Online gambling
-
Illegal betting: చట్ట విరుద్ధంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 జోరుగా సాగుతుండడంతో, మరోవైపు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలు కూడా ఉపందుకుంటున్నాయి. అనధికారిక మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నడుస్తున్నట్టు, ఈ రూపేణా ఏటా రూ.2లక్షల కోట్ల మేర పన్ను ఆదాయాన్ని భారత్ కోల్పోతున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) నివేదిక తెలిపింది. చట్ట వ్యతిరేకంగా నడిచే క్రీడల బెట్టింగ్ మార్కెట్లోకి భారత్ నుంచి ఏటా రూ.8,20,000 కోట్లు వస్తున్నట్టు ఈ ఫోరమ్ అంచనా వేసింది. ప్రస్తుత జీఎస్టీ రేటు 28 శాతం ప్రకారం చూస్తే ఈ మొత్తంపై భారత్ ఏటా రూ.2,29,600 కోట్లు నష్టపోతున్నట్టు తెలిపింది. ఈ తరహా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాల నిరోధానికి నూతన జీఎస్టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ సంస్థల కార్యకలాపాలను గుర్తించేందుకు, అవి భారత్‌లో రిజిస్టర్ చేసుకునేలా చూసేందుకు టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తద్వారా భారత్ నుంచి పెద్ద మొత్తంలో బెట్టింగ్ కోసం నిధులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. లేకుంటే మరింత నష్టం ప్రభుత్వం వైపు నుంచి కఠిన చర్యలు లేకుంటే మరింత ఆదాయ నష్టం ఏర్పడుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. నూతన జీఎస్టీ విధానంతో చట్టపరిధిలో పనిచేసే గేమింగ్ మార్కెట్ బదులుగా చట్ట విరుద్ధంగా పనిచేసే ఆఫ్‌షోర్ బెట్టింగ్ కంపెనీలు ఎక్కువ వృద్ధిని చూడనున్నాయని, ఫలితంగా మరింత పన్ను నష్టం ఏర్పడుతుందని వివరించింది. ఐపీఎల్ సమయంలోనూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగడాన్ని ప్రస్తావించింది. మన దేశంలో బెట్టింగ్, గేమింగ్‌పై 14 కోట్ల మంది సాధారణంగా పాల్గొంటూ ఉంటారని, ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందని వెల్లడించింది. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లావాదేవీలపై నిషేధం విధించడంతో చట్ట విరుద్ధంగా భారత్ లోపల, భారత్ నుంచి వెలుపలకు నిధులు తరలింపు కోసం రహస్య పద్ధతులను అనుసరించేందుకు దారితీస్తున్నట్టు వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీలు, అక్రమ చానళ్లు నిధుల తరలింపునకు వీలు కలి్పస్తూ.. భారత్ దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు విసురుతున్నట్టు పేర్కొంది. ఇలా అక్రమంగా తరలించే నిధులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు, జాతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు వనరులుగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 75 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లు భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత యూజర్లను ఆకర్షించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది. -
ఆ యాడ్‌తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్‌లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌పై అన్‌టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
తమిళనాట హైలైట్ ట్విస్ట్.. స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్
