ఎలా అనుమతి ఇచ్చారు
- ఓపెన్ ఎయిర్ జిమ్‌పై ఎంసీజీఎంను ప్రశ్నించిన హైకోర్టు
- ఆగస్టు 6 లోగా స్పందించాలని బీఎంసీకి ఆదేశం
ముంబై: మెరైన్ డ్రైవ్‌లో ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఎలా అనుమతిచ్చారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం)ను బాంబే హైకోర్టు ఆదేశించింది. విజయ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏకే మీనన్‌తో కూడిన ధర్మాసనం, ఆగస్టు 6 లోపల స్పందించాలని దాఖలు చేయాలని ఆదేశించింది.
ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేని, వారసత్వ సంపదగా గుర్తించిన చోట జిమ్ ఏర్పాటు చేశారని పిటిషన్లో విజయ్ ఆరోపించారు. ‘ఫుట్‌పాత్ ఉన్నది నడవడానికి, కాని శివసేనతో సంబంధం ఉన్న డీఎన్ ఫిట్నెస్ అనే సంస్థ అక్కడ జిమ్ ఏర్పాటు చేసింది. ఎంసీజీఎం శివసేన నేతృత్వంలో ఉండటంతో అక్రమంగా ఏర్పాటు జరిగింది’ అని విజయ్ విమర్శించారు. 2013లో ఓ కాంగ్రెస్ ఎంపీ జిమ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరినపుడు ‘వారసత్వ సంపద’ అన్న కారణంతో నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్ సారోగి అన్నారు.