విధి నిర్వహణలో అలసత్వం వద్దు
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
Published Thu, Jun 15 2017 12:42 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- పాఠశాలలను శుభ్రంగా ఉంచుకోవాలి
- విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
- మెనూ ప్రకారం మధ్యాహ్నభోజనం వడ్డించాలి
- ఏ సమస్య ఉన్నా 1100కు ఫోన్ చేయవచ్చు
- తరిగోపులలో జిల్లా కలెక్టర్ పర్యటన
జూపాడుబంగ్లా : విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. పల్లెపిలుపు కార్యక్రమంలో భాగంగా బుధవారం తరిగోపుల గ్రామంలో ఆయన పర్యటించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య ఉపకేంద్రం, సచివాలయం, ఇందిరమ్మగృహాలను తనిఖీచేశారు. ముందుగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను తనిఖీచేసి..రిజిష్టర్లను పరిశీలించారు. హాజరుశాతం మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. మూడోతరగతి చదువుతున్న అశోక్, శివమణి, హేమలతలను అడిగి..ఎక్కాలు చెప్పించుకొన్నారు. శివమణి 13వ ఎక్కం బాగా చెప్పటంతో అభినందించారు. ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆంగ్లమాధ్యమంలో సోషల్ పుస్తకాన్ని విద్యార్థులతో చదివించారు. విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించాలని సూచించారు.
బయోమెట్రిక్ తీసుకుంటున్నారా?
బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతం తీసుకుంటున్నారా లేదా అంటూ కలెక్టర్ ఆరాతీశారు. బయోమెట్రిక్ యంత్రం సక్రమంగా పనిచేయటం లేదని హెచ్‌ఎం మల్లిఖార్జునాచారి పేర్కొనటంతో కలెక్టర్ వెంటనే డీఈఓ తెహరాసుల్తానాకు ఫోన్‌చేసి ప్రశ్నించారు. దీంతో హెచ్‌ఎం, డీఈఓల మద్య వాడివేడిగా సంభాషణ జరిగింది. పాఠశాలల్లో లెట్రిన్లు శుభ్రంగా ఉంచకపోవటంపై కలెక్టర్.. హెచ్‌ఎం మల్లిఖార్జునాచారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ముందుగా మంచి పద్ధతులు నేర్చుకోవాలని సూచించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని మందలించారు. పాఠశాలల్లోని బాత్‌రూంల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా మహిళలకు అప్పగించాలని సూచించారు. మధ్యాహ్నభోజనాన్ని తనిఖీచేసిన కలెక్టర్.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వండిపెట్టాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలల ఆవరణలోని మైదానాల్లో ఆకుకూరలు, కూరగాయల మొక్కలు నాటుకోవాలని సూచించారు. అందుకుగాను బయోఫెన్సింగ్‌ను మంజూరు చేస్తామన్నారు.
త్వరలో మరుగుదొడ్ల బిల్లులు..
గ్రామంలోని అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఎన్‌టీఆర్ గృహనిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు.. మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లు గడిచినా బిల్లులు మంజూరు చేయటం లేదని కలెక్టర్‌కు తెలిపారు. త్వరలో బిల్లులు మంజూరయ్యేలా చేస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో సిమెంటు రోడ్లు, డ్రెయినేజి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రైతులకు 70వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పత్తిపంట సాగును తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఎంపీడీఓ ఇవి.సుబ్బారెడ్డి, తహసీల్దారు రమణారావు, ఎంపీపీ మంజుల, సర్పంచ్ దీవెనమ్మ, కార్యదర్శి తిప్పన్న, ఏఈలు బషీర్, మహమ్మద్‌హుసేన్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కుమారి, గిరీశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement