కేంద్ర ప్రభుత్వంలోకి జేడీ(యూ)
పట్నా: బిహార్ అధికార పక్షం జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధికారికంగా నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమిలో భాగస్వామిగా మారిపోయింది. శనివారం జరిగిన పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు నితీశ్ కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కేంద్ర కేబినెట్ లోకి ప్రవేశించేందుకు జేడీ(యూ)కు మార్గం సుగమం అయ్యింది.
మహాకూటమి నుంచి నిష్క్రమించి బీజేపీ కూటమితో నితీశ్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తన వర్గీయులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే జేడీ(యూ) సమావేశం జరుగుతున్న సమయంలో శరద్ మద్ధతుదారులు, ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో నితీశ్ ఇంటి బయట భద్రతను భారీగా పెంచారు.
లాలూ విసుర్లు...
ఇది జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశం కాదని, బీజేపీ భేటీ అని, వాళ్లే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు. కుంభకోణాల నుంచి బయటపడేందుకు నితీశ్, సుశీల్ మోదీలు పబ్లిక్‌గా ముక్కు ముక్కు రాసుకుంటున్నారని లాలూ పేర్కొన్నారు.