గతకొద్దిరోజులుగా తమిళనాడులో సీఎం స్టాలిన్ వర్సెస్ గవర్నర్‌్ ఆర్ఎన్ రవి అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. సీఎం స్టాలిన్, గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. అయితే, అంతకుముందు.. సీఎం స్టాలిన్ సోమవారం రెండోసారి గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాము ప్రజల కోసం తీసుకొచ్చిన బిల్లును బహిరంగ వేదికపై గవర్నర్ విమర్శించారని, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కోరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి.. గవర్నర్ గైడ్‌గా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం ప్రజలకు మంచి చేసేందుకు సిద్ధంగాలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద మరో 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలన్న బిల్లు కూడా ఇందులో ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆన్లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తమిళనాడులో 40 మందికిపైగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆమోదించిన ఈ తరహా బిల్లును కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ బిల్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో, తొలిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన 131 రోజుల తర్వాత గవర్నర్ గత నెలలో ఈ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి ఆమోదించి గవర్నర్‌కు రెండోసారి ఈ బిల్లును ప్రభుత్వం పంపింది. -
స్టాలిన్ సర్కార్‌కు షాకిచ్చిన గవర్నర్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వస్తున్న ఆన్లైన్ గేమింగ్ బిల్లును వెనక్కి తిప్పి పంపారాయన. ఆన్లైన్ జూదంపై నిషేధంతో పాటు ఆన్లైన్ గేమ్స్‌పై నియంత్రణ కోసం స్టాలిన్ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే నెలల తరబడి ఆ బిల్లును పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ రవి.. ఇప్పుడు దానిని వెనక్కి పంపారు. తమిళనాడులో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా.. పదుల సంఖ్యలో ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయి (ఆ సంఖ్య 44కి చేరుకుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది). ఇంతకు ముందు అన్నాడీఎంకే ప్రభుత్వ సమయంలోనూ ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి సంబంధించి ఒక చట్టం చేసింది. అయితే ఆ సమయంలో కోర్టు దానిని కొట్టేసింది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మాజీ జడ్జి జస్టిస్ కే చంద్రు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది. ఆయన ప్రతిపాదనల మేరకు ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించింది స్టాలిన్ సర్కార్. కిందటి ఏడాది అక్టోబర్‌లో తమిళనాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది కూడా. ఆపై బిల్లును రాజ్‌భవన్‌కు పరిశీలనకు పంపింది. అయితే గవర్నర్ రవి ఆ బిల్లుకు (మొత్తం 20 బిల్లుల దాకా పెండింగ్‌లోనే ఉంచారాయన) క్లియరెన్స్ ఇవ్వకపోగా.. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్షాలు సైతం గవర్నర్ తీరును తప్పుబట్టాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు.. బిల్లుపై కొన్ని సందేహాలు ఉన్నాయంటూ ఆయన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి బిల్లును తిప్పి పంపించారు. దీంతో అధికార డీఎంకే మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 20 బిల్లుల్లో యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలనే బిల్లు సైతం ఉండడం గమనార్హం. మరోపక్క గవర్నర్ తీరును ప్రభుత్వం ఏకిపారేస్తోంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ.. బీజేపీ, ఆరెస్సెస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శిస్తోంది. మరోవైపు సీఎం స్టాలిన్ సైతం గవర్నర్ తీరును నిరసిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన. అయితే ఎన్ని విమర్శలు చెలరేగినా.. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తానని గవర్నర్ రవి తేల్చేశారు. -
