జీజీఎస్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
గొల్లపాలెం (మలికిపురం) :
గ్రామాభివృద్ధి విషయంలో ఓఎన్జీసీ వైఖరికి నిరసనగా మలికిపురం మండలం గొల్లపాలెంలో గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. జీజీఎస్ ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 25 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా వందలాది మంది మహిళలు, గ్రామస్తులు శిబిరం కూర్చొన్నారు. కాకినాడ డీఎస్పీ వి.విజయరావు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జీజీఎస్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఓఎన్జీసీ అధికారుల తరపున గ్రామస్తులతో చర్చించారు. ఆయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల బావులు దెబ్బతినే అవకాశం ఉందని, బావులు మూసుకుపోతే ఒక్కొక్క బావిని మరలా తెరిచేందుకు రూ.కోటికి పైగా ఖర్చవుతుందని ఓఎన్జీసీ అధికారులు ఆందోళన చెందుతున్నట్టు వివరించారు. కొన్ని ట్యాంకులు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చి, స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు భీష్మించారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు సెప్టెంబర్ ఒకటో తేదీన వస్తారంటున్నారని చెప్పారు. అప్పటి వరకూ ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామం నుంచి కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు తరలించుకు పోతున్న ఓఎన్జీసీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు ఈ ఆందోళన చేపట్టారు.
డీఎస్పీ వైఖరితో ఉద్రిక్తత : ఎమ్మెల్యే ఆగ్రహం
మలికిపురం : గొల్లపాలెం ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీజీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులను బలవంతంగా తొలగించేందుకు కాకినాడ డీఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో పోలీసులు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు ఫోన్లో తెలిపారు. వెంటనే అక్కడి చేరుకున్న ఎమ్మెల్యే సూర్యారావు డీఎస్పీతో పాటు ఓఎన్జీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తుల పోరాటం చేస్తుంటే, వారి ఆవేదన వినేందుకు ఒక్క ఓఎన్జీసీ అధికారి కూడా రాకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. లాఠీ చార్జీ చేస్తే.. ముందు తనపై చేయాలని చెప్పారు.
ఓ కేంద్ర మంత్రి హస్తం?
గొల్లపాలెంలో ఉద్రిక్తతకు ఓ కేంద్ర మంత్రి వైఖరి కారణమని తెలుస్తోంది. గొల్లపాలెం జీజీఎస్లో ఆయనకు కాంట్రాక్టు ఉందని, ఈ ఆందోళనల వల్ల ఆయన పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్టు తెలిసింది. దీంతో ఆ మంత్రి.. కలెక్టర్, ఎస్పీలకు ఫో¯Œæలో హుకుం జారీచేశారని, దీంతో పోలీసులు, స్థానిక ఓఎన్జీసీ అధికారుల చర్యల వల్ల ఉద్రిక్తత ఏర్పడినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆగ్రహంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు.