Old disputes
-
మెంటాడలో పడగవిప్పిన పాత కక్షలు
మెంటాడ : పాతకక్షల నేపథ్యంలో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మెంటాడలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, గ్రామస్తులు,పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయిపల్లి సీతన్న, అచ్చియ్య, దివంగత అప్పలనాయుడు ముగ్గురూ అన్నదమ్ములు. ఇదే గ్రామానికి చెందిన కొల్లి సత్యనారాయణ దివంగత అప్పలనాయుడు కుమార్తె కొండమ్మను వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా సత్యనారాయణకు మామయ్యల వరసయ్యే సీతన్న, అచ్చియ్య మధ్య భూ తగాదాలున్నాయి. గతంలో ఒకరిపై ఒకరు ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇటీవల వీధి కాలువ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి సత్యనారాయణను మట్టుబెట్టడానికి సీతన్న, అచ్చియ్య చూస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో సత్యనారాయణ ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం గమనించిన సీతన్న, ఆయన భార్య గౌరి, అచ్చియ్య మాటువేసి ఒక్కసారిగా దాడి చేశారు. సీతయ్య గొడ్డలితో సత్యనారాయణ ముఖం మీద కొట్టగా, ఆయ భార్య గౌరి పెద్ద కర్రతో తల వెనుక భాగంలో దాడి చేసింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు గమనించి స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్సై కె. నాయుడు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. మిన్నంటిన రోదనలు సత్యానారాయణ భార్యకొండమ్మ, తల్లిదండ్రులు గంగమ్మ, పైడపునాయుడు రోదనలతో ఆస్పత్రి ఆవరణ దద్ధరిల్లింది. ఎంతో నెమ్మదిగా ఉండే సత్యనారాయణను హత్య చేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఐదుగురిపై కత్తితో దాడి
* పాతకక్షలే కారణం * నలుగురు మహిళలు, బాలుడికి గాయాలు * ఇద్దరి పరిస్థితి విషమం * నాదెండ్ల బీసీ కాలనీలో ఘటన నాదెండ్ల(గుంటూరు): పాతకక్షల నేపథ్యంలో ఉన్మాదిగా మారిన యువకుడు నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచిన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్లలో శుక్రవారం సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని బీసీకాలనీ ఉరవకట్ట సెంటర్లో నివాసం ఉండే అలుగునీడి వినోద్ కుమార్ ఇంటిఎదురుగా నివాసం ఉంటున్న నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో దాడిచేసి గాయపరిచాడు. పాతకక్షలే కారణం... బీసీ కాలనీలో నివాసం ఉండే అలుగునీడి శివయ్య కుమారుడు వినోద్‌కుమార్ తిమ్మాపురంలోని ఓ స్పిన్నింగ్‌మిల్లులో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ఎదురింట్లో ఉన్న షేక్ నాగార్జున కుటుంబంతో వీరికి పాత కక్షలు ఉన్నాయి. గత ఏడాది వినోద్ కుమార్ తల్లి పూర్ణమ అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆమె మొదటి వర్ధంతి జరుపుకున్నారు. తన తల్లి మరణానికి ఎదురింటివారి వేధింపులే కారణమని భావించిన వినోద్ కుమార్ వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గురువారం రాత్రి వివాదం కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా ఇరుకుటుంబాల మధ్య కలహాలు జరిగాయి. దీంతో వినోద్‌కుమార్ చిలకలూరిపేటకు వచ్చి కొబ్బరిబోండాలు నరికే కత్తి కొలుగోలు చేసి ఇంటికి చేరుకున్నాడు. ఉదయం 10గంటల సమయంలో ఎదురింట్లో పురుషులు ఎవరూ లేని సమయం చూసి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగార్జున తల్లి షేక్‌నాగూర్‌బీ, భార్య షేక్ బాజీ, ఆరేళ్ల కుమారుడు షేక్ సాయిపై కత్తితో వినోద్‌కుమార్ దాడి చేశాడు. పెద్దగా కేకలు వినబడటంతో పక్కనే నివాసం ఉంటున్న బాజీ తల్లి మస్తాన్‌బీ, మరో మహిళ షేక్ బీబీజాన్ అడ్డుకోవటానికి ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు గుమిగూడి వినోద్ చేతిలోని కత్తిని లాక్కోవడంతో జేబులో దాచుకున్న మరో చిన్న కత్తిని బయటికి తీశాడు. ఆ కత్తిని కూడా స్థానికులు లాక్కొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన షేక్ నాగుర్‌బీ, మస్తాన్‌బీలను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేక్ బాజీ, షేక్ సాయి, షేక్ బీబీజాన్‌లను 108 వాహనంలో కోండ్రుపాడులోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు.వీరిలో షేక్ బాజీ, షేక్ మస్తాన్‌బీల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తన తల్లి మనస్థాపానికి గురై మరణించిందని,అందుకే వారిపై కక్ష తీర్చుకోవటానికిదాడిచేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న వినోద్‌కుమార్ చెప్పాడు.