Orphaned corpses
-
అంతిమయాత్రలో ఆప్తుడై..
పెద్దపప్పూరు: అనాథ మృతదేహాలకు అతను ఆప్తుడు. పేగు తెంచుకుని పుట్టకపోయినా.. తోబుట్టువు కాకపోయినా.. ఓ ఆత్మీయుడిలా దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాడు. వివవరాల్లోకెళితే పెద్దపప్పూరు మండలం రామకోటికాలనీకి చెందిన భట్రాజు 15 సంవత్సరాలుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నాడు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 80 మృత దేహాలను తన సొంత ఆటోలో శ్మశానికి తరలించి, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నాడు. కరోనా నేపధ్యంలో ఇటీవల పెద్దపప్పూరు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణిస్తే.. గ్రామ పెద్దల అనుమతితో అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందాడు. ఒకవైపు అనాథ మృతదేహాకలు అంత్యక్రియలు నిర్వహిస్తూనే.. మరో వైపు ఆధ్యాత్మిక చింతనను ప్రజల్లో పెంపొందించేలా ప్రతి పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో ఆలయాల్లో భజన కీర్తనల పారాయణం చేస్తూ వస్తున్నాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా.. అనాథ మృతదేహం ఉన్నట్లు తనకు (94900 70655) సమాచారం అందిస్తే.. తన కుమారుడితో కలిసి ఆటో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి వస్తాననే భట్రాజు.. జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు.. మనకున్నంతలో ఎంత సేవ చేయగలిగామన్నదే ప్రధానమని పేర్కొంటుంటారు. ఆటోలో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తున్న భట్రాజు అయినవారు కాదంటే.. అయినవారందరూ ఉన్న ఓ దివ్యాంగుడు అనారోగ్యంతో మరణిస్తే.. అంతిమయాత్రలో పాల్గొనే వారు కరువయ్యారు. విషయాన్ని ఫోన్‌ద్వారా తెలుసుకున్న భట్రాజు ఆ గ్రామానికి చేరుకుని ఆప్తుడిలా ఆ దివ్యాంగుడికి అంత్యక్రియలు నిర్వహించి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపప్పూరు మండలంలోని గార్లదిన్నెకు చెందిన జక్కిలేరు (70) రెండు నెలల క్రితం కాలికి దెబ్బ తగిలి చికిత్సకు నోచుకోలేక అనారోగ్యంతో ఆదివారం మృతిచెందాడు. బంధువులకు సమాచారం అందించినా.. లాక్డౌన్ నేపథ్యంలో అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భట్రాజుకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. వెంటనే ఆ గ్రామానికి చేరుకున్న భట్రాజు.. జక్కిలేరు మృతదేహానికి స్నానపానాదులు, పూజలు చేసి, తన సొంత ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆపద సమయంలో ఆప్తుడిలా వచ్చిన భట్రాజును ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు. -
మానవత్వం మనిషి రూపులో..
60 ఏళ్లలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపిన మిథాలాల్ అహ్మదాబాద్: ఆయనేమీ ధనవంతుడు కాదు.. 15 ఏళ్ల వయసులో పొట్టకూటి కోసం పాకిస్తాన్‌నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.. జీవన పోరాటంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు అహ్మదాబాద్ వీధుల్లో రిక్షాపై తిరుగుతూ ముత్యాల హారాలు అమ్మే వీధి వ్యాపారిగా స్థిరపడ్డాడు. అయితేనేం మూర్తీభవించిన మానవత్వానికి తాను ప్రతిరూపమని నిరూపించుకున్నాడు మిథాలాల్ సింధీ. నా అనేవారు ఎవరూ లేని అనాథ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇలా ఆరు దశాబ్దాల కాలంలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించాడు. ఫుట్‌పాత్‌పై తన సహచరుడు మరణించినప్పుడు దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభమైన ఈ సేవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ‘ అనాథ శవం ఉందని సమాచారం రాగానే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి శరీరంపై మతపరమైన ఆనవాల్లేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తాను. ఏ మతస్తుడో తెలిస్తే ఆ మతపరమైన విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాను’ అని మిథాలాల్ చెబుతున్నాడు. ఒక్కో శవం అంత్యక్రియలకూ మిథాలాల్‌కు కనీసం రూ. 15 వందలు ఖర్చవుతుంది. ముత్యాల హారాలు అమ్ముతూ సమకూర్చుకున్న మొత్తాన్నే అందుకు వినియోగిస్తుంటాడు. 83 ఏళ్ల మిథాలాల్ గత 60 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పైనే జీవిస్తున్నాడు. తాను చేసే పనిలో పూర్తి సంతృప్తిగా ఉన్నానని, భగవంతుడు తనను ఇందుకోసమే పుట్టించాడని చెబుతూ ఉంటాడు. -
మార్చురీల్లోనే అనాథ శవాలు
