one year aniversary
-
జీఎస్టీ తొలి బర్త్‌డే : పన్ను చెల్లింపుదారులు జంప్
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పన్ను విధానం జీఎస్టీ అమలు అయి రేపటికి(జూలై 1) ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. జీఎస్టీని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది పలు ప్రయోజనాలను చేకూర్చుతుందని కేంద్ర చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకే జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగారు. జీఎస్టీ అమల్లోకి వచ్చే నాటికి 63.76 లక్షలుగా ఉన్న పన్ను చెల్లింపుదారులు, ఇప్పటికి 1.12 కోట్లకు చేరుకున్నారని తెలిసింది. యాక్టివ్ పన్ను చెల్లింపుదారులు విపరీతంగా పెరగడం, అధికారిక రంగంలో మరిన్ని వ్యాపారాలు చేరాయని, ఆర్థిక వ్యవస్థలో అధికారీకరణ పెరుగుతుందనే దానికి సంకేతమని ఆర్థిక వేత్తలంటున్నారు. కొత్త పన్ను విధానంలో ఐటీ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ చాలా బాగుందని, యూజర్ అనుభవాన్ని, ఇంటర్ఫేస్ను మరింత మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ప్రతి నెలా కోట్ల రూపాయల రిటర్నులు దాఖలవుతూ.. జీఎస్టీ విధానం ఎంతో విజయవంతంగా అమలవుతుండటం ఎంతో ఆనందదాయకం. తొలి ఏడాదిలోనే నెలకు సుమారు రూ.90 వేల కోట్ల సగటు రెవెన్యూలను ఇది ఆర్జించింది. ఏప్రిల్‌లో లక్ష కోట్లను ఇది అధిగమించింది. ఇప్పటి వరకు 12 కోట్ల రిటర్నులు దాఖలు అయ్యాయి. 380 కోట్ల ఇన్వాయిస్లు ప్రాసెస్ అయ్యాయి. 1,12,15,693 మంది పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ సిస్టమ్‌లో నమోదయ్యారు. వీరిలో 63,76.967 మంది ముందస్తు పన్ను విధానం నుంచి ఈ కొత్త విధానంలోకి రాగ, మిగతా 48,38,726 మంది కొత్తగా పన్ను విధానంలోకి ప్రవేశించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను అంతకంతకు ఇది పెంచుతుంది‘ అని జీఎస్టీఎన్ చైర్మన్ ఏబీ పాండే తెలిపారు. యూజర్ ఇంటర్ఫేస్ను మెరుగుపరచడం, ఫైలింగ్‌ను సులభతరం చేయడం, తప్పుడు మెసేజ్‌లను అదుపులో ఉంచడం వంటి జీఎస్టీ విధానాన్ని మరింత విజయవంతంగా అమలయ్యేలా చేస్తున్నాయని చెప్పారు. -
శోభానాగిరెడ్డికి ఘన నివాళి
ఆళ్లగడ్డ: దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి సంవత్సరికం సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభఘాట్ను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శోభానాగిరెడ్డి కుమారుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, కుమార్తె మౌనికారెడ్డి, భూమా మహేశ్వరరెడ్డి, భూమా బ్రహ్మనందరెడ్డి, కిశోర్‌రెడ్డి, జగన్నాధరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి, కుమార్‌రెడ్డి తదితర నేతలు శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. పట్టణంలోని భూమా నివాస గృహంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ నగర పంచాయతీ కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు. శోభానాగిరెడ్డి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శోభానాగిరెడ్డి తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతిని ఏప్రిల్ 24వ తేదీన ఘనంగా నిర్వహిస్తామని పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి తలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు.