official estimate
-
అధికారిక డేటాకు మించిన వృద్ధి ఉంటుంది
ముంబై: అధికారిక డేటాలో కనిపిస్తున్న దానికి మించి భారత్ వృద్ధి చెందుతోందని స్విస్ బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్ ఈక్విటీల అంచనాలను ’అండర్‌వెయిట్’ నుంచి ’బెంచ్‌మార్క్’ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. కీలక సూచీలు 14 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సంస్థ రీసెర్చ్ హెడ్ నీలకంఠ్ మిశ్రా తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6 శాతం దిగువకు తగ్గొచ్చని అంతా అంచనా వేస్తున్నప్పటికీ ఇది 7 శాతం స్థాయిలో ఉంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా అంతా కేవలం అధికారిక డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము మరింత విస్తృత గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ‘దేశీయంగా మరిన్ని వృద్ధి చోదకాల ఊతంతో 2023లో భారత్ జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని పెంచడం, అల్పాదాయ ఉద్యోగాలు పెరగడం, సరఫరావ్యవస్థపరమైన అవాంతరాలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవు. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ఎకానమీ మందగమనం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా నిలువరించగలవు‘ అని మిశ్రా చెప్పారు. రిస్కులు ఉన్నాయి.. ఇంధనాల దిగుమతులు, విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం, ప్రపంచ ఎకానమీ మందగించడం వంటి అంశాల ఆధారిత రిస్కులు కొనసాగుతాయని మిశ్రా చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మరింతగా వడ్డీ రేట్లను పెంచాల్సినంతగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఇతరత్రా పరిస్థితులు లేవని తెలిపారు. అయినప్పటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆర్బీఐ .. రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు. మరోవైపు, చైనా కష్టాల్లో ఉండటం వల్లే భారత్‌లోకి మరిన్ని నిధులు వస్తున్నాయన్నది అపోహ మాత్రమేనని మిశ్రా చెప్పారు. ప్రాంతాలను బట్టి ఆసియా పసిఫిక్, వర్ధమాన మార్కెట్లు వంటి వాటికి మేనేజర్లు పెట్టుబడులు కేటాయిస్తూ ఉంటారని, దానికి అనుగుణంగానే భారత్‌లోకి నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం ఆశావహంగా కనిపిస్తోందని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ రంగాలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని మిశ్రా వివరించారు. -
అసలు నష్టమెంత?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వారం రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. నెల రోజుల్లో చేతికొచ్చే తరుణంలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. నష్టం గురించి ఏమని చెప్పగలం.. బ్యాంకుల నుంచి రైతులు రూ.742 కోట్ల రుణాలు తీసుకున్నారు. పరిహారం ఇచ్చే బదులు ఆ రుణాలు మాఫీ చేస్తే మంచిది.. వ్యవసాయాధికారుల సమాధానం. .. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పంట నష్టం కనీసం రూ.742 కోట్లు ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. అయితే జిల్లా అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.265 కోట్లేనట!.. నష్టాలపై సర్వే మొదలు పెట్టకుండానే ఈ విధంగా అంచనా వేయడం గమనార్హం. అసలు రైతులకు జరిగిన నష్టమెంత? దాన్ని ఏ ప్రాతిపదికన గణించాలన్నది ప్రస్తుతం వ్యవసాయాధికారులను తర్జనభర్జనలకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం వ్యవసాయశాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన్నుంచి ఇదే ప్రశ్న ఎదురు కాగా అధికారులు సూటిగా చెప్పలేకపోయారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత నష్టమని చెప్పగలమని అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే ప్రాథమిక అంచనాలు సోమవారం తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి పంట 2.60 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని తేల్చారు. నష్టం 260 కోట్లు ఉంటుదని అంచనా వేశారు. ఉద్యాన పంటలు 4500 ఎకరాల్లో దెబ్బతిన్నాయని, రూ. 5 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని నిర్థారణకు వచ్చారు. పంటంతా నీటిలోనే.. జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. నెల రోజుల్లో చేతికి రావాల్సిన ఈ పంటంతా గత వారం రోజు లుగా నీటిలోనే ఉంది. నీరంతా బయటకు వెళ్లడానికి మరో మూడు రోజులైనా పడుతుంది. ఈ లెక్కన పది రోజులు నీటిలో నానిన పంట దక్కే అవకాశం లేదన్నమాటే. పంటలు బాగా పండితే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. బస్తా వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినా వెయ్యి రూపాయలు. అధికారుల చెప్పిన దెబ్బతిన్న పంట విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలకే లెక్క వేస్తే రూ. 800 కోట్లు అవుతుంది. దిగుబడిని దృష్టిలో ఉంచుకొని అంచనా వేయాలి పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు, దిగుబడులను దృష్టిలో ఉంచుకొని నష్టం అంచనాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. పొలాల్లోనే ఉన్న పంట నష్టాన్ని ఎలా లెక్కించాలనే మీమాంస అధికారులు వ్యక్తం చేయడం సరికాదని రైతులు అంటున్నారు. మరో 30 రోజుల్లో చేతికి రావాల్సిన పంట నీటిపాలైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ఎకరాకు సగటు దిగుబడి ఆధారంగా నష్టం అంచనా వేయాలని కోరుతున్నారు. బ్యాంకు రుణాలతో సమానంగా నష్టం జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ. 742 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. పంట నష్టం కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్నందున రుణాలను వెంటనే మాఫీ చేయాలని.. ఇంతకంటే తామేమీ చెప్పలేమని మండల వ్యవసాయశాఖ అధికారులు జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా చాలా మంది రైతులు ప్రైవేట్‌గా అప్పులు తీసుకున్నారు. ఇవన్నీ గుర్తించి అన్ని రకాల అప్పులు రద్దు చేయకుంటే పరిస్థితి మరో విధంగా ఉండే అవకాశం ఉంది. భూముల్లో మేటలు జిల్లాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు, కాలువలు, వంశధార, నాగావళి కాలువలకు 821 చోట్ల గండ్లు పడ్డాయి. ఇంకా పలు రోడ్లు కొట్టుకుపోయాయి. వీటిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. వేలాది ఎకరాల్లో మట్టి మేటలు వేసింది. దాన్ని తొలగించుకునేందుకు రైతులకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది.