సమస్యలు గాలికి.. అధికారులు నిద్రలోకి!
- నందికొట్కూరులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకొని, భూసేకరణ చట్ట ప్రకారం షాపుల యజమానులకు నష్టపరిహారం అందించాలని డీసీసీ ప్రెసిడెంట్ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్‌రత్నం జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్‌ను కోరారు.
- -కర్నూలు మండలం రేమట ఎత్తిపోతల నుంచి నీళ్లు అందక కొత్తకొట, తొలశాపురం, బసాపురం, ఆర్ కానాపురం గ్రామాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయని..ఆదుకోవాలని రైతులు వెంకటేశ్వర్లు, మద్దిలేటి, జయన్న, మునిస్వామి మౌలాలి విజ్ఞప్తి చేశారు.
- గోకులపాడులో సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, సుంకేసుల నుంచి గోకులపాడు మినీడ్యాంకు సాగునీళ్లివ్వాలని గ్రామ సర్పంచ్ లక్ష్మీవరదారెడ్డి, రైతులు రఘునాథరెడ్డి, పార్వతిరెడ్డి, మహేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి కలెక్టర్‌ను వినతిపత్రం అందించారు.
- వర్షాభావ పరిస్థితుల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయని జుర్రేరు ప్రాజెక్టు నుంచి దద్దణాల ప్రాజెక్టుకు సాగు, తాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని కె. మూలారెడ్డి, రైతులు కలెక్టర్‌కు విన్నవించారు.
- వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్, రబీలో వేసుకున్న పత్తి, మిరప, కంది, జొన్న, మినుము, మొక్కజొన్న నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద అదనంగా పంపును ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని గడివేముల కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఒడ్డు ప్రతాపరెడ్డి, కరిమద్దెల ఎంపీటీసీ ఈశ్వర్‌రెడ్డి, తూడిచెర్ల, పెసరవాయి, కరిమిద్దెల, ఎర్రగుంట్ల, భూజనూరు, చిందకూరు, గ్రందివేముల, గడిగరేవుల, తిరుపాడు, కోరటమద్ది, పులిమద్ది గ్రామాల రైతులు కలెక్టర్‌కు విన్నవించారు.
- మదారి కురువ, మదాసి కురువలను ఎస్సీలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ మదారి కురువ, మదాసి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు దిబ్బనగంట రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కె సుంకన్న, ట్రెజరర్ చంద్రశేఖర్, జిల్లాలోని 40 మండలాల్లోని మదారి కురువ, మదాసి కురువలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.