ఆన్లైన్లో జూదమా?.. జర జాగ్రత్త..!
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా ఇటీవల 3,800 మందికి పైగా డబ్బు పోగొట్టుకున్నారని, రికార్డు కాని కేసులు మరిన్ని ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్కిల్స్ ఆధారంగా నడిచే గేమ్స్ ద్వారా ఈ గ్యాబ్లింగ్ జరుగుతుంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక జనాదరణ పొందిన వాటిలో ఆన్లైన్ జూదం ఒకటి. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో 1.10 బిలియన్ల మంది అంటే జనాభాలో 79 శాతం మందికి మొబైల్ సదుపాయం ఉంటే వారిలో 42 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. వీరిలో 92.8 శాతం మంది ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. అవి, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, టాబ్లెట్లు, హ్యాండ్‌హెల్డ్ డివైస్, మీడియా స్ట్రీమింగ్ పరికరాలతో పాటు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ల ద్వారా జరుగుతుంటుంది. చట్టబద్ధమేనా!? పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్–1867 ఆధారంగా, భారతదేశంలో అన్నిరకాల జూదం చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ)పై పందెం వేయడం చట్టవిరుద్ధం. చట్టబద్ధతను అర్థం చేసుకోవాలంటే.. బెట్టింగ్ జరిగే రెండు రకాల గేమ్‌ల గురించి మనం మరింత అర్థం చేసుకోవాలి. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇవి అదృష్ట ఆధారిత గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ గేమ్‌ల కోసం పందెం వేయడానికి ముందస్తు జ్ఞానం లేదా అవగాహన అవసరం లేదు. నైపుణ్యం గల గేమ్స్ ఇవి ఎంపిక కంటే విశ్లేషణాత్మక నిర్ణయం తీసుకోవడం, తార్కిక ఆలోచన, సామర్థ్యం అవసరమయ్యే గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం. మిగతా ప్రాంతాల్లో ఇవి చట్టవిరుద్ధం అయినప్పటికీ మోసగాళ్లు ఆన్లైన్ వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు.. (ఎ) కరేబియన్ – కురాకై గేమింగ్ (బి) మెడిటరేనియన్ నుండి మాల్టా గేమింగ్ అథారిటీ (సి) యుకె గ్యాంబ్లింగ్ కమిషన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుండి లైసెన్స్‌లను పొందినవి. ఇవి ఆయా దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. వీటి సమాచారం మనకు కనపడనంత చిన్నగా రాసి ఉంటుంది. సాధారణంగా ఫుటర్‌లో వీటిని లిస్ట్ చేసిన దేశాలలో మాత్రమే ప్లే చేయవచ్చని పేర్కొని ఉంటుంది. కానీ, అన్ని దేశాల్లోకి ఈ గేమ్స్ ద్వారా మోసగాళ్లు చొరబడటానికి ఆన్లైన్లో పొంచి ఉంటున్నారు. మన దేశంలో .. ప్రస్తుత ట్రెండ్లకు సరిపోయే విధంగా చట్టపరంగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ (గ్యాంబ్లింగ్ యాక్ట్)తో రావడానికి పౌరసంఘాలు, సాంకేతిక సంస్థలు, సైబర్ పోలీసులు, సైబర్ లాయర్ల నుండి మరిన్ని చర్చలు అవసరం. యాపిల్, గూగుల్‌లో గ్యాంబ్లింగ్ యాప్‌లు అనుమతించని జాబితాలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే మినహాయించబడ్డాయి. ఈ యాప్‌లు వెబ్సైట్ల నుండి (APK,DMZఫైల్ల ద్వారా) మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి కాదని గుర్తించాలి. గ్యాంబ్లింగ్ యాప్స్ నిర్వహణ దశ 01: ముందుగా, మీరు ఒక సూచన ద్వారా ఈ యాప్‌లో చేరుతారు. దశ 02: మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. యాప్ నిర్వాహకులు బ్రిటీష్ పేర్లతో ఉన్న మహిళలు, విదేశీ వ్యక్తుల ఫోటోలతో ఉంటాయి. ్ఖఓ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాటిని ఆపరేట్ చేస్తారు. దశ 03: పందెంలో పాల్గొనబోతున్నందుకు మీరు మీ రోజువారీ లాభంలో 40 శాతం కమీషన్‌గా చెల్లించాలని కోరుతారు. దశ 04: కమీషన్‌ను బదిలీ చేయకుండా ఉండటానికి సబార్డినేట్ అనే కొత్తవ్యక్తిని పరిచయం చేస్తారు. దశ 05: మీరు యాప్‌లో చేరిన తేదీ నుండి 5 రోజుల తర్వాత ప్రతి రిఫరల్ వ్యక్తి రూ.3000 సంపాదించినట్టు చూపుతారు. దశ 06: ఒకే రోజున 3 రెఫరల్స్ ఉన్నట్లయితే, వారు చేరిన 5 రోజుల తర్వాత ఒకరికి రూ.3000 తోపాటు అదనంగా మరో రూ.5000 ఇస్తారు. ఇది ఒక ఎక్కువ మొత్తం కోసం వేసే ఎర అని గుర్తుపెట్టుకోవాలి. దశ 07: 7–10 రోజుల తర్వాత ఫస్ట్æ విత్‌డ్రావల్ చేయవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.10,000 పందెం పూర్తయిన తర్వాతే తీసుకోవాలి.. దశ 08: ఒకసారి విత్‌డ్రాకు అర్హత పొందితే, 68 గంటల్లో నగదు మొత్తం మన బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. దశ 09: 20–30 రోజులకు ఒకసారి ఎక్కువ మొత్తం జమ అయ్యే రోజు ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ 10,000 ఖాతాలో అన్ని సమయాల్లో ఉండేలా మనం మరింత డబ్బు చేర్చాలి. దశ 10: సాధారణంగా రోజుకు రూ. 800. ఎక్కువ వాటాలు ఉన్న రోజున, అది రూ.1500 నుండి రూ.2000 దాటుతుంది. దశ 11: మోసగాళ్లు ఎక్కువ లాభాల కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తారు. ఆపై వారు ఒక రోజులో సూపర్ హై షేర్ని సృష్టిస్తారు. దీంతో ప్రజలు తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల నష్టాలను నివారించడానికి Sరు.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. దశ 12: ప్రజలు బ్యాలెన్స్‌లను కొనసాగించగలిగినప్పటికీ, వారు కొత్తగా పెట్టుబడి పెట్టిన మొత్తం పందెంలో పాల్గొననందున వారు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. దశ 13: చాలా మంది వ్యక్తులు డబ్బును పోగొట్టుకోవడం చూసినప్పుడు, నమ్మకాన్ని పొందడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే నష్టపరిహార ప్రణాళికను అందిస్తారు. దశ 14: అందరూ నిద్రపోతున్న చోట అర్ధరాత్రి పందెం వేస్తే, అందరూ మేల్కొనే సమయానికి మన ఖాతాలో ఏమీ మిగిలి ఉండదు. చివరి వ్యక్తి మొత్తం డబ్బును పోగొట్టుకునే వరకు పందెం కొనసాగుతుంది. దశ 15: చెల్లింపు/రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ను క్లోజ్ చేస్తారు. విత్‌డ్రాæవిధానం రద్దయ్యి ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్‌ను క్లోజ్ చేస్తారు. చదవండి:Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే.. -
జీవితమే ఒక జూదం
ప్రపంచంలో అతికొద్దిమంది అదృష్టవంతులకు తప్ప జీవితం నల్లేరుపై బండినడక కాదు. అలాగని అదృష్టం అందరికీ దక్కేది కాదు. అందుకే అదృష్టం కోసం మనుషులు అర్రులు చాస్తారు. స్వయంకృషి ఉంటే, అదృష్టం దానంతట అదే తరుముకుంటూ మరీ వస్తుందని ఎందరు మహానుభావులు ఎన్ని సూక్తులు వల్లించినా జనాభాలో అత్యధికులు అదృష్టాన్నే నమ్ముకుంటారు. . అదృష్టాన్ని నమ్ముకోవడం సామాన్య మానవుల సహజసిద్ధమైన బలహీనత. ఈ బలహీనతను కనిపెట్టిన ప్రాజ్ఞులు అదృష్టయంత్రాలు, తాయెత్తులు తదితర వస్తుజాలాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం కద్దు. వాళ్లను మించిన నిపుణులు ద్యూతశాలలను నిర్వహిస్తుంటారు. అదృష్టంపై మనుషులకు నమ్మకం అనాది నుంచే ఉంది. నాణేలు వాడుకలోకి రాకముందు నుంచే బొమ్మా బొరుసు ఆట ఉండేది. నాణేలు లేనికాలంలో జనాలు తమ అదృష్టాన్ని తేల్చుకునేందుకు ఆల్చిప్పలతో బొమ్మా బొరుసు ఆడేవారు. చేతి ఎముకలతో తయారు చేసిన పాచికలతో రకరకాల ద్యూతక్రీడలు ఆడేవారు. జూదం ఎరుగని నాగరికతలేవీ ప్రపంచంలో లేవు. జూదంలో అన్నీ పోగొట్టుకుని అడవులపాలైన ధర్మరాజు ఉదంతం మహాభారతం ద్వారా మనందరికీ తెలుసు. అంతకుముందు నల మహారాజు కూడా జూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. ‘కన్యాశుల్కం’లో గురజాడ ‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అని కరటక శాస్త్రి ద్వారా అనిపించడంలో వ్యంగ్యం ధ్వనిస్తుంది గానీ, వేదాల్లో జూదం ప్రస్తావన ఉందనేది అక్షరసత్యం. ఋగ్వేదంలోని ‘ద్యూతసూక్తం’ ఇందుకు నిదర్శనం. అంతమాత్రాన జూదాన్ని నెత్తికెత్తుకోలేదు మనవాళ్లు. సప్తవ్యసనాల జాబితాలో చేర్చారు. ‘ద్యూతంహీనామ పురుషస్య అసింహాసనం రాజ్యం’ అంటూ జూదరిని సింహాసనం లేని రాజ్యంతో అభివర్ణించాడు ‘మృచ్ఛకటికం’ నాటకంలో శూద్రకుడు. జూదంలో మాయోపాయాలు మామూలే! ‘నీకునౌ నీకునౌ నంచు నెమకి నెమకి/ ముగుదలగు వారి భ్రమియించి మోసపుచ్చు/ పశ్యతోహరు డత్యంత పాపబుద్ధి/ పట్టణములో దగుల్పరి పందెగాడు’– ‘క్రీడాభిరామం’లోని ఈ వర్ణనను చూస్తే, జూదంలో పందెగాళ్ల మోసకారితనం ఈనాటిది కాదని అర్థమవుతుంది. ద్యూతక్రీడలో పాచికలు చాలా పురాతనకాలం నుంచి వాడుకలో ఉంటే, పేకముక్కలు ఆ తర్వాత వచ్చి చేరాయి. పేకాటకు మూలాలు చైనాలో ఉన్నాయి. టాంగ్ రాజుల హయాంలో కులీనులు కాలక్షేపం కోసం పేకాట ఆడేవారని తొమ్మిదో శతాబ్దినాటి చైనా సాహిత్యం ద్వారా తెలుస్తోంది. పద్నాలుగో శతాబ్ది నాటికి పేకాట యూరోప్‌కు పాకింది. పద్నాలుగో శతాబ్ది చివరినాటికి యూరోపియన్ రాచరిక చిహ్నాలను ప్రతిబింబించే పేకముక్కలను రూపొందించుకున్నారు. అప్పట్లో పేకదస్తాలో యాభయ్యారు ముక్కలు ఉండేవి. పదిహేనో శతాబ్ది చివరినాళ్లలో యాభైరెండు ముక్కల ‘ఫ్రెంచ్ సూటెడ్’ పేకముక్కలు రూపొందాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ‘ప్రామాణిక’ పేకముక్కలు ఇవే! బ్రిటిష్‌కాలంలో పేకాట మనదేశం నలుచెరగులా వ్యాప్తిలోకి వచ్చింది. పేకాట ప్రస్తావన ఆనాటి సాహిత్యంలో విస్తృతంగా కనిపిస్తుంది. ‘చతుర్ముఖ పారాయణం’, ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ వంటి జాతీయాలు పేకాట వ్యాప్తి తర్వాత వాడుకలోకి వచ్చినవే! తొలినాళ్లలో పెద్దమనుషుల కాలక్షేపంగా మొదలైన పేకాట, అనతికాలంలోనే సామాన్యులనూ సోకింది. ఓడిపోతున్న కొద్దీ రెట్టించిన పట్టుదలతో ఆడటం పేకాటరాయుళ్ల ప్రథమ లక్షణం. ‘నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా/ నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు/ ఇక పెయిరయ్యే అవకాశం లేదు/ ఇప్పటికయినా మిడిల్‌డ్రాప్ పడెయ్యి’ అంటారు ‘మిడిల్‌డ్రాప్’ కవితలో వెల్చేరు నారాయణరావు. ఇలాంటి హితోక్తులు ద్యూతోద్రేకులను నిరుత్సాహపరచలేవు. ఉన్నదంతా ఊడ్చుకుపోతేగానీ వాళ్లకు తత్త్వం తలకెక్కదు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆటలో కలిసొచ్చే ముక్కలు చేతిలో ఉన్నప్పుడు పేకాటరాయుళ్ల హుషారు మామూలుగా ఉండదు. సాక్షాత్తు వైకుంఠమే తమ అరచేతిలో ఇమిడిపోయిందనేంతగా పరవశులవుతారు. అలాంటి సందర్భాల్లోనే కొందరికి ఆశుకవిత్వం కూడా తన్నుకొస్తుంది. ‘కన్యాశుల్కం’లోని పేకాట సన్నివేశంలో ఆట రంజుగా సాగుతున్నప్పుడు పూజారి గవరయ్యకి ఇలాగే ఆశుకవిత్వం తన్నుకొచ్చి, ‘రాణా, డైమను రాణీ?/ రాణా యిస్పేటు రాణి, రాణా, కళావ/ర్రాణా ఆఠీన్రాణీ?/ రాణియనన్మధురవాణె, రాజుల రాణీ’ అంటూ పేకాట పరిభాషలోనే మధురవాణిని పొగుడుతూ పద్యం చెబుతాడు. చేతిలో పేకముక్కలుంటే చాలు, ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదనంతగా ఉంటుంది పేకాటరాయుళ్ల తన్మయావస్థ. ‘చెలువకు ప్లేయింకార్డుకు/ గల భేదం బేమొ చెప్పగలవా సుదతీ?/ చెలికన్న కార్డునందే/ వలపధికంబని తలంపవచ్చు మదవతీ!’ అంటూ పేకాటరాయుడి అభిరుచి తీవ్రతను ‘కర్ణానందదాయిని’లో జి.బాలాజీదాసు వర్ణించారు. ప్రపంచంలోని మిగిలిన అంశాల మాదిరిగానే ద్యూతక్రీడలు కూడా కాలంతో పాటే పరిణామం చెందుతూ వస్తున్నాయి. ఆల్చిప్పలతో మొదలైన ద్యూతక్రీడలిప్పుడు ఆన్‌లైన్‌కు చేరుకున్నాయి. డబ్బు చేతులు మారే జూదాలనే జనాలు పట్టించుకుంటారు గానీ, నిజానికి ఈ మాయాప్రపంచంలో జీవితమే ఒక జూదం. బతుకు పోరులో గెలుపు కోసం ఎవరి పాచికలు వాళ్లు వేస్తూనే ఉంటారు. అదృష్టం ఎప్పుడైనా తమ తలుపు తట్టకపోదా అనే ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు. -
చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే ఉపేక్షించం
సాక్షి, అమరావతి : శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ జూదానికి సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్ దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని చెప్పి ఊరుకోకుండా కేసు పెట్టడం జరిగింది. ఆ మర్నాడు స్వయంగా మంత్రి జయరామ్ కూడా స్పందించారు. ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించబోమని చెప్పారు. మా ప్రభుత్వం ఆ విధంగా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే.. ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పోలీసులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా, ఎవరినీ వదిలిపెట్టడమనేది ఉండదు.. కచ్చితంగా చర్య తీసుకుంటాం.దీనిలో భాగంగానే ఆన్లైన్ జూదంకు కళ్లేం వేయాలనే అంశంతో నేడు జూదాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావడం జరిగింది.ఆన్లైన్ జూదానికి పిల్లలు అలవాటు కావొద్దనే వారి భవిష్యత్తు చెడిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.గత అయిదేళ్లలో ప్రభుత్వం దాన్ని నియంత్రించడానికి కనీసం చట్టం కూడా ఎందుకు తీసుకు రాలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి.. రాజకీయంతో దాన్ని ట్విస్ట్ చేయాలన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్న తీరు ఏ మాత్రం బాగా లేదని' సీఎం స్పష్టం చేశారు. -
ప్రభుత్వ అధికారులను కూడా వదలం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను సక్సెస్ ఫుల్‌గా కట్టడి చేశాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది అన్నారు సెబ్ (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్. ఈ సందర్భంగా సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ‘సెబ్ పరిధిలో 4వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా 106 మంది సిబ్బందిని అదనంగా పెంచారు. గంజాయి, గుట్కా, ఎర్ర చందనం స్మగ్లింగ్, ఆన్లైన్ గాంబ్లింగ్‌లను కూడా ప్రభుత్వం సెబ్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్, గాంబ్లింగ్ అడుతూ యువకులు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. మాఫియాల మూలాలు కనిపెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్) ‘ఎర్ర చందనంపై ప్రత్యేక నిఘా ఎర్పాటు చేస్తాం. ఫారెస్ట్, పోలీస్ శాఖలను సమన్వయ పరుచుకొని ఎర్రచందనం రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. కొండకింద గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి స్మగ్లర్ల భరతం పడతాం. అక్రమ రవాణాని అడ్డుకొనేందుకు రాష్ట్ర సరిహద్దులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అక్రమార్కులకు సహకరిస్తే ప్రభుత్వాధికారులను కూడా వదలం. ప్రభుత్వ లక్షాన్ని ఛేదించటమే లక్ష్యంగా సెబ్ ముందుకు సాగుతుంది అన్నారు. -
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ : రానా, కోహ్లీకి హైకోర్టు షాక్
చెన్నై : ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పై సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్ తెలిపాడు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. -
మదనపల్లెలో జోరుగా ఆన్లైన్ మట్కా
