డిజిటల్ పేమెంట్స్‌కు ఎస్బీఐ దన్ను
♦ ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ చార్జీల తగ్గింపు
♦ నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీల్లో 75 శాతం వరకు కోత
♦ రూ.1,000 లోపు ఐఎంపీఎస్ ట్రాన్స్‌ఫర్స్‌పై చార్జీల రద్దు
♦ 5 కోట్లకుపైగా కస్టమర్లకు ప్రయోజనం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) తాజాగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీల్లో కోత విధించింది. వీటిని 75 శాతం వరకు తగ్గించింది. ఈ తగ్గింపు నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. దీనివల్ల 5.27 కోట్ల మంది కస్టమర్లు ప్రయోజనం పొందుతారని కూడా బ్యాంకు తెలియజేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. అలాగే బ్యాంక్.. ఐఎంపీఎస్ ద్వారా జరిపే ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై (రూ.1,000 వరకు) చార్జీలను రద్దు చేసింది.
తాజా నిర్ణయంతో నెఫ్ట్ చార్జీలు ఇలా...
నెఫ్ట్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు (రూ.10,000 వరకు) రూ.1కి, (రూ.1 లక్ష వరకు) రూ.2కు తగ్గనున్నాయి. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.3కి దిగివస్తాయి. బ్యాంక్ ప్రస్తుతం ఈ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై రూ.12 వరకూ చార్జీలను వసూలు చేస్తోంది. ఇక రూ.2 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉంటాయి. ఈ చార్జీలు ప్రస్తుతం రూ.20గా ఉన్నాయి.
ఆర్టీజీఎస్ చార్జీల విషయానికి వస్తే..
ఆర్టీజీఎస్ విధానంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉంటాయి. ప్రస్తుతం బ్యాంక్ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్కి రూ.20 చార్జీని వసూలు చేస్తోంది. ఇక రూ.5 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే రూ.10 చార్జీ పడుతుంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.40గా ఉన్నాయి. కొత్తగా సవరించిన అన్ని చార్జీలకు జీఎస్టీ రేటు 18% వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ శాఖల్లో ఎగ్జిక్యూటివ్స్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఇక మార్చి చివరి నాటికి ఎస్బీఐకి 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు, 2 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు.
డిజిటల్ లావాదేవీల వృద్ధిలో మూడేళ్లు ముందే..
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. మే నెలలో పీవోఎస్ టర్మినల్స్ వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణం కేవలం ఏడు నెలల్లోనే (గతేడాది నవంబర్ నుంచి) రూ.70,000 కోట్ల స్థాయికి చేరింది. డీమోనిటైజేషన్ సహా కేంద్ర ప్రభుత్వపు వివిధ కార్యక్రమాలు దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఒకవేళ డీమోనిటైజేషన్ జరిగి ఉండకపోతే పీవోఎస్ మెషీన్ల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణం ఈ స్థాయిని చేరుకోడానికి కనీసం మూడేళ్ల కాలం పట్టేదని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. పీవోఎస్ టర్మినల్స్ సంఖ్య పెరగడం, డిజిటల్ లావాదేవీలు సరళతరం కావడం వంటి అంశాల కారణంగా రానున్న రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. ఎం–వాలెట్, పీపీఐ కార్డులు, పేపర్ వోచర్స్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి వినియోగం కూడా పెరిగిందని పేర్కొంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని తెలిపింది.