మెంటాడ: భర్తను కూలి పనుల కోసం పంపించేందుకు వెళ్లి తిరిగి ఇంటికెళ్తున్న గిరిజన మహిళపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని కొండలింగాలవలస పంచాయతీ మూలపాడు గిరిజన గ్రామానికి చెందిన మహిళ(28) తన భర్త కూలి పనికోసం వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఆయన్ను పంపించేందుకు బుధవారం రాత్రి ఆండ్రకు వచ్చింది. భర్త బయలుదేరాక నిత్యావసర సరుకులు, పిల్లలకు మిఠాయిలు కొని తిరిగి మూలపాడు వెళ్తుండగా ఆండ్రకు చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి ఆండ్ర ఎస్టీ కాలనీ నీటి ట్యాంకు సమీపంలోకి మహిళను ఎత్తుకుపోయారు.
అక్కడ నోట్లో గుడ్డ కుక్కి లైంగికదాడికి పాల్పడ్డారు. కొంతసేపటికి తెలివిరావడంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న జి.బాషా, టి.పైడితల్లితో పాటు పలువురు మహిళలు వచ్చి దుస్తులు అందించి నీరు తాగించారు. శరీరమంతా గాయాలై కదల్లేని పరిస్థతిలో ఉన్న ఆమె రాత్రంతా ఆండ్రలోనే ఉండిపోయి గురువారం ఉదయం మూలపాడు వెళ్లి కులపెద్దలకు విషయాన్ని చెప్పింది. గ్రామపెద్దలతో కలిసి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆండ్ర పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
భర్త తనకు ఇచ్చిన రూ.5 వేలను కూడా యువకులు లాక్కున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నలుగురు వ్యక్తుల్లో ఎలుసూరి ఆది, సవరవిల్లి శంకరరావును గుర్తించానని, మిగతా ఇద్దరిని గుర్తించలేకపోయానని తెలిపింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజపతినగరం సీఐ కె.కె.వి.విజయ్‌నాథ్ తెలిపారు.
గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
Published Fri, Feb 12 2016 1:22 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement