రెనో చిన్న కారు మే 20న వస్తోంది...
పాత కార్ల విక్రయాల్లోకి ప్రవేశిస్తున్నాం
- కార్లెస్ షోరూంలు ఏర్పాటు
- రెనో వైస్ ప్రెసిడెంట్ రాఫెల్ ట్రెగ్వెర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న చిన్న కారుకు ముహూర్తం ఖరారైంది. 800 సీసీ సామర్థ్యంతో రూపొందుతున్న ఈ కారును ముందుగా భారత్‌లో ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో విడుదల చేయనున్నారు.
మే 20న చెన్నైలో ఆవిష్కరిస్తున్న విషయాన్ని రెనో ఇండియా సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాఫెల్ ట్రెగ్వెర్ ధ్రువీకరించారు. మల్టీ పర్పస్ వెహికిల్ రెనో లాడ్జీ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కాగా, చిన్న కారు జూన్-జూలైకల్లా భారతీయ రోడ్లపై పరుగు తీయనుందని సమాచారం. రెనో ఒక మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించడం కూడా ఇదే మొదటిది. కారు ధర రూ.2.5-4 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కార్యకక్రమంలో పంపిణీ సంస్థ శ్రీశ్రీశ్రీ రెనాల్ట్స్ ఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కార్లు లేని షోరూంలు..
భారత్‌లో టీవీఎస్ అండ్ సన్స్ సహకారంతో డిజిటల్ షోరూంలను రెనో తెరవనుంది. కార్లకు బదులుగా షోరూంలో తెరను ఏర్పాటు చేస్తారు. కస్టమర్ తనకు కావాల్సిన మోడళ్లను ఆ స్క్రీన్‌పై వీక్షించొచ్చు. అలాగే పాత కార్ల విక్రయాల్లోకి కంపెనీ ప్రవేశిస్తోంది. వారం రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. హైదరాబాద్‌తోసహా ఏడు నగరాల్లో డీలర్లను నియమించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
5 శాతం వాటా లక్ష్యం..: కంపెనీ 2014లో దేశంలో సుమారు 50 వేల వాహనాలను విక్రయించింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 7 శాతం. ఇక భారత్‌లో రెనోకు 2 శాతం మార్కెట్ వాటా ఉంది. 2016 నాటికి 5 శాతం లక్ష్యంగా చేసుకున్నట్టు రాఫెల్ చెప్పారు. 2015లో కొత్తగా 45 డీలర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. చెన్నై సమీపంలోని రెనో-నిస్సాన్‌ల సంయుక్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 4.8 లక్షల యూనిట్లు. ప్లాంటు విస్తరణకు ఇరు సంస్థలు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి.