old notes case
-
‘ట్రాక్టర్ బొమ్మ ఉన్న రూ.5 నోటు ఉందా.. అయితే లక్షాధికారి మీరే’
సాక్షి, కామారెడ్డి: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త ఎత్తుగడలతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా పాత రూ. 5 నోటుకు లక్షలు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని నిలుపుదోపిడీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి కస్తూరి నర్సింలుకు ఈనెల 1న ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాతకాలంనాటి రూ.ఐదు నోటు ఉంటే రూ. 11.74 లక్షలు ఇస్తామని, లక్షాధికారి మీరేనని నమ్మించారు. దీనిని నమ్మిన నర్సింలు.. తన వద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న రూ. 5 నోటు ఉందని వారితో చెప్పాడు. అకౌంట్ ఓపెన్ చేయాలని, ఎన్వోసీ అని, ఐటీ క్లియరెన్స్ అని మోసగాళ్లు పలు దఫాలుగా డబ్బులు పంపించమన్నారు. నిజమే కావచ్చని నమ్మిన నర్సింలు పది విడతల్లో రూ. 8.35 లక్షలు వారు చెప్పిన వ్యాలెట్లు, అకౌంట్లలో జమ చేశాడు. ఇంకా డబ్బులు పంపించాలని వారు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి శుక్రవారం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దేవునిపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు. వచ్చిన ఫోన్‌కాల్ పశ్చిమబెంగాల్‌కు చెందినదిగా గుర్తించామన్నారు. బంపర్ డ్రాలు, బహుమతుల పేరిట వచ్చే ఫోన్‌కాల్స్‌ను ప్రజలు నమ్మవద్దన్నారు. చదవండి: మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు! టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. -
పాతనోట్ల కేసులో సినీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి కేసులో పరారీలో ఉన్న సినీ దర్శకుడు నల్లూరి రామకృష్ణ అలియాస్ కిట్టు(కేటుగాడు మూవీ ఫేం)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నోట్ల మార్పిడి దందా చేస్తున్నాడని సమాచారంతో పోలీసులు అతని ఆఫీసుపై దాడి చేయగా గోడ దూకి కిట్టు పరారైన విషయం తెలిసిందే. ఈ సినీ డైరెక్టర్ హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి రద్దైన పాత నోట్లకు బదులుగా కమీషన్ పద్ధతిలో కొత్త నోట్లు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ మేరకు గత మార్చి 13వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2 కమలాపురి కాలనీలోని తన సినిమా కార్యాలయంలో నోట్ల మార్పిడి చేపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి రూ.1.3 కోట్ల మేర పాత నోట్లను స్వాధీనం చేసుకొని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతని కారు, కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో కిట్టుపై బంజారాహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే కిట్టు ప్రముఖ సినీ నిర్మాత మనువడితో రాయబారం నడిపినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో బెంగళూరుకు చెక్కేశాడు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గురువారం ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని చర్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.