ముంబై: అధికారిక డేటాలో కనిపిస్తున్న దానికి మించి భారత్ వృద్ధి చెందుతోందని స్విస్ బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్ ఈక్విటీల అంచనాలను ’అండర్‌వెయిట్’ నుంచి ’బెంచ్‌మార్క్’ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. కీలక సూచీలు 14 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సంస్థ రీసెర్చ్ హెడ్ నీలకంఠ్ మిశ్రా తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6 శాతం దిగువకు తగ్గొచ్చని అంతా అంచనా వేస్తున్నప్పటికీ ఇది 7 శాతం స్థాయిలో ఉంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మిగతా అంతా కేవలం అధికారిక డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము మరింత విస్తృత గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ‘దేశీయంగా మరిన్ని వృద్ధి చోదకాల ఊతంతో 2023లో భారత్ జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని పెంచడం, అల్పాదాయ ఉద్యోగాలు పెరగడం, సరఫరావ్యవస్థపరమైన అవాంతరాలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవు. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ఎకానమీ మందగమనం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా నిలువరించగలవు‘ అని మిశ్రా చెప్పారు.
రిస్కులు ఉన్నాయి..
ఇంధనాల దిగుమతులు, విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం, ప్రపంచ ఎకానమీ మందగించడం వంటి అంశాల ఆధారిత రిస్కులు కొనసాగుతాయని మిశ్రా చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మరింతగా వడ్డీ రేట్లను పెంచాల్సినంతగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఇతరత్రా పరిస్థితులు లేవని తెలిపారు. అయినప్పటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆర్‌బీఐ .. రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు. మరోవైపు, చైనా కష్టాల్లో ఉండటం వల్లే భారత్‌లోకి మరిన్ని నిధులు వస్తున్నాయన్నది అపోహ మాత్రమేనని మిశ్రా చెప్పారు. ప్రాంతాలను బట్టి ఆసియా పసిఫిక్, వర్ధమాన మార్కెట్లు వంటి వాటికి మేనేజర్లు పెట్టుబడులు కేటాయిస్తూ ఉంటారని, దానికి అనుగుణంగానే భారత్‌లోకి నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం ఆశావహంగా కనిపిస్తోందని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ రంగాలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని మిశ్రా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment