ఆస్కార్ విజేత ఫిలిప్ హఫ్‌మన్ అనుమానాస్పద మృతి
ఆస్కార్ అవార్డు విజేత, అమెరికన్ నటుడు ఫిలిప్ హఫ్‌మన్ మన్‌హట్టన్‌లోని తన అపార్టుమెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు. 'కాపోట్' చిత్రంలో నటనకు ఆస్కార్ అవార్డు సాధించిన ఈ 46 ఏళ్ల నటుడు డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన మరణానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
911 నెంబరుకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో పోలీసులు వెళ్లి చూసేసరికే హఫ్‌మన్ మరణించి ఉన్నాడు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ముందుగా ఈ కథనాన్ని ఇచ్చింది. తన భుజానికి ఒక హైపోడెర్మిక్ సూది గుచ్చుకుని ఉన్న ఆయన మృతదేహం అపార్టుమెంట్‌లోని బాత్రూంలో పడి ఉండగా ముందుగా ఓ స్క్రీన్ రైటర్ చూశారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హఫ్‌మన్.. 2005 సంవత్సరంలో ప్రముఖ రచయిత కాపోట్ జీవితచరిత్రగా తీసిన చిత్రంలో నటనకు ఆస్కార్ అవార్డు పొందారు.