పుట్టింటికెళ్తే.. రెండో పెళ్లి చేసుకున్నాడు!
► మొదటి భార్య పంచాయతీ ప్రథమ పౌరురాలు
► తనకు జరిగిన అన్యాయంపై పోలీసుకు ఫిర్యాదు
► అయినా పట్టించుకోలేదంటూ ఆరోపణ
► న్యాయం చేయకపోతే ఎస్పీని కలుస్తానంటున్న బాధితురాలు
రాయదుర్గం రూరల్ : ఆమె పంచాయతీ ప్రథమ పౌరురాలు. అటువంటి ఆమెకే భర్త నిరాదరణ తప్పలేదు. కాన్పు కోసం వెళ్తే.. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. రాయదుర్గం రూరల్ మండలం చదం గ్రామానికి చెందిన ఊలెప్పతో రాయదుర్గానికి చెందిన మౌనిక వివాహం 2011 మే 18న అయింది. 2013లో ఆమె సర్పంచ్‌గా గెలుపొందారు. నాలుగున్నరేళ్లుగా ఆమె సంతానం కోసం ఎన్నో పరీక్షలు చేయించుకున్నారు. ఎట్టకేలకు డిసెంబర్లో గర్భం దాల్చిన ఆమె నెల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
వారం కిందట పెళ్లి చేసుకుని..
బిడ్డ పుట్టినా చూసేందుకు వెళ్లని ఊలెప్ప వారం కిందట రెండో పెళ్లి చేసుకున్నాడని మౌనిక ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఐదు రోజుల కిందట ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎస్పీని కలసి న్యాయం కోరుతానన్నారు. దీనిపై ఎస్ఐ మహానంది స్పందిస్తూ... మౌనిక ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. అది కుటుంబ సమస్య కావడంతో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.