హోంగార్డు వీరంగం
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఓ హోంగార్డు క్రమ శిక్షణ తప్పాడు. వీరంగం సృష్టించాడు. చివరకు భక్తులు తిరగబడటంతో తోక ముడిచాడు. ఈ సంఘటన పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
బండలాగుడు పోటీలు కూడా నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన ఉలవలపల్లెకు చెందిన విశ్వనాథ్‌రెడ్డి అనే భక్తుడు అల్లరి చేస్తుండగా అతన్ని మందలించాల్సిన హోంగార్డు శేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దురుసుగా మాట్లాడాడు. అంతటితో ఆగక ‘ఖాకీ అంటే ఏమనుకుంటున్నావ్.. నా తడాఖా చూపిస్తా.. అనే లెవల్లో రెచ్చిపోయాడు.దీంతో భయపడిన విశ్వనాథ్‌రెడ్డి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు.
హోంగార్డు కూడా వెంబడించాడు. అయితే అతను దొరకలేదన్న అక్కసుతో లాఠీని విసిరాడు. అది కాళ్లకు తగులుకొని విశ్వనాథరెడ్డి కిందపడిపోయాడు. సంఘటనలో అతని కాలుకు గాయమైంది. ఇదంతా గమనించిన భక్తుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. హోంగార్డుపై తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తులో ఉన్న పోలీసులు హోంగార్డును వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి, విశ్వనాథరెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు.
ప్రధాన రహదారిపై రాస్తారోకో
హోంగార్డు చర్యలను నిరసిస్తూ బాధితుడు విశ్వనాథరెడ్డి బంధువులు కడప-పులివెందుల ప్రధాన ర హదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. కొందరు గ్రామస్తులు, పోలీసులు కల్పించుకుని వారికి సర్దిచెప్పారు. దీంతో వారు రాస్తారోకోను విరమించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని అదుపులోకి తెచ్చారు.