ప్రాణం తీసిన కాలువ స్నానం
భీమడోలు : గోదావరి కాలువలో సరదాగా స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. మరో యువకుడి కోసం రాత్రి వరకూ గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం దక్కలేదు. ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్మలు కాగా మరో యువకుడు సమీప బంధువు కుమారుడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న చేసిన ప్రయత్నాలు విఫలం కావడమంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఉన్న కనకదుర్గమ్మ ఆలయ సమీపంలోని స్నానాల రేవు వద్ద విషాద ఘటనలో ఏలూరు సత్యనారాయణపేటకు చెందిన మండాది దిలీప్‌కుమార్ (18) అనే యువకుడు మరణించాడు. వివరాలిలా ఉన్నాయి.. గుండుగొలనుకు చెందిన మండాది కృష్ణమోహన్ పిల్లల చదువుల కోసం 14 ఏళ్ల క్రితం ఏలూరుకు మ కాం మార్చారు. కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మోహనమురళీ బీటెక్ చదువుకుని భీమడోలులో ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్‌లో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు మండాది దిలీప్‌కుమార్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వారి సమీప బంధువు కుమారుడు 24 ఏళ్ల నేలపూడి మనోహర్ బీటెక్ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మోహనమురళీ రోజూ ఏలూరు నుంచి భీమడోలు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్, మనోహర్ శనివారం బైక్‌పై భీమడోలులో మోహనమురళీ వద్దకు వచ్చారు. సరదాగా గడిపిన వారంతా భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద గల స్నానాల రేవుకు వచ్చి ఫొటోలు దిగారు. కాలువ ఉధృతంగా ప్రవహించడం గుర్తించని ముగ్గురూ స్నానానికి దిగారు. వారిలో మనోహర్ మొదటగా కాలువలో కొట్టుకుపోయాడు. అన్నదమ్ములు మోహనమురళీ, దిలీప్‌కుమార్ కాలువ గట్టువెంబడి కొట్టుకుపోతుండగా మోహనమురళీ బయటపడ్డాడు. అయినా తమ్ముడు దిలీప్‌కుమార్‌ను రక్షించేందుకు మరలా కాలువలో దూకాడు. వీరిద్దరూ కాలువలో కొట్టుకుపోతుండగా ఆలయం వద్ద పనిచేస్తున్న కందుల దుర్గతో పాటు మరో మహిళ కాపాడేందుకు కాలువలోకి చీరలు, తాళ్లు విసిరారు. వీటిద్వారా మోహనమురళీ గట్టుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు.
కొనసాగుతున్న గాలింపు
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. తన కళ్లెదుటే గల్లంతయిన ఇద్దరిని తలుచుకుంటూ మోహనమురళీ రోదించాడు. బోటు, గజ ఈతగాళ్ల సహాయంతో సీఐ ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పీవీబీఎల్ పద్మావతి ఆధ్వర్యంలో ఎస్సై బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. కాలువ అడుగున ఉన్న దిలీప్‌కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. గుండుగొలను, ఏలూరు, భీమడోలు ప్రాంతాల నుంచి బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దిలీప్‌కుమార్ మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మనోహర్ మృతదేహం గాలింపునకు చీకటి అడ్డంకి కావడంతో గజఈతగాళ్లు వెనుదిరిగారు.