► ఒడిశా కేంద్రంగా ఆన్లైన్ జూదం ► చేనేత కార్మికులు, కూలీలే లక్ష్యంగా ఎర ► 47 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ► ఇంటి దొంగలనూ వదిలేది లేదన్న డీఎస్పీ మదనపల్లె రూరల్ : చేనేత కార్మికులు, దినసరి కూలీలే లక్ష్యంగా మదనపల్లె పట్ట ణంలో జోరుగా సాగుతున్న ఆన్లైన్ మ ట్కా గుట్టు రట్టయింది. ఆన్లైన్లో వేలాది రూపాయలు మట్కా ఆడుతూ జీవితా లను బుగ్గిచేసుకుంటున్న 47 మందిని సోమవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఆమె సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నీరుగట్టువారిపల్లెకు చెందిన ఓ చేనేత కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఒడిశా కేంద్రంగా రిజిస్టర్ అయిన కపిల్ ఆన్లైన్ మట్కా వెబ్సైట్లో బ్యాంకు అకౌంటు అనుసంధానంతో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో మట్కా ఆడుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి నిందితుల ఫోన్ కాల్స్, ఆన్లైన్ వ్యవహారాలపై నిఘా పెట్టామన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ మట్కా ఆడుతున్నట్టు గుర్తిమన్నారు. మదనపల్లె పట్టణంలో 86 మంది ఈ ఆట ఆడుతున్నట్లు తేలిందన్నారు. రూ.1 నుంచి ఎంత అయినా డబ్బు కట్టి మట్కా ఆడితే రూపాయకు 90 రూపాయలు ఇస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్నారని వివరించారు. కొందరు స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, కూలీల వద్ద డబ్బులు కట్టిస్తూ, లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో 47 మందిపై సెక్షన్ 420, ఏపి గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1)కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు. మట్కా ఆడే విధానం గూగుల్లోకి వెళ్లి కపిల్ సత్తా మట్కా అని కొట్టగానే వెబ్సైట్ వివరాలతో కూడిన సైట్లు, గేమ్ ఆడే విధానంపై యూట్యూబ్‌కు సంబంధించిన వీడియో కనిపిస్తా యి. వీటిలో మొదట ఉన్న సత్తా మట్కానెట్.కపిల్.మట్కా.ఇన్.మొబి.కామ్‌పై ఎంటర్ చేయగానే కపిల్ మట్కా పేరుతో ఆటకు సంబంధించిన వివరాలు, వివిధ రకాల ఆటలు, వాటి టైమింగ్స్‌కు సంబం ధించిన వివరాలు స్క్రీన్‌పై ప్రతక్ష్యమవుతాయి. అందులో ఇచ్చిన వివరాల ప్రకా రం మన వివరాలు నమోదుచేసి, లాగిన్ అయ్యాక అందులో మనకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబరుకు ఫోన్ చేసి మనం ఏ ఆట ఆడాలనుకుంటున్నామో తెలిపితే వారు దానికి సంబం«ధించి రూ.1,000లను తమ అకౌంట్ నంబరుకు వేయమంటారు. మనం అందులో డబ్బులు చెల్లించి ఆ రశీదును వాట్సప్ ద్వారా వారికి పంపితే నిర్వాహకులు మనకు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని సింగిల్ నంబర్, డబుల్ నంబర్ గేమ్‌లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మనం కట్టిన నెంబర్‌కు మట్కా తగిలితే మన అకౌంట్‌కు దానికి సంబంధించిన మొత్తానికి పాయింట్లు యాడ్ అవుతాయి. లేకుంటే మన పాయింట్లు తగ్గుతూ వస్తాయి. మనం గెలిచిన పాయింట్లకు సంబంధించిన డబ్బులు మనం రిజిస్టర్ చేసిన బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఇంటి దొంగలను వదిలే ప్రసక్తిలేదు మట్కా వ్యవహారంలో కొంతమంది పో లీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలి పారు. ఈ కేసు విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పారు. విచారణలో పోలీసుల పాత్ర ఉందని తెలిసినా, ఎవరైనా సమాచారం అందించినా చర్యలు తీసుకుంటామన్నారు. గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1)కింద కేసులు నమోదైతే ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల ఎంపికకు అనర్హులు అవుతారని చెప్పారు. మట్కా, ఆన్లైన్ పేకాట, ఇతర జూదాలు ఆడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.