ONGC Videsh Ltd
-
సఖాలిన్–1 క్షేత్రాల్లో ఓవీఎల్‌కు 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: రష్యాలోని సఖాలిన్–1 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో తిరిగి 20 శాతం వాటాలను తీసుకున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఆపరేటర్ అయిన అమెరికన్ సంస్థ ఎక్సాన్‌మొబిల్ అనుబంధ కంపెనీ ఎక్సాన్ నెఫ్ట్‌గాజ్‌ను పక్కకు తప్పించి, దానికి సంబంధించిన అసెట్స్ అన్నింటిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతేడాది కొత్త ఆపరేటర్‌కు బదలాయించారు. గతంలో తమకున్న వాటాలను తిరిగి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అప్పట్లో షేర్‌హోల్డర్లయిన జపాన్ సంస్థ సోడెకో కన్సార్షియం, ఓవీఎల్‌కు రష్యా ప్రభుత్వం సూచించింది. దానికి అనుగుణంగానే ఓవీఎల్ దరఖాస్తు చేసుకోగా, తదనుగుణంగా గతంలో దానికి ఉన్నంత వాటాలను కేటాయించింది. సోడెకో కూడా తన వాటాను అట్టే పెట్టుకుంది. అయితే, ఎక్సాన్‌మొబిల్ విషయంలో స్పష్టత రాలేదు. గతంలో సఖాలిన్1లో ఎక్సాన్ నెఫ్ట్గ్యాస్, సోడెకో సంస్థలకు చెరి 30 శాతం, రాస్‌నెఫ్ట్‌కు 20 శాతం వాటాలు ఉండేవి. 2001లో ఓవీఎల్ ఇందులో 20 శాతం వాటాలు తీసుకుంది. గతేడాది అక్టోబర్‌లో ఈ ప్రాజెక్టును సఖాలిన్–1 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి రష్యా బదలాయించింది. ఈ కొత్త కంపెనీలో ఓవీఎల్, రాస్‌నెఫ్ట్‌కు చెరి 20 శాతం, సోడెకోకు 30 శాతం వాటాలు ఉండగా.. ఎక్సాన్‌మొబిల్ వాటా విషయంలో ఇంకా ఏమీ తేలలేదు. ఉక్రెయిన్ మీద దాడికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో సఖాలిన్–1 నుంచి ఉత్పత్తిని ఎక్సాన్ నెఫ్ట్గాజ్ నిలిపివేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సఖాలిన్–1లో రోజుకు 2,20,000 బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తయ్యేది. నవంబర్ నుంచి మళ్లీ 1,40,000–1,50,000 బీపీడీ మేర ఉత్పత్తి మొదలుపెట్టారు. -
మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో ఓవీఎల్‌కు 10% వాటా
న్యూఢిల్లీ: దేశీయ ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో 10% వాటాను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ అనుబంధ కంపెనీ ఓఎన్జీసీ విదేశీ ద్వారా యూఎస్ సంస్థ అనడార్కో పెట్రోలియం కార్పొరేషన్‌కు గల 10% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు 264 కోట్ల డాలర్ల(సుమారు రూ. 17,000 కోట్లు)ను వెచ్చించనుంది. గడిచిన ఏడాది కాలంలో ఓవీఎల్‌కు ఇది నాలుగో డీల్ కావడం విశేషం. గతేడాది సెప్టెంబర్ నుంచి చూస్తే కంపెనీ 1,100 కోట్ల డాలర్ల విలువైన డీల్స్‌ను కుదుర్చుకుంది. మొజాంబిక్లోగల రోవుమా-1 ఆఫ్‌షోర్ క్షేత్రం 65 ట్రిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలను కలిగి ఉన్నట్లు అంచనా. ఈ క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ఎల్‌ఎన్‌జీగా మార్పుచేసి ఇండియాకు దిగుమతి చేసుకోవాలనేది ఓవీఎల్ ప్రణాళిక. కాగా, ఆయిల్ ఇండియాతో కలిసి జూన్‌లో వీడియోకాన్ గ్రూప్ నుంచి ఇదే బ్లాకులో 10% వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు 247 కోట్ల డాలర్లను చెల్లించనుంది. రోవుమా-1లో ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్‌కు సైతం 10% వాటా ఉంది. వెరసి రోవుమా-1లో దేశీయ కంపెనీలు మొత్తం 30% వాటాను సొంతం చేసుకోనున్నాయి. తద్వారా రోజుకి 60-80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను పొందేందుకు వీలు కలగనుంది. ఓఎన్జీసీ ఓవీఎల్ ఏర్పాటయ్యాక 2011 వరకూ మొత్తం 15 దేశాలలో 32 ఆస్తులను కొనుగోలు చేసింది. ఇందుకు 17 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇక గత ఏడాది కాలంలో మరో 11 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా మరో నాలుగు డీల్స్‌ను కుదుర్చుకోవడం గమనార్హం.