రెండు రోజుల్లో నీళ్లివ్వకపోతే సస్పెండ్ చేస్తా
Published Mon, May 8 2017 11:18 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- బొందిమడుగుల దళిత కాలనీకి నీటి సరఫరా నిలిపేసిన టీడీపీ నేతలు
- వారం క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని అధికారులు
- మళ్లీ ‘మీకోసం’లో వినతి పత్రం అందజేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
- తుగ్గలి తహసీల్దార్‌పై కలెక్టర్ ఆగ్రహం
కల్లూరు (రూరల్): ‘కలెక్టర్ ఆదేశాలు అంటే లెక్క లేదా.. రెండు రోజుల్లో బొందిమడుగుల దళిత కాలనీకి నీరివ్వకపోతే సస్పెండ్ చేస్తా’ అని కలెక్టర్ సత్యనారాయణ తుగ్గలి ఇన్‌చార్జ్ తహసీల్దార్ పుల్లయ్యను హెచ్చరించారు. బొందమడుగుల గ్రామంలోని దళిత వాడలో తాగునీటి పైపులైన్ కోసం 400 మీటర్ల గుంతలు తవ్వించి పైపులు వేశారని, అయితే అధికార పార్టీకి చెందిన నేతలు తాగునీటిని సరఫరా చేయించకుండా రాజకీయం చేస్తున్నారని తమరే న్యాయం చేసి మంచినీటిని సరఫరా చేయించాలని తుగ్గలి మండలం వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టి.ఎం.రమేష్, మండల్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ వడ్డె రంగస్వామి, రాయలసీమ మాదిగ దండోరా ప్రెసిడెంట్ అనంత రత్నం మాదిగ, గ్రామ ప్రజలు మునిస్వామి, మద్దిలేటి, బాలరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నెల 1వ తేదీన మోస్ట్ అర్జెంట్ కలెక్టర్స్ గ్రీవెన్స్ నుంచి నోటీసులు జారీ అయింది. అయితే కలెక్టర్ ఆదేశాలను తుగ్గలి మండల అధికారులు లెక్కచేయలేదు. దీంతో స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లో సమస్యను పరిష్కారం చేయకపోతే సస్పెండ్ చేస్తానని ఇన్‌చార్జి తహశీల్దార్ పుల్లయ్యను హెచ్చరించారు. సోమవారం సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీ కోసం’లో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ 2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీసీఈఓ ఈశ్వర్, హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
బుద్ధీ, జ్ఞానం ఉందా
ఆస్పరి తహసీల్దార్‌పై కలెక్టర్ మండిపాటు
ఆస్పరి గ్రామానికి చెందిన కె. గోవిందు తన రెండు సెంట్ల స్థలాన్ని కొందరు ఆక్రమించారని, తహసీల్దార్ సర్వే చేయిస్తే తనదేనని తేలిందని, ఎండార్స్‌మెంట్ ఇచ్చారే కానీ పొజిషిన్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆస్పరి తహసీల్దార్‌ౖ ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది మంచిది కాదు.. స్థలం బాధితుడిదేనని ఎండ్రార్స్‌మెంట్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఎందుకివ్వడం లేదు.. బుద్ధీ.. జ్ఞానం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement