పాతనోట్ల కేసులో సినీ డైరెక్టర్ అరెస్ట్
పరారీలో ఉన్న సినీ దర్శకుడు అరెస్ట్
Published Fri, Jun 2 2017 8:00 PM | Last Updated on Tue, Oct 2 2018 2:54 PM
హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి కేసులో పరారీలో ఉన్న సినీ దర్శకుడు నల్లూరి రామకృష్ణ అలియాస్ కిట్టు(కేటుగాడు మూవీ ఫేం)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నోట్ల మార్పిడి దందా చేస్తున్నాడని సమాచారంతో పోలీసులు అతని ఆఫీసుపై దాడి చేయగా గోడ దూకి కిట్టు పరారైన విషయం తెలిసిందే.
ఈ సినీ డైరెక్టర్ హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి రద్దైన పాత నోట్లకు బదులుగా కమీషన్ పద్ధతిలో కొత్త నోట్లు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ మేరకు గత మార్చి 13వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2 కమలాపురి కాలనీలోని తన సినిమా కార్యాలయంలో నోట్ల మార్పిడి చేపట్టాడు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి రూ.1.3 కోట్ల మేర పాత నోట్లను స్వాధీనం చేసుకొని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతని కారు, కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో కిట్టుపై బంజారాహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే కిట్టు ప్రముఖ సినీ నిర్మాత మనువడితో రాయబారం నడిపినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో బెంగళూరుకు చెక్కేశాడు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గురువారం ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని చర్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.
Advertisement
Advertisement