మంత్రి గంటాకు వినతిపత్రం అందజేస్తు న్న సంధ్యారాణి తదితరులు(ఫైల్), మృణాళినికి వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు(ఫైల్)
సాక్షి, మెంటాడ: మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని నాలుగున్నరేళ్ల క్రితం టీడీపీ మంత్రులు, నియోజకవర్గానికి చెందిన ఆపార్టీ నాయకులు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వపాలనా కాలం పూర్తయినా కళాశాల ఏర్పాటుకు ఒక్క అడుగూ ముందుకు వేసిన పాపాన పోలేదు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2014 డిసెంబర్8న నిర్వహించిన జోన్–4 గ్రిగ్స్ క్రీడల ప్రారంభోత్సవానికి అతిథిగా హాజ రైన నాటి రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణికి మెంటాడలో బాలికలకు ప్రత్యేక హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ మండలవాసులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం మరోమారు మం డల కేంద్రంలో స్త్రీశక్తి భవనం ప్రారంభోత్సవం, చల్లపేటలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరైన మృణాళిని, స్వాతిరాణి మాట్లాడుతూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తామని భరోసానిచ్చారు. మృణాళిని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సం ధ్యారాణి, మెంటాడ మాజీ వైస్ ఎంపీపీ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ చైర్మన్ గెద్ద అన్నవరం, మండల టీడీపీ ప్రచార కన్వీనర్ రెడ్డిరాజగోపాల్ తదితరులు 2017 డిసెంబర్‌లో అమరావతిలో విద్య, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి 2017–2018 విద్యాసంవత్సరం నుంచి జూనియ కాలేజ్ నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వపాలనా కాలం ముగిసినా కళాశాల ఏర్పాటు కాకపోవడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు.
విద్యార్థులకు తప్పని అవస్థలు
మెంటాడలో జూనియ కాలేజ్ ఏర్పాటు చేస్తే, మెంటాడ మండలంతో పాటు పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలానికి చెందిన 9 పంచాయతీలు, పాచిపెంట మండలంలోని పలుగిరిజన గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అనంతగిరి, పాచిపెంట, మెంటాడ మండలాల నుంచి ఏటా ఇంటర్‌విద్య కోసం సుమారు 12 వందల మంది విద్యార్థులు గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, విశాఖపట్నం తదితర పట్టణాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థోమత లేక మధ్యలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు.
చదువులు మానుకోవాల్సి వస్తోంది
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో ఈప్రాంత పేదవిద్యార్థులు పదోతరగతి తర్వాత చదువుమానుకోవాల్సి వస్తోంది. నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. వందలమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిసి కూడి కళాశాల ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదు. వచ్చే ప్రభుత్వమైనా కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
–అగతాన త్రినాథ, మాజీ సర్పంచ్, లోతుగెడ్డ, మెంటాడ మండలం
టీడీపీ ప్రభుత్వం విఫలమైంది
మెంటాడలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నాటి, నేటి మంత్రులు మృణాళిని, గంటా శ్రీనివాసరావుతో పాటు ఈ ప్రాంత టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్‌పర్స్‌న్ శోభా స్వాతిరాణి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.పి.భంజ్‌దేవ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. గిరిజనుల అభివృద్ధికి వీరు చేసింది శూన్యం. కనీసం విద్యార్థులు చదువుకునేందుకు కళాశాల కూడా ఏర్పాటు చేయలేకపోయారు.
–అంజిలి పైడితల్లి, జీసీసీ మాజీ డైరెక్టర్, కొండపర్తి మెంటాడ మండలం
Comments
Please login to add a commentAdd a comment