ పాఠశాల చుట్టూ స్ట్రంచ్ కొట్టడం వల్ల నీళ్లు నిలి చి విద్యార్థులు అందులోపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. విద్యార్థులున్న ప్రాంతంలో ఎలా గోతులు తీస్తారని అటవీశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ మండిపడ్డారు. పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.