మెడిసిన్ బాబా
జ్వరమో, జలుబో లేదా మరే రోగమో వస్తే... డాక్టరు దగ్గరకు వెళ్తాం. ఆయన రాసిచ్చిన మందులను కొంటాం. వాడతాం. రెండు, మూడు రోజుల్లో కొంచెం నయమనిపించగానే వాటిని వాడటం మానేస్తాం. మనందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఏ ఇంట్లో చూసినా వాడకుండా వదిలేసిన మందులు కుప్పలుగా ఉంటాయి. వాడని వాటిని మందులషాపులో వెనక్కి ఇచ్చి డబ్బు తెచ్చుకునే వారు ఏ కొందరో! ఇలా జనం దగ్గర వృథాగా పడున్న మందులను సేకరించి... మందులు కొనే శక్తిలేని నిరుపేదలకు అందజేస్తే... అంతకన్నా మానవసేవ ఏముంటుంది! ఇదే బృహత్కార్యాన్ని చేస్తున్నారీయన.
అందుకే ఢిల్లీలోని పేదలు ఈయన్ని ‘మెడిసిన్ బాబా’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అసలు పేరు ఓంకార్ నాథ్. బ్లడ్ బ్యాంకులో టెక్నీషియన్‌గా పనిచేసి రిటైరయ్యారు. వయసు 79 ఏళ్లు. మొదటి ఫోటోలో కనిపిస్తున్నట్లుగా కాషాయవస్త్రాలు ధరించి ఇంటింటికీ వెళ్లి మందులు సేకరిస్తారు. రోజుకు ఏడు కిలోమీటర్లు ఇలా తిరుగుతారు. తర్వాత ఇంటికొచ్చి ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూసి... పనికొచ్చే వాటిని వేరుచేస్తారు. వాటిని తీసుకెళ్లి తన అద్దె ఇంట్లోని ముందు రూములో ఉంచుతారు. అదో మెడికల్ హాలులాగే ఉంటుంది. తన దగ్గరకు వచ్చే పేదలకు ప్రిస్కిప్షన్ చూసి మందులిస్తారు. గత ఎనిమిదేళ్లుగా ఈ పనిచేస్తున్నారీయన... హ్యాట్సాఫ్ టు యూ మెడిసిన్ బాబా.