ఆన్లైన్ ‘పండుగ’..!
►ఈ–కామర్స్ కంపెనీల పోటాపోటీ
► 90 శాతం దాకా డిస్కౌంట్ సేల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్ ఫెస్టివల్ మొదలైంది. పండుగల సీజన్ కోసం ఈ–కామర్స్ కంపెనీలు డిస్కౌంట్లతో సవాల్ విసురుతున్నాయి. డేటా చార్జీలు దిగిరావడం, 4జీ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. దీంతో కొత్త యూజర్లు తోడుకావడంతో ఆన్లైన్ షాపింగ్ ఈసారి జోరుమీద ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
ఇంకేముంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌తోపాటు పేటీఎం మాల్ సైతం ‘క్లిక్’ అయ్యే ఆఫర్లతో సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ డెకోర్.. ఇలా వందలాది విభాగాల్లో కస్టమర్ల ముందుకు లక్షలాది ఉత్పత్తులను తీసుకొచ్చాయి. సులభ వాయిదాల్లో మొత్తాలను స్వీకరించేందుకు సై అంటున్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఆన్లైన్ వేదికగా సుమారు రూ.11,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా పండుగల సీజన్‌కు ఈ–కామర్స్ కంపెనీలు రూ.6,500 కోట్ల వ్యాపారం చేశాయి.
డీల్స్‌లో దేనికదే సాటి..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ నేటి నుంచే రంగంలోకి దిగుతోంది. 24వరకు ఉండే ఈ ఫెస్టివల్లో బిగ్ డీల్స్ ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఆసక్తికర అంశం ఏమంటే డబ్బులు వచ్చే ఏడాది చెల్లించొచ్చు అంటూ ఈ కంపెనీ కొత్త డీల్‌కు తెరలేపింది. దీని కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు వాయిదా మొత్తాన్ని 2018 జనవరి నుంచి చెల్లించొచ్చు. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 24 వరకు విక్రయాలను జరుపనుంది. 90 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే సేల్‌లో భాగంగా కార్లు, హాలిడే ప్యాకేజెస్, టెలివిజన్ల వంటి బహుమతులతో విక్రేతలను ప్రోత్సహిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గోటేటి వెల్లడించారు.
విక్రేతలు రెండు రెట్ల అమ్మకాల వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగామన్నారు. బై నౌ, పే లేటర్ అంటూ ఫ్లిప్‌కార్ట్ సైతం కస్టమర్లను ఊరిస్తోంది. ఇక వేలాది ఉత్పత్తులపై 15 నుంచి 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లతో గట్టిపోటీ ఇచ్చేందుకు పేటీఎం మాల్ ఇప్పటికే రంగంలోకి దిగింది. సెప్టెంబరు 23 వరకు ఉండే మేరా క్యాష్‌బ్యాక్ సేల్ కోసం రూ.501 కోట్లను కేటాయించింది. ప్రతి ఆర్డరుపై ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుందని పేటీఎం మాల్ సీవోవో అమిత్ సిన్హా వెల్లడించారు. ఈ నెల 25 వరకు అన్‌బాక్స్ దివాలీ సేల్కు స్నాప్‌డీల్ సమాయత్తమైంది. సెప్టెంబర్ 28 వరకు మహాభారత్ దివాలీ సేల్కు షాప్‌క్లూస్.కామ్ సిద్ధమైంది.
స్మార్ట్ఫోన్లదే హవా..
ఆన్లైన్ కంపెనీలు ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులతో ప్రధానంగా స్మార్ట్ఫోన్లతో పోటీకి సై అంటున్నాయి. విలువ పరంగా ఈ–కామర్స్ వ్యాపారం లో స్మార్ట్ఫోన్ల వాటాయే అత్యధికంగా 55% దాకా ఉంది. 160 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, 100 ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో ఈ–కామర్స్ వ్యాపారంలో 60 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొబైల్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, కిచెన్, హోంకేర్ తదితర విభాగాల్లో అమ్మకాలు గణనీయంగా ఉండనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లో రెండుమూడు రెట్ల వృద్ధి ఆశిస్తోంది. సేల్‌లో 80% దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు షాప్‌క్లూస్ సహ వ్యవస్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు.