Swiss brokerage firm
-
అధికారిక డేటాకు మించిన వృద్ధి ఉంటుంది
ముంబై: అధికారిక డేటాలో కనిపిస్తున్న దానికి మించి భారత్ వృద్ధి చెందుతోందని స్విస్ బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్ ఈక్విటీల అంచనాలను ’అండర్‌వెయిట్’ నుంచి ’బెంచ్‌మార్క్’ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. కీలక సూచీలు 14 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సంస్థ రీసెర్చ్ హెడ్ నీలకంఠ్ మిశ్రా తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6 శాతం దిగువకు తగ్గొచ్చని అంతా అంచనా వేస్తున్నప్పటికీ ఇది 7 శాతం స్థాయిలో ఉంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా అంతా కేవలం అధికారిక డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము మరింత విస్తృత గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ‘దేశీయంగా మరిన్ని వృద్ధి చోదకాల ఊతంతో 2023లో భారత్ జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని పెంచడం, అల్పాదాయ ఉద్యోగాలు పెరగడం, సరఫరావ్యవస్థపరమైన అవాంతరాలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవు. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ఎకానమీ మందగమనం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా నిలువరించగలవు‘ అని మిశ్రా చెప్పారు. రిస్కులు ఉన్నాయి.. ఇంధనాల దిగుమతులు, విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం, ప్రపంచ ఎకానమీ మందగించడం వంటి అంశాల ఆధారిత రిస్కులు కొనసాగుతాయని మిశ్రా చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మరింతగా వడ్డీ రేట్లను పెంచాల్సినంతగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఇతరత్రా పరిస్థితులు లేవని తెలిపారు. అయినప్పటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆర్బీఐ .. రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు. మరోవైపు, చైనా కష్టాల్లో ఉండటం వల్లే భారత్‌లోకి మరిన్ని నిధులు వస్తున్నాయన్నది అపోహ మాత్రమేనని మిశ్రా చెప్పారు. ప్రాంతాలను బట్టి ఆసియా పసిఫిక్, వర్ధమాన మార్కెట్లు వంటి వాటికి మేనేజర్లు పెట్టుబడులు కేటాయిస్తూ ఉంటారని, దానికి అనుగుణంగానే భారత్‌లోకి నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం ఆశావహంగా కనిపిస్తోందని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ రంగాలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని మిశ్రా వివరించారు. -
కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాల కంటే..
ముంబై: బోర్డుల్లో మహిళా ప్రాధాన్యతలో ఇతర పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే కార్పొరేట్ ఇండియా వెనుకడుగులో ఉంది. అయితే ఇటీవల కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. దీంతో తాజాగా మహిళా డైరెక్టర్ల శాతం 17.3 శాతానికి బలపడింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 24 శాతంగా నమోదైనట్లు క్రెడిట్ స్వీస్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 46 దేశాలలో 3,000 కంపెనీలకు చెందిన 33,000 మంది ఎగ్జిక్యూటివ్స్‌ను పరిగణనలోకి తీసుకుని సర్వేను తయారు చేసినట్లు క్రెడిట్ స్వీస్ తెలియజేసింది. వీటిలో 12 ఆసయా పసిఫిక్ మార్కెట్లలోని 1,440 సంస్థలను సైతం కవర్ చేసినట్లు పేర్కొంది. అయితే సర్వేలో దేశీయంగా ఎన్ని కంపెనీలూ, ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిందీ క్రెడిట్ స్వీస్ వెల్లడించలేదు. నివేదికలోని ఇతర అంశాలు చూద్దాం.. 