సాక్షి, ముంబై: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీలో 119 అనాథ శవాలు అలాగే పడి ఉన్నాయి. బంధువులెవరూ రాకపోవడం ఆస్పత్రి యాజమాన్యాలకు తలనొప్పిగా పరిణమించింది. నియమ, నిబంధనల ప్రకారం వాటికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. ఆస్పత్రుల యాజమాన్యాలు పలుమార్లు లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో ఏడు నెలల నుంచి అవి శవాల గదిలో అలాగే ఉన్నాయి. నగరంలో జే.జే.,రాజావాడి, కూపర్, భగవతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. గత మూడేళ్ల నుంచి అనాథ శవాల సంఖ్య పెరుగుతోంది. దీంతో మున్ముందు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని ఆస్పత్రి యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వీటిని ఇంకెంత కాలం భద్రపర్చాలో అర్థం కాక ఆస్పత్రి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దేశ ఆర్థిక రాజాధాని నగరమైన ముంబైకి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉపాధి నిమిత్తం వస్తుంటారు. కొందరు కుటుంబ కలహాలతో ఇంటి నుంచి పారిపోయి వస్తుంటారు. మరికొందరు మానసిక స్థితి సరిగాలేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఉండిపోతారు. ఇలాంటి వారి తాలూకు వివరాలుగానీ, చిరునామాగానీ ఉండదు. ఇలా వచ్చిన వారంత రైల్వే ప్లాట్‌ఫాంలు, స్టేషన్ బయట ఉన్న ఖాళీ స్థలాలు, బస్టాండ్ పరిసరాల్లో ఉంటుంటారు. ఆనారోగ్యంతో లేదా ప్రమాదవశాత్తు చనిపోతే వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటి అనాథ శవాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించి చేతులు దులుపేసుకుంటున్నారు. ఆ తరువాత వైద్యులు వాటికి పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో భద్రపరుస్తారు. వారికి సంబంధించిన దస్తులు, ఆనవాళ్లు, ఇతర వస్తువులు స్టోర్ రూంలో భద్రపరుస్తారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వారి బంధువులెవరూ రాకపోవడంతో ఆస్పత్రిలో శవాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వాటిని నెలల తరబడి భద్రపర్చడం సవాలుగా మారింది. ప్రస్తుతం భగవతి ఆస్పత్రిలో 54, జే.జే ఆస్పత్రిలో 18, కూపర్ ఆస్పత్రిలో 20 అనాథ శవాలున్నాయి. -
శవాల రోదన...!
ఖమ్మం సిటీ: జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో అనాథ శవాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సంబంధీకులు వచ్చినా కూడా గుర్తించలేనంతగా తయారవుతున్నాయి. ‘రోగికి మందులేయటమే ఇక్కడ గగనం. శవాలను కూడా ఏం పట్టించుకునేది...’ అన్నట్టుగా ఈ ఆస్పత్రి అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోనే అతి పెద్దదైన ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ దయనీయంగా తయారైంది. అనాధ శవాలను భద్రపరిచేందుకు ఆరేళ్ల క్రితం రెండు ఫ్రీజర్లు ఈ ఆస్పత్రికి మంజూరయ్యాయి. ఇవి కొంతకాలం కింద మూలనపడ్డాయి. నిపుణులు మరమ్మతు పనిచేసిన తరువాత వారం పది రోజులపాటు బాగానే పనిచేసి, ఆ తరువాత మూలనపడేవి. ఇవి ఇలా తరచూ మొరాయిస్తుండడంతో ఆస్పత్రి అధికారులు కూడా మరమ్మతు చేయించకుండా పక్కన పడేశారు. దీంతో, మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పక్కకు పడేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దుర్గంధం భరించలేక మిగతా శవాలకు కూడా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించలేకపోతున్నారు. విధి నిర్వహణలో భాగంగా మార్చురీకి వచ్చిన ఓ కానిస్టేబుల్.. పురుగులు పట్టి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని చూసి వాంతులు చేసుకుచేసుకున్నాడు. దీనినిబట్టి ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించుకోవచ్చు. రైలు కిందపడి మృతిచెందిన వారి దేహాలను ఆచూకీ కోసం మార్చురీలో మూడు, నాలుగు రోజులపాటు ఉంచుతారు. కానీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వీటిని ఒక్క రోజు కూడా ఉంచడం లేదు. వారి సంబంధీకులు ఆ తరువాత వచ్చినప్పటికీ.. కడసారి చూపు దక్కడం లేదు. కొత్త ఫ్రీజర్లకు ప్రతిపాదనలు పంపించాం... కొత్త ఫ్రీజర్లకు ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య చెప్పారు. ఇప్పుడున్న ఫ్రీజర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని అన్నారు. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో కొత్త ఫ్రీజర్లు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని, దీనిపై మున్సిపల్ కమిషనర్‌తో కూడా మాట్లాడామని అన్నారు.ప్రస్తుతం ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం వాస్తవమేనన్నారు.