మూడు కావాలంటే.. 'ఫోర్' కొట్టాల్సిందే!
టెస్టుల్లో అగ్రస్థానం కైవసం చేసుకున్న టీమిండియా వన్డేల్లో మాత్రం ర్యాకింగ్స్ లో కాస్త వెనకబడి ఉందన్నది వాస్తవం. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 3-0తో సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ సేన దాయాది పాకిస్తాన్ నుంచి అగ్రస్థానాన్ని లాగేసుకుంది. అయితే త్వరలో కివీస్ తో ప్రారంభంకానున్న ఐదు వన్డేల సిరీస్ ను 4-1తో నెగ్గితేనే వన్డేల్లో నాలుగో ర్యాంకులో ఉన్న మహేంద్రసింగ్ ధోనీ సేన మరో ర్యాంకు మెరుగు పరుచుకుని మూడో ర్యాంకులో నిలుస్తుంది. భారత్ మూడో స్థానంలో నిలవాలంటే కచ్చితంగా ఈ సిరీస్ లో నాలుగు వన్డేల్లో దుమ్మురేపాల్సి ఉంటుంది.
మూడో ర్యాంకులో ఉన్న కివీస్ ఖాతాలో 113 పాయింట్లుండగా, భారత్ ఖాతాలో 110 పాయింట్లు ఉన్నాయి. భారత్ కంటే మూడు పాయింట్లు అధికంగా ఉన్న కివీస్ పై సిరీస్ ను 4-1తో నెగ్గితే వారి ర్యాంకును మనం సాధిస్తే, టీమిండియా ర్యాంకు(4)లో కివీస్ నిలుస్తుంది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంతో సిరీస్ లో ఆడనుండగా, భారత టాప్ ర్యాంకర్ అశ్విన్ కు బోర్డు విశ్రాంతి ఇచ్చింది. బ్యాటింగ్ లో దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉండగా, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.