2015తో పోలిస్తే.. గత ఆరేళ్లలో దేశీ కార్పొరేట్ బోర్డుల్లో స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. దీంతో 2015లో వీరి సంఖ్య 11.4 శాతంగా నమోదుకాగా.. 2021కల్లా మరో 6 శాతం పుంజుకుంది. ఈ బాటలో గత రెండేళ్లలో యాజమాన్యంలోనూ స్త్రీ ప్రాతినిధ్యం 2 శాతం బలపడింది. ఫలితంగా 2019లో నమోదైన 8 శాతం వాటా 2021కల్లా 10 శాతానికి చేరింది. కాగా.. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో 17.3 శాతం వాటాతో ఎపాక్ ప్రాంతంలో భారత్ మూడో కనిష్ట ర్యాంకులో చేరింది. దక్షిణ కొరియా(8 శాతం), జపాన్(7 శాతం) కంటే ముందు నిలిచింది. మహిళా సీఈవోలలో 5 శాతం, సీఎఫ్వోలలో 4 శాతం వాటాను కలిగి ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కుటుంబ సభ్యులుకాకుండా స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను తప్పనిసరి చేసినప్పటికీ చాలా కంపెనీలు నిబంధనలు పాటించడంలో వెనుకబడి ఉన్నాయి. ఇక ప్రపంచస్థాయిలో 2015–2021 మధ్య కాలంలో బోర్డులో మహిళల ప్రాతినిధ్యం 8.9 శాతంమేర పెరిగింది. యూరప్‌లో 34.4 శాతం, ఉత్తర అమెరికాలో 28.6 శాతం చొప్పున మహిళలకు ప్రాధాన్యత లభిస్తోంది. ఆసియా పసిఫిక్ సగటు 17.3 శాతంకాగా.. లాటిన్ అమెరికాలో ఇది 12.7 శాతంగా నమోదైంది. చదవండి: ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది! -
ఏడాదిలో 8,000 పాయింట్లకు నిఫ్టీ
ముంబై: కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో మార్కెట్‌పట్ల బుల్లిష్‌గా ఉన్నామని, 2014 చివరికల్లా నిఫ్టీ 8,000 పాయింట్లను తాకుతుందని అంచనా వేస్తున్నామని స్విస్ బ్రోకరేజీ సంస్థ విదేశీ బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్ పేర్కొంది. మోడీ అధ్యక్షతన ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించడం మార్కెట్లకు అత్యంత సానుకూల అంశమని అభిప్రాయపడింది. ఎన్డీఏ పటిష్టమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించింది. మార్కెట్ వ్యూహం పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. వెరసి ఈక్విటీలపట్ల సానుకూల వైఖరితో ఉన్నామని, మార్కెట్లు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతాయని అంచనా వేసింది. గత కొన్ని నెలలుగా మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ, సరైన స్థాయిలోనే కొనసాగుతున్నాయని తెలిపింది. ఐదేళ్ల సగటు అయిన 15 పీఈ స్థాయిలో కదులుతున్నాయని వివరించింది. ఈ పీఈలో నిఫ్టీ విలువ 6,900కాగా, 2014 చివరికల్లా ఆర్జనలో 15% వృద్ధిని అంచనా వేస్తే నిఫ్టీ 7,800ను చేరుకుంటుందని పేర్కొంది. వృద్ధి అంచనాలరీత్యా ఇన్వెస్టర్లు ప్రీమియం స్థాయిలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపుతారని విశ్లేషించింది. వచ్చే ఏడాది 15% వృద్ధి ఈ ఏడాది చివరికల్లా ఇన్వెస్టర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16) వృద్ధిపై అంచనాలు మొదలుపెడతారని యూబీఎస్ పేర్కొంది. కనీస స్థాయిలో అంచనావేస్తే నిఫ్టీ కంపెనీల ఆర్జన 15% వృద్ధి చెందగలదని అభిప్రాయపడింది. ఈ ప్రకారం 15 పీఈ చొప్పున చూసినా నిఫ్టీ 8,000ను తాకగలదని వివరించింది. కాగా, రానున్న కొద్ది నెలల్లో ప్రభుత్వ విధానాలు, తదితర నిర్ణయాల ఫలిత ంగా నిఫ్టీ అంచనాలను మరింత పెంచే అవకాశం కూడా ఉన్నదని తెలిపింది. వీటితోపాటు ఆర్థిక రికవరీ వంటి అంశాలు కూడా మార్కెట్లకు దన్నునిస్తాయని తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశంలోనూ గుజరాత్ తరహా అభివృద్ధిపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని యూబీఎస్ వ్యాఖ్యానించింది.