కంట్రోల్ తప్పిన కడప కేంద్ర కారాగారం
కడప అర్బన్ :
కడప కేంద్ర కారాగారం కంట్రోల్ తప్పుతోంది. ఇక్కడి రిమాండు ఖైదీలతో పాటు కొందరు జీవిత ఖైదీలకు కావాల్సిన సకల సౌకర్యాలన్నింటి సమకూరుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు సిబ్బందే స్వయంగా వీటిని అందజేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. మొన్న గంజాయి.. నిన్న సెల్‌ఫోన్లు లభ్యమైనట్లు స్పష్టమైన సమాచారముంది. ఖైదీల సౌకర్యార్థం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ సౌకర్యాన్ని మార్చిలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఖైదీలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వారానికి రెండుసార్లు తాము రికార్డు చేసుకున్న నంబర్లకు ఫోన్‌లు చేసుకునే విధంగా ఒక్కొక్కరు ఐదు నిముషాల పాటు మాట్లాడుకునేలా అవకాశం కల్పించారు. అయినా రిమాండ్ ఖైదీల వద్ద సెల్‌ఫోన్లు లభ్యమవుతుండడం దుమారం రేపుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిఘా నీడలోనే...
కడప కేంద్ర కారాగారంలోని ప్రధాన ద్వారం వద్ద, లోపలి ద్వారం వద్ద రెండుచోట్ల అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని హైదరాబాద్‌లోని కారాగార శాఖ డీజీ కార్యాలయానికీ అనుసంధానం చేశారు. అయినా కారాగారంలోకి సెల్‌ఫోన్లు, గంజాయి యథేచ్చగా సరఫరా కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిఘా వ్యవస్థను స్వయంగా సూపరింటెండెంటే పరిశీలిస్తున్న సమయంలో మాత్రం అక్కడ పని చేస్తున్న సిబ్బంది చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు నడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిగతా సమయాల్లో కొందరు సెక్యూరిటీ విభాగం లోపలికి వచ్చే రిమాండు ఖైదీలను గానీ, ఇంటర్వ్యూలకు వచ్చే బంధువులను గానీ సక్రమంగా తనిఖీలు చేయకపోవడం గమనార్హం. రిమాండు ఖైదీలు కోర్టులకు హాజరై తిరిగి వచ్చే సమయంలో సెల్‌ఫోన్లను కొనుగోలు చేస్తూ దర్జాగా లోపలికి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాయి ప్యాకెట్లను ప్రహరీ నుంచి ఇవతలకు విసిరేస్తున్నట్లు సమాచారం. తాము ఎంత కట్టడి చేసినా ఎక్కడో చిన్న లోపంతో ఇలా జరుగుతూనే ఉన్నాయని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ గోవిందరాజులు చెబుతుండడం గమనార్హం.