ఎవరి పని వారే చేయండి
- ఇతరులతో చేయిస్తేనే సమస్యలు
- తాజా ప్రగతి నివేదికలు ఇవ్వండి
- కలెక్టర్ ఎస్. సత్యనారాయణ
- జిల్లా అధికారులతో సమావేశం
కర్నూలు(అగ్రికల్చర్): ఎవరికి కేటాయించిన పని వారే స్వయంగా చేస్తే ఏ సమస్యలుండవని, పైగా పరిష్కారం కూడా పక్కాగా ఉంటుందని కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అన్నారు. వివిధ జిల్లాల్లో మీ కోసం కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారం 99శాతం ఉందని, మన జిల్లాకు సంబంధించి కొత్తపల్లి, శ్రీశైలం, కొసిగి, తుగ్గలి, పాములపాడు, అవుకు తదితర మండలాల్లో 90శాతానికి మించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ప్రజాపంపిణీ కూడా 81.08 శాతం మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవ్వరికి అప్పగించిన పనులు వారే స్వయంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. బ్యాంకుల వారీగా అధికారులతో చర్చించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్‌ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు, బ్యాంకర్లు పరస్పర సహకారంతో పనిచేసినపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా నిర్వహించాలని ఆదేశించిన కలెక్టర్.. కంప్యూటర్ల కొరత ఉంటే కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలివ్వాలని ఆదేశించారు.
తాజా ప్రగతి నివేదికలు ఇవ్వండి..
సీఎం చంద్రబాబు ఈ నెల 17, 18వతేదీల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లా అధికారులందరూ తమ శాఖలకు సంబంధించి తాజా ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు, పింఛన్‌ల పంపిణీ, మీ కోసం దరఖాస్తుల పరిష్కారం, మీసేవ కేంద్రాల పనితీరు, రెవెన్యూ అంశాలపై నివేదికలివ్వాలన్నారు. దీపం పథకం కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ గ్యాస్ క¯ðనెక‌్షన్ ఇవ్వాలని, ఈ దిశగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ-2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.