ఎక్కడివక్కడే!
ముందుకు కదలని వన్ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణాలు
శంకుస్థాపన, లబ్ధిదారుల ఎంపికతోనే ఆగిన ప్రక్రియ
చెరువు భూముల్లో నిర్మాణాలు
మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
జీ ప్లస్ త్రీ ప్రణాళిక సిద్ధం సీఎం హామీలు అమలయ్యేనా!
హన్మకొండ : జనవరిలో సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించారు. మురికివాడల్లో వన్ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయూలని ఆదేశించారు. ఎంపిక చేసిన వాడలు చెరువు శిఖం, పురావస్తుశాఖ పరిధిలో ఉన్నారుు. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనుమతులు పొందాలి. ఈ అంశాలను పక్కన పెట్టిన నగరపాలక సంస్థ అధికారులు నిర్మాణాలకు సిద్ధమంటూ ప్రతిపాదనలు రూపొందించారు. వాటి ఆధారంగా సీఎం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఐదు నెలల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో శంకుస్థాపన చేయించడం, ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక తర్వాత లే అవుట్ రూపకల్పన దగ్గర పనుల్లో స్తబ్దత ఏర్పడింది. చెరువుశిఖం, పురవస్తుశాఖ పరిధిలో ఉన్న స్థలాల్లో లే అవుట్లకు అనుమతి సాధించడం కష్టంగా మారింది.
జీ ప్లస్ 3 అయితే ఒక చోట సాధ్యం
హన్మకొండ అభివృద్ధి చెందడంతో సిద్ధం చెరువు కనుమరుగైంది. ఇందులో జితేందర్‌నగర్, అంబేద్కర్‌నగర్ మురికివాడలు వెలిశాయి. ఆ తర్వాత కుడా మాస్టర్ ప్లాన్‌లో ఈ స్థలం పార్కు కోసం కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదు. దీనితో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని మినహాయించి లే అవుట్ రూపొందిస్తే ఇక్కడ ఎంపిక చేసిన లబ్ధిదారులకు జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం కష్టంగా మారింది. దీనితో జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపడితే ఇక్కడ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత లక్ష్మీపురం ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ సైతం అంతర్గతరోడ్లు, పార్కులతో కూడిన లే అవుట్‌ను సిద్ధం చేసే క్రమంలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సేకరించాల్సి ఉంది. దానితో ఇక్కడ కూడా జీ ప్లస్ త్రీ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
నెల రోజులుగా ఎదురుచూపులు
ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్‌నగర్(గరీబ్‌నగర్), సాకారాశికుంట మురికివాడలు చెరువు శిఖం భూముల్లో వెలిశాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఈ స్థలాలు చెరువుశిఖం ప్రాంతంలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. ఇక్కడ ప్రస్తుతం ఉన్న వందలాది కుటుంబాలు అక్రమంగా నివాసం ఉంటున్నట్లుగానే కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) రికార్డుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థలాలలో నిర్మాణం చేపట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నెల కిందట ప్రతిపాదనలు పంపించారు. ఆ తర్వాత అడుగుముందుకు పడలేదు. మరోవైపు ఖిలావరంగల్‌లోని మట్టికోటకు ఆనుకోని గిరిప్రసాద్ నగర్ ఉంది. ఈ మురికివాడ మొత్తం ఆర్కియాలజీ శాఖ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఆర్కియాలజీశాఖ ఆధీనంలో ఉన్న స్థలం నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నూతన నిర్మాణాలకు అనుమతి లేదు. ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించాలంటే కేంద్ర పురవస్తుశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.
విషయం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015 జనవరిలో వరంగల్ నగరంలో నాలుగు రోజులపాటు పర్యటించారు. తొమ్మిది మురికివాడల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఐదు నెలల్లో అందరికీ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం : సీఎం హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. కేవలం శంకుస్థాపన, లబ్ధిదారుల ఎంపికతోనే పనులు ఆగిపోయాయి. అనంతరం లే-అవుట్ రూపకల్పన దగ్గర పనుల్లో స్తబ్దత ఏర్పడింది.
సమస్య : చెరువు శిఖం భూములు, బఫర్ జోన్, పురావస్తుశాఖ నిబంధనలు
వన్ ప్లస్ వన్‌కు అడుగడుగునా అడ్డు పడుతున్నారుు. ఫలితంగా పురోగతి కనుమరుగైంది. అధికారులు ఏమి చేయూలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
అధికారులు చేసేది : సీఎం ఎంపిక చేసిన మురికి వాడల్లో జీ ప్లస్ వన్ పద్ధతితో ఇళ్ల నిర్మాణం చేపట్టే ఆస్కారం లేదు. దీంతో అధికారులు జీ ప్లస్ త్రీ పద్ధతితో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.