పన్నులు వసూలు కాకుంటే పంచాయతీలు విలీనం
Published Sat, Feb 4 2017 2:10 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో పన్నులు వసూలు చేయడం చేతకాకపోతే పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో పంచాయతీ పన్నులు, పారిశుద్ధ్యం, బయోమెట్రిక్ హాజరు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016–17 పన్నులు ఇంతవరకూ కేవలం 34 శాతం మాత్రమే వసూలు చేశారని, మార్చి 31వ తేదీ నాటికి నూరుశాతం పన్నులు ఎలా వసూలు చేయగలుగుతారని ప్రశ్నించారు. గత ఏడాది పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన ఏలూరు ఈవోఆర్‌డీని పోలవరానికి, పోలవరం ఈవోఆర్‌డీని ఏలూరుకు బదిలీ చేయాల్సిందిగా డీపీవో కె.సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు ఉదయం 5.30 గంటలకే క్షేత్రస్థాయికి వెళ్లాలని చెప్పినా ఏ ఒక్కరూ వెళ్లడం లేదని, ఇకపై ఉదయం 5.30 గంటలకే ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీలకు సంబంధించి వెబ్‌సైట్‌ను రూపొందించి పంచాయతీల వారీ సమాచారాన్ని పొందుపరచాలన్నారు. పంచాయతీలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, పన్నులు, నాన్‌టాక్సెస్, ఇతర సమాచారం సేకరించాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలదేనని, ఆ సమాచారాన్ని కంప్యూటర్ ఆపరేటరు ద్వారా నమోదు చేయించాలన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారి సీహెచ్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
తెల్లకార్డుకు అర్హత లేకుంటే గులాబీ కార్డు
జిల్లాలో తెల్లరేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతలేదని గుర్తించిన వెంటనే గులాబీకార్డు మంజూరు చేయాల్సిందిగా తహసీల్దార్లను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో తెలుపురంగు రేషన్‌కార్డు పొంది ఉండి స్వచ్ఛందంగా తనకు తెల్లరేషన్‌కార్డు రద్దు చేసి గులాబీ కార్డు మంజూరు చేయాల్సిందిగా లబ్ధిదారుడు కోరినట్లయితే వెంటనే చర్యలు తీసుకుని గులాబీ కార్డు మంజూరు చేయాలన్నారు. ప్రతి దానికి ఆధార్ నెంబరును అనుసంధానం చేస్తారని, ఏవైనా అవకతవకలు జరిగినట్టయితే వెంటనే గుర్తించి సంబంధితాధికారిపై గాని లబ్ధిదారుడుపై గాని చర్యలు తీసుకుంటామని అన్నారు.
చేపల చెరువుల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, అర్హత కలిగిన వారికి వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ కె.సుధాకర్, జెడ్పీసీ ఈవో డి.సత్యనారాయణ, నిక్‌నెట్ అధికారి శర్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement