Mentada
-
యుద్దం సమయంలో వారిని అక్కడే దాచారు
విజయనగరం : మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామం వద్ద ఉన్న కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. బొబ్బిలి రాజ్యానికి సమీపంలో ఉన్న సంస్థానం ఆండ్ర రాజ్యం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆండ్రకోట ఇప్పుడు సందర్శనీయ స్థలంగా మారింది. మెంటాడ, పాచిపెంట, విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలాలకు చెందిన సుమారు 28 గ్రామాలకు ఆండ్ర కోట సంస్థానంగా ఉండేది. ఇక్కడి కోటను 308 ఏళ్ల కిందట 1713వ సంవత్సరం జనవరి 18న నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆండ్ర సంస్థానాదీశులు విజయనగరం రాజులకు విధేయులుగా ఉండేవారు. విజయనగరం యుద్ధం జరిగిన సమయంలో విజయనగరం రాజులు వారసులను ఆండ్ర సంస్థానంలో దాచి ఉంచారట. ఆండ్ర తొలి సంస్థానాధీశుడిగా గుమ్మిడి పెదరామందొర ఉండేవారు. కాలక్రమేణా గారం దొర, గార ప్రతాప్‌రాజు, రామప్రతాప్రాజు, బహుదూర్ హరహర ప్రతాపరాజులు కొనసాగారు. ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్న ఆండ్ర బాబా వారసులుగా ఉన్నట్లు సమాచారం. కోట గత వైభవాన్ని కోల్పోతోందని, పురావస్తుశాఖ దృష్టి సారించి కోటకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సందర్శకులు కోరుతన్నారు. -
మంత్రుల హామీలు.. నీటిమూటలు
సాక్షి, మెంటాడ: మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని నాలుగున్నరేళ్ల క్రితం టీడీపీ మంత్రులు, నియోజకవర్గానికి చెందిన ఆపార్టీ నాయకులు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వపాలనా కాలం పూర్తయినా కళాశాల ఏర్పాటుకు ఒక్క అడుగూ ముందుకు వేసిన పాపాన పోలేదు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2014 డిసెంబర్8న నిర్వహించిన జోన్–4 గ్రిగ్స్ క్రీడల ప్రారంభోత్సవానికి అతిథిగా హాజ రైన నాటి రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణికి మెంటాడలో బాలికలకు ప్రత్యేక హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ మండలవాసులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మరోమారు మం డల కేంద్రంలో స్త్రీశక్తి భవనం ప్రారంభోత్సవం, చల్లపేటలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరైన మృణాళిని, స్వాతిరాణి మాట్లాడుతూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తామని భరోసానిచ్చారు. మృణాళిని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సం ధ్యారాణి, మెంటాడ మాజీ వైస్ ఎంపీపీ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ చైర్మన్ గెద్ద అన్నవరం, మండల టీడీపీ ప్రచార కన్వీనర్ రెడ్డిరాజగోపాల్ తదితరులు 2017 డిసెంబర్లో అమరావతిలో విద్య, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి 2017–2018 విద్యాసంవత్సరం నుంచి జూనియ కాలేజ్ నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వపాలనా కాలం ముగిసినా కళాశాల ఏర్పాటు కాకపోవడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థులకు తప్పని అవస్థలు మెంటాడలో జూనియ కాలేజ్ ఏర్పాటు చేస్తే, మెంటాడ మండలంతో పాటు పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలానికి చెందిన 9 పంచాయతీలు, పాచిపెంట మండలంలోని పలుగిరిజన గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అనంతగిరి, పాచిపెంట, మెంటాడ మండలాల నుంచి ఏటా ఇంటర్‌విద్య కోసం సుమారు 12 వందల మంది విద్యార్థులు గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, విశాఖపట్నం తదితర పట్టణాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థోమత లేక మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. చదువులు మానుకోవాల్సి వస్తోంది మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో ఈప్రాంత పేదవిద్యార్థులు పదోతరగతి తర్వాత చదువుమానుకోవాల్సి వస్తోంది. నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. వందలమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిసి కూడి కళాశాల ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదు. వచ్చే ప్రభుత్వమైనా కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. –అగతాన త్రినాథ, మాజీ సర్పంచ్, లోతుగెడ్డ, మెంటాడ మండలం టీడీపీ ప్రభుత్వం విఫలమైంది మెంటాడలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నాటి, నేటి మంత్రులు మృణాళిని, గంటా శ్రీనివాసరావుతో పాటు ఈ ప్రాంత టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్స్న్ శోభా స్వాతిరాణి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.పి.భంజ్‌దేవ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. గిరిజనుల అభివృద్ధికి వీరు చేసింది శూన్యం. కనీసం విద్యార్థులు చదువుకునేందుకు కళాశాల కూడా ఏర్పాటు చేయలేకపోయారు. –అంజిలి పైడితల్లి, జీసీసీ మాజీ డైరెక్టర్, కొండపర్తి మెంటాడ మండలం -
మెంటాడలో పడగవిప్పిన పాత కక్షలు
మెంటాడ : పాతకక్షల నేపథ్యంలో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మెంటాడలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, గ్రామస్తులు,పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయిపల్లి సీతన్న, అచ్చియ్య, దివంగత అప్పలనాయుడు ముగ్గురూ అన్నదమ్ములు. ఇదే గ్రామానికి చెందిన కొల్లి సత్యనారాయణ దివంగత అప్పలనాయుడు కుమార్తె కొండమ్మను వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా సత్యనారాయణకు మామయ్యల వరసయ్యే సీతన్న, అచ్చియ్య మధ్య భూ తగాదాలున్నాయి. గతంలో ఒకరిపై ఒకరు ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇటీవల వీధి కాలువ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి సత్యనారాయణను మట్టుబెట్టడానికి సీతన్న, అచ్చియ్య చూస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో సత్యనారాయణ ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం గమనించిన సీతన్న, ఆయన భార్య గౌరి, అచ్చియ్య మాటువేసి ఒక్కసారిగా దాడి చేశారు. సీతయ్య గొడ్డలితో సత్యనారాయణ ముఖం మీద కొట్టగా, ఆయ భార్య గౌరి పెద్ద కర్రతో తల వెనుక భాగంలో దాడి చేసింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు గమనించి స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్సై కె. నాయుడు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. మిన్నంటిన రోదనలు సత్యానారాయణ భార్యకొండమ్మ, తల్లిదండ్రులు గంగమ్మ, పైడపునాయుడు రోదనలతో ఆస్పత్రి ఆవరణ దద్ధరిల్లింది. ఎంతో నెమ్మదిగా ఉండే సత్యనారాయణను హత్య చేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఆండ్ర రిజర్వాయర్‌లో హెడ్‌కానిస్టేబుల్ గల్లంతు?
మెంటాడ: మండలంలోని ఆండ్ర పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పి.గోపాలకృష్ణాజీ(45) గురువారం ఆండ్ర రిజర్వాయర్‌లో గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం ఆండ్ర రిజర్వాయర్ వద్ద వెళ్లిన గోపాలకృష్ణాజీ ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని భావిస్తున్నారు. చెప్పులు, ద్విచక్ర వాహనం రిజర్వాయర్ వద్దే పడి ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజపతినగరం సీఐ విజయనాథ్, ఆండ్ర ఎస్ఐ భాస్కరరావు పర్యవేక్షణలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సాయంత్రం 6 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. విజయనగరంలో ఉంటున్న భార్య మాధవికి, సోదరులు వెంకట కృష్ణాజీ, శ్రీనివాసురావులకు సమాచారం అందజేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లలు లేరని గోపాలకృష్ణాజీ నిత్యం బాధపడేవారని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. -
గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
మెంటాడ: భర్తను కూలి పనుల కోసం పంపించేందుకు వెళ్లి తిరిగి ఇంటికెళ్తున్న గిరిజన మహిళపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని కొండలింగాలవలస పంచాయతీ మూలపాడు గిరిజన గ్రామానికి చెందిన మహిళ(28) తన భర్త కూలి పనికోసం వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఆయన్ను పంపించేందుకు బుధవారం రాత్రి ఆండ్రకు వచ్చింది. భర్త బయలుదేరాక నిత్యావసర సరుకులు, పిల్లలకు మిఠాయిలు కొని తిరిగి మూలపాడు వెళ్తుండగా ఆండ్రకు చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి ఆండ్ర ఎస్టీ కాలనీ నీటి ట్యాంకు సమీపంలోకి మహిళను ఎత్తుకుపోయారు. అక్కడ నోట్లో గుడ్డ కుక్కి లైంగికదాడికి పాల్పడ్డారు. కొంతసేపటికి తెలివిరావడంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న జి.బాషా, టి.పైడితల్లితో పాటు పలువురు మహిళలు వచ్చి దుస్తులు అందించి నీరు తాగించారు. శరీరమంతా గాయాలై కదల్లేని పరిస్థతిలో ఉన్న ఆమె రాత్రంతా ఆండ్రలోనే ఉండిపోయి గురువారం ఉదయం మూలపాడు వెళ్లి కులపెద్దలకు విషయాన్ని చెప్పింది. గ్రామపెద్దలతో కలిసి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆండ్ర పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. భర్త తనకు ఇచ్చిన రూ.5 వేలను కూడా యువకులు లాక్కున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నలుగురు వ్యక్తుల్లో ఎలుసూరి ఆది, సవరవిల్లి శంకరరావును గుర్తించానని, మిగతా ఇద్దరిని గుర్తించలేకపోయానని తెలిపింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజపతినగరం సీఐ కె.కె.వి.విజయ్‌నాథ్ తెలిపారు.