సృహకోల్పోయిన మృతుడి భార్య కొండమ్మ, (ఇన్‌సెట్) సత్యనారాయణ (ఫైల్)
మెంటాడ : పాతకక్షల నేపథ్యంలో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మెంటాడలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, గ్రామస్తులు,పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయిపల్లి సీతన్న, అచ్చియ్య, దివంగత అప్పలనాయుడు ముగ్గురూ అన్నదమ్ములు. ఇదే గ్రామానికి చెందిన కొల్లి సత్యనారాయణ దివంగత అప్పలనాయుడు కుమార్తె కొండమ్మను వివాహం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా సత్యనారాయణకు మామయ్యల వరసయ్యే సీతన్న, అచ్చియ్య మధ్య భూ తగాదాలున్నాయి. గతంలో ఒకరిపై ఒకరు ఆండ్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇటీవల వీధి కాలువ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి సత్యనారాయణను మట్టుబెట్టడానికి సీతన్న, అచ్చియ్య చూస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో సత్యనారాయణ ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం గమనించిన సీతన్న, ఆయన భార్య గౌరి, అచ్చియ్య మాటువేసి ఒక్కసారిగా దాడి చేశారు.
సీతయ్య గొడ్డలితో సత్యనారాయణ ముఖం మీద కొట్టగా, ఆయ భార్య గౌరి పెద్ద కర్రతో తల వెనుక భాగంలో దాడి చేసింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు గమనించి స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్సై కె. నాయుడు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు.
మిన్నంటిన రోదనలు
సత్యానారాయణ భార్యకొండమ్మ, తల్లిదండ్రులు గంగమ్మ, పైడపునాయుడు రోదనలతో ఆస్పత్రి ఆవరణ దద్ధరిల్లింది. ఎంతో నెమ్మదిగా ఉండే సత్యనారాయణను హత్